‘కెప్టెన్‌గా టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడమే నాకున్న అతిపెద్ద లోటు.. ఈసారి ఎలాగైనా ఆ పని పూర్తిచేస్తాను’.. భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అనుకున్నట్లుగానే ఈసారి కంగారూ జట్టుకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందించాడు ఈ స్టార్ పేసర్.
సుదీర్ఘ నిరీక్షణకు తెర
బౌలర్‌గా, కెప్టెన్‌గా తనదైన వ్యూహాలతో 3-1తో టీమిండియాను ఓడించి.. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. అంతేకాదు.. తన కెప్టెన్సీలో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు కమిన్స్‌పై కూడా తీవ్రమైన భారం పడింది.
స్కాట్ బోలాండ్, స్టార్క్ నుంచి సహకారం అందినా.. కమిన్స్ కూడా వీలైనన్ని ఎక్కువ ఓవర్లు బౌల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కమిన్స్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. శ్రీలంక పర్యటనకు టెస్టు జట్టును ప్రకటించిన సందర్భంగా ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ ఈ విషయాన్ని వెల్లడించాడు.
చీలమండ గాయం
కాగా సొంతగడ్డపై టీమిండియాపై టెస్టు సిరీస్ విజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. కమిన్స్ ఈ టూర్‌కు దూరం కాగా.. అతడి డిప్యూటీ స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాల గురించి జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘కమిన్స్‌కు వ్యక్తిగతంగా కాస్త పని ఉంది. అయితే, అతడు జట్టుకు దూరం కావడానికి అదొక్కటే కారణం కాదు.
అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. వచ్చే వారం అతడు స్కానింగ్‌కు వెళ్తాడు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై పూర్తి స్పష్టత వస్తుంది’’ అని తెలిపాడు. కాగా కమిన్స్ గాయం గనుక తీవ్రతరమైతే ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే.
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎదురుదెబ్బ
ఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ ప్రధాన టోర్నమెంట్ సమీపిస్తోంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. టోర్నీ మొదలయ్యేనాటికి కమిన్స్ పూర్తి ఫిట్‌గా లేనట్లయితే.. ఈ వన్డే వరల్డ్‌కప్-2023 చాంపియన్‌కు కష్టాలు తప్పవు.
కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆటగాడిగా, కెప్టెన్‌గా సత్తా చాటాడు కమిన్స్. ఫైనల్లో టీమిండియాను ఓడించి ఆసీస్‌ను చాంపియన్‌గా నిలిపాడు.
ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్-‘బి’లో ఉంది. ఇందులో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్ లాహోర్ వేదికగా ఫిబ్రవరి 22న ఇంగ్లండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
కాగా.. పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది.
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, ట్రవిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్పీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.
చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’
Comments
Please login to add a commentAdd a comment