టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwary) ఘాటు విమర్శలు చేశాడు. గంభీర్‌ను మోసకారిగా అభివర్ణిస్తూ.. అతడొక కపట మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు గెలిచినపుడు విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు మాత్రమే ముందుంటాడని.. ఓడితే మాత్రం ఏవో సాకులు చెబుతాడంటూ మండిపడ్డాడు.
పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకున్నాడు
అసలు గంభీర్ నాయకత్వంలోని కోచింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మనోజ్ తివారి విమర్శించాడు. కాగా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్థానంలో గతేడాది గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డష్కటేలను పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకున్నాడు.
ఘోర వైఫల్యాలు
అయితే, గంభీర్ హయాంలో టీమిండియా ఇప్పటి వరకు పెద్దగా సాధించిందేమీ లేకపోగా.. ఘోర వైఫల్యాలు చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ 3-0తో వైట్‌వాష్‌కు గురికావడంతో పాటు.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియాకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఆసీస్ పర్యనటలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్ ఒక మోసకారి. అతడు చెప్పేదొకటి. చేసేదొకటి. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ అభిషేక్ నాయర్.. ఇద్దరూ ముంబైవాళ్లే. ఓటముల సమయంలో రోహిత్‌ను ముందుకు నెట్టేలా ప్లాన్ చేశారు. అసలు జట్టుకు బౌలింగ్ కోచ్ వల్ల ఏం ప్రయోజనం కలిగింది?
వారి వల్ల ఏం ఉపయోగం?
ప్రధాన కోచ్ ఏది చెబితే దానికి తలాడించడం తప్ప బౌలింగ్ కోచ్ ఏం చేస్తాడు? మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి వచ్చాడు. ఇక అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందినవాడు. ఈ ఇద్దరూ గంభీర్‌తో కలిసి పనిచేశారు. గంభీర్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్. వీరు అతడి అసిస్టెంట్లు. గంభీర్ హాయిగా తనదైన కంఫర్ట్‌జోన్‌లో ఉన్నాడు’’ అని న్యూస్18 బంగ్లా చానెల్‌తో పేర్కొన్నాడు.
సమన్వయం లేదు
అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్‌కు సమన్వయం లోపించిందన్న మనోజ్ తివారి.. వారిద్దరు ఇక ముందు కలిసి పనిచేస్తారా? అనే సందేహం వ్యక్తం చేశాడు. ‘‘రోహిత్ ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్. మరోవైపు.. గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా, మెంటార్‌గా టైటిల్స్ అందించాడు. నాకు తెలిసి వీరిద్దరికి ఏకాభిప్రాయం కుదరడం లేదు’’ అని మనోజ్ తివారి పేర్కొన్నాడు.
క్రెడిట్ అంతా తనకే అంటాడు
కాగా ఐపీఎల్-2024లో గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. అతడికి కోచ్‌గా పనిచేసిన అనుభవం లేకపోయినా బీసీసీఐ ఏకంగా టీమిండియా హెడ్‌కోచ్‌గా పదవిని ఇచ్చింది.
ఈ విషయం గురించి మనోజ్ తివారి ప్రస్తావిస్తూ..‘‘గంభీర్ ఒంటిచేత్తో ఎన్నడూ కోల్‌కతాకు టైటిల్ అందించలేదు. జాక్వెస్ కలిస్, సునిల్ నరైన్.. నేను.. ఇలా చాలా మంది సహకారం ఇందులో ఉంది. అయితే, క్రెడిట్ అంతా ఎవరు తీసుకున్నారో అందరికీ తెలుసు’’ అంటూ గంభీర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.
చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం?
Comments
Please login to add a commentAdd a comment