దశాబ్ద కాలం తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా ముందు తలవంచింది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని కంగారూ జట్టుకు సమర్పించుకుంది. ఆసీస్ గడ్డపై 3-1 తేడాతో సిరీస్ ఓడిపోయి ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. అంతేకాదు.. వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాన్నీ చేజార్చుకుంది.
భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir) హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియాకు ఎదురైన మూడో ఘోర పరాభవం ఇది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలగగా.. గంభీర్ ఆ బాధ్యతలను స్వీకరించాడు. గతేడాది శ్రీలంక పర్యటన సందర్భంగా కోచ్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టాడు.
మాయని మచ్చలు
గతంలో ఏ స్థాయిలోనూ కోచ్‌గా పనిచేయని గంభీర్‌కు శిక్షకుడిగా తొలి ప్రయత్నం(టీ20 సిరీస్)లో విజయం వరించినా.. వన్డే సిరీస్‌లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక చేతిలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోయింది.
అనంతరం సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో మునుపెన్నడూ లేని పరాభవం చవిచూసింది. స్వదేశంలో ప్రత్యర్థితో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టుగా గంభీర్ మార్గదర్శనంలోని రోహిత్ సేన నిలిచింది.
అనంతరం.. ఆస్ట్రేలియాలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశాజనక ఫలితమే వచ్చింది. తద్వారా కోచ్‌గా గంభీర్ కెరీర్‌లో ఆరంభంలోనే ఈ మూడు మాయని మచ్చలుగా నిలిచిపోయాయి. ఆటగాళ్ల వైఫల్యం.. ముఖ్యంగా బ్యాటర్ల చెత్త ప్రదర్శన కారణంగానే ఈ మూడు సిరీస్‌లలో టీమిండియా ఓటమిపాలైనా.. కోచ్‌గా గౌతీ కూడా విమర్శలు ఎదుర్కోకతప్పదు.
గంభీర్‌పై వేటు వేయాలంటూ డిమాండ్లు!
ఈ నేపథ్యంలో ఇప్పటికే గంభీర్ కోచ్ పదవికి సరిపోడని.. జట్టును సరైన దిశలో నడిపించే సామర్థ్యం అతడికి లేదంటూ టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. రవిశాస్త్రి, ద్రవిడ్ హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను గుర్తుచేస్తూ.. గంభీర్‌ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
రోహిత్- కోహ్లిల సంగతేంటి?
ఇక గౌతం గంభీర్ సంగతి ఇలా ఉంటే.. సీనియర్ ఆటగాళ్లు, దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా ఏమీలేదు. తొలుత కివీస్‌తో టెస్టుల్లో.. అనంతరం ఆసీస్ గడ్డపై ఈ ఇద్దరూ విఫలం కావడం వల్లే ఇంతటి చేదు అనుభవాలు ఎదురయ్యాయనడంలో సందేహం లేదు. తమ ఆట తీరుతో యువకులకు మార్గదర్శకులుగా ఉండాల్సిన విరాహిత్ ద్వయం.. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకున్న తీరు అభిమానులకు సైతం కోపం తెప్పించింది.
ఈ నేపథ్యంలో గంభీర్‌తో పాటు.. రోహిత్, కోహ్లిలపై కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కఠిన చర్యలకు సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర అవమానం నేపథ్యంలో టెస్టుల్లో రోహిత్, కోహ్లి భవిష్యత్తుపై మేనేజ్‌మెంట్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. గంభీర్‌తో పాటు అతడి సహాయ సిబ్బంది అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డష్కటేలకు కూడా ఇప్పటికే గట్టిగానే చివాట్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయాల గురించి బీసీసీఐ వర్గాలు స్పందన మాత్రం భిన్నంగా ఉంది. IANSతో మాట్లాడుతూ.. ‘‘అవును.. రివ్యూ మీటింగ్ కచ్చితంగా ఉంటుంది.
గంభీర్ కోచ్‌గా కొనసాగుతాడు.. ఇక రోహిత్, కోహ్లి
అయినా.. ఒక సిరీస్‌లో బ్యాటర్లు వైఫల్యం చెందిన కారణంగా కోచ్‌పై వేటు వేస్తారా?.. అలా జరగనే జరుగదు. గౌతం గంభీరే ఇక ముందు కూడా కోచ్‌గా కొనసాగుతాడు. అదే విధంగా విరాట్, రోహిత్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆడతారు. ప్రస్తుతం టీమిండియా దృష్టి చాంపియన్స్ ట్రోఫీపైనే కేంద్రీకృతమై ఉంది’’ అని పేర్కొన్నాయి.
కాగా టీమిండియా జనవరి 22 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుపెట్టనుంది. తొలుత ఇరుజట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్.. అనంతరం మూడు వన్డేలు జరుగనున్నాయి. ఆ తర్వాత భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ ఐసీసీ టోర్నీ జరుగనుంది.
ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇక దాయాది పాకిస్తాన్‌ను ఫిబ్రవరి 23న ఢీకొట్టనుంది. అయితే, చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.
చదవండి: బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు.. అతడితో ఎందుకు గొడవపడ్డానంటే..
Comments
Please login to add a commentAdd a comment