ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభ దశ నుంచి సెమీస్ వరకు అభిషేక్ డకౌట్లు లేదా తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. అయినా కూడా కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అభిషేక్‌కు అవకాశాలిస్తూ అతడికి వెన్నుదన్నుగా నిలుస్తూనే వచ్చాడు.
మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతున్నా జట్టులో చోటు కల్పించడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే గంభీర్ మాత్రం అభిషేక్‌పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అభిషేక్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి అంతకముందు తనపై వచ్చిన విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాడు.
ఎన్ని విమర్శలు వచ్చినా అభిషేక్‌ను వెనుకేసుకు రావడానికి గల కారణాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా వెల్లడించాడు. ‘2014 ఐపీఎల్ సమయంలో నేను చాలా బ్యాడ్‌ఫేస్‌ను ఎదుర్కొన్నాను. అప్పట్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా మూడు డకౌట్లు కావడంతో విమర్శలు ఎదురయ్యాయి.
ఒక ఆటగాడు పరుగులు చేయలేదంటే అతని స్కోర్ కంటే ఫామ్ గురించే మాట్లాడుకుంటారు. కానీ నిజానికి అభిషేక్ అక్కడ ఫామ్ కోల్పోలేదు.. కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని అతడికి వివరించాను. అయితే అభిషేక్ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అతను తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని ఆరాట పడుతుంటాడు.
కానీ ఒక బ్యాటర్ 20 నుంచి 30 బంతులు ఆడినప్పుడు మాత్రమే అతని ఫామ్‌ను అంచనా వేయగలం. అయితే అభిషేక్ పట్టుమని 20 బంతులు కూడా ఎదుర్కోలేదు. అందుకే అవకాశమొచ్చిన ప్రతీసారి మరింత అగ్రెసివ్‌గా ఆడాలని చెప్పేవాడిని. అదీగాక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంతిని గ్రౌండ్ అవతలికి పంపించాలనుకోవడం అభిషేక్ నైజం. ఇది ఒక రకంగా మంచిదే.
అంతిమంగా బయట ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు.. డ్రెస్సింగ్‌రూమ్‌లో అతడి గురించి ఏమీ ఆలోచిస్తున్నారన్నదే ఇక్కడ ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో మూడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో మాత్రం 21 బంతుల్లో 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు.
చదవండి: అభిషేక్‌ను చూసి అసూయపడేవారు!


