టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో ఈ రైటార్మ్ బౌలర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడని కొనియాడాడు. కెప్టెన్‌గానూ బుమ్రా జట్టును ముందుకు నడిపించిన తీరు తనను ఆకట్టుకుందన్నాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా పరిణతి గల నాయకుడిగా మెప్పించాడని పేర్కొన్నాడు.
ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించి
కాగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పితృత్వ సెలవుల కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
ఈ క్రమంలో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించి పెర్త్‌లో టీమిండియాకు 295 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం అందించాడు.
వెన్నునొప్పి వేధిస్తున్నా
ఆ తర్వాత మరో మూడు టెస్టులకు సారథిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వైఫల్యం చెందినందున ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట తానే స్వయంగా దూరంగా ఉన్నాడు. ఫలితంగా మరోసారి పగ్గాలు బుమ్రా చేతికి వచ్చాయి. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు అతడు గట్టిగానే శ్రమించాడు.
పేస్ దళ భారాన్ని మొత్తం తానే మోశాడు. ఈ క్రమంలో వెన్నునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చి మరీ బరిలోకి దిగాడు. అయినప్పటికీ సిడ్నీలో ఓటమిపాలైన టీమిండియా 1-3తో ఓటమిపాలై.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆసీస్‌కు చేజార్చుకుంది.
అయితే, జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా బుమ్రాకు మాత్రం ఈ టూర్‌లో మంచి మార్కులే పడ్డాయి. ఐదు టెస్టుల్లో కలిపి మొత్తం 32 వికెట్లు పడగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
నాయకుడిగా మంచి పేరు
ఈ పరిణామాల నేపథ్యంలో సునిల్ గావస్కర్ బుమ్రాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!.. నా అభిప్రాయం ప్రకారం కచ్చితంగా అతడే పగ్గాలు చేపడతాడు. జట్టును ముందుండి నడిపించడంలో బుమ్రా తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్నాడు.
నాయకుడిగా అతడికి మంచి పేరు వచ్చింది. సారథిగా ఉన్నా సహచర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేరకం కాదు. కొన్నిసార్లు కెప్టెన్లు తామే ఒత్తిడిలో కూరుకుపోయి.. పక్కవాళ్లనూ అందులోకి నెట్టేస్తారు. కానీ బుమ్రా ఏ దశలోనూ అలా చేయలేదు. తనపని తాను చేసుకుంటూనే.. జట్టులో ఎవరి విధి ఏమిటో అర్థమయ్యేలా చక్కగా తెలియజెప్పాడు.
నిజంగా అతడొక అద్భుతం
ఈ క్రమంలో ఎవరిపైనా అతడు ఒత్తిడి పెట్టలేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను డీల్ చేసిన విధానం బాగుంది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూనే.. సహచరులకు అన్ని వేళలా మార్గదర్శనం చేశాడు. నిజంగా అతడొక అద్భుతం. అందుకే టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే అని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని గావస్కర్ 7క్రికెట్‌తో పేర్కొన్నాడు.
కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, గాయం కారణంగా బుమ్రా ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
చదవండి: ‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’
Comments
Please login to add a commentAdd a comment