అరంగేట్రంలోనే అద్భుత అర్ధ శతకంతో దుమ్ములేపాడు ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్(Sam Konstas). బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో మెల్‌బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు ఈ టీనేజర్. వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి.. తొలి మ్యాచ్‌లో 60 పరుగులతో సత్తా చాటాడు.
అనంతరం.. సిడ్నీ టెస్టులోనూ సామ్ కొన్‌స్టాస్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 45 పరుగులు చేశాడు. అయితే, భారత్‌తో ఆఖరిదైన ఈ టెస్టు మ్యాచ్‌లో కొన్‌స్టాస్.. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో వాగ్వాదానికి దిగాడు. సిడ్నీలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులకు ఆలౌట్ అయింది.
బుమ్రాతో గొడవ పడిన కొన్‌స్టాస్
అదే రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టగా.. బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో.. ఆఖరి బంతి వేసే సమయానికి ఖవాజా తనకు కాస్త సమయం కావాలని అడగ్గా.. బుమ్రా విసుక్కున్నాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్ బుమ్రాతో గొడవకు సిద్ధమయ్యాడు. ఇందుకు బుమ్రా కూడా గట్టిగానే బదులివ్వగా.. అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు.
టైమ్ వేస్ట్ చేయాలని చూశాను
అయితే, ఆఖరి బాల్‌కు ఖవాజా వికెట్ పడగొట్టిన బుమ్రా... కొన్‌స్టాస్ వైపు చూస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లంతా కూడా కొన్‌స్టాస్‌ను ఇక వెళ్లు అన్నట్లుగా సైగ చేస్తూ చుట్టుముట్టారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన కొన్‌స్టాస్.. ‘‘నాకు ప్రత్యర్థులతో పోటీ పడటం అంటే ఇష్టం.
అయితే, టీమిండియాతో సిరీస్ నాకెన్నో విషయాలు నేర్పించింది. నిజానికి ఆరోజు నేను బుమ్రా సమయం వృథా చేయాలని ప్రయత్నించాను. టీమిండియాకు మరో ఓవర్ వేసే అవకాశం ఇవ్వకూడదని భావించాను. కానీ.. ఆఖరికి అతడే పైచేయి సాధించాడు.
బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్
ఏదేమైనా అతడొక ప్రపంచ స్థాయి బౌలర్. ఈ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు తీశాడు’’ అని బుమ్రా నైపుణ్యాలను కొనియాడాడు. అదే విధంగా.. మెల్‌బోర్న్ టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లి(Virat Kohli)తో గొడవ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘మ్యాచ్ పూర్తైన తర్వాత నేను కోహ్లితో మాట్లాడాను. నాకు అతడే ఆదర్శం అని చెప్పాను.
నా ఆరాధ్య క్రికెటర్‌కు ప్రత్యర్థిగా బరిలో దిగడం నిజంగా నాకు దక్కిన గౌరవం. అతడు చాలా నిరాడంబరంగా ఉంటాడు. మంచి వ్యక్తి. అతడు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. శ్రీలంక పర్యటనకు గనుక ఎంపికైతే బాగా ఆడాలని నన్ను విష్ చేశాడు’’ అని 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్ చెప్పుకొచ్చాడు. కాగా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. జూనియర్ రిక్కీ పాంటింగ్‌గా పేరొందాడు.
ఫైనల్‌కు ఆసీస్.. టీమిండియా ఇంటికి
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-3తో చేజార్చుకుంది. తద్వారా పదేళ్ల తర్వాత తొలిసారి కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
అంతేకాదు.. టీమిండియాను వెనక్కినెట్టి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది. ఇక టీమిండియా తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లిష్ జట్టుతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment