కొత్త సంవత్సరంలో క్రికెట్ ప్రేమికులకు మజా అందించేందుకు మరో ఐసీసీ టోర్నీ సిద్ధమైంది. హైబ్రిడ్ విధానంలో చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్‌లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు ఆడనుంది. దుబాయ్ వేదికగా ప్రత్యర్థి జట్లతో తలపడనుంది.
వన్డే ఫార్మాట్ టోర్నీలో ఎనిమిది జట్లు
ఇక ఈ ఐసీసీ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనబోయే ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
డెడ్‌లైన్ ఆరోజే
గ్రూపు-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉండగా.. గ్రూపు-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించి జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12 వరకు గడువు ఇచ్చింది. అదే విధంగా ఈ ప్రొవిజనల్ జట్లలో మార్పులు చేసుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 13 వరకు సమయం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో జనవరి 11న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు బీసీసీఐ ముందుగా జట్టును ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈలోపు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ రెండు ఈవెంట్లకు తన జట్టును ఎంచుకున్నాడు.
మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ
రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించిన ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అయితే, వన్డేల్లో తేలిపోతున్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సంజూ శాంసన్‌ను కూడా నొర్మొహమాటంగా పక్కన పెట్టాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా ఉండబోతుఉన్నాడు.
వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి అతడు 14 ఇన్నింగ్స్ ఆడి 754 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధ శతకం ఉంది. ఇక శుబ్‌మన్ గిల్ గణాంకాలు అంత గొప్పగా ఏమీలేవు. ప్రపంచకప్ కలుపుకొని 12 ఇన్నింగ్స్‌లో కలిపి 411 రన్స్ చేశాడు. కాబట్టి యశస్వి జైస్వాల్‌పై కూడా మేనేజ్‌మెంట్ దృష్టి సారించే అవకాశం ఉంది.
సూర్య, సంజూలకు నో ఛాన్స్
అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవచ్చు. అయినప్పటికీ ప్రధాన జట్టులో జైస్వాల్ ఉండాలి. ఇక విరాట్ కోహ్లి తప్పక ఈ జట్టులో ఉంటాడు. కానీ సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం ఈసారి జట్టులో స్థానం దక్కదు. విజయ్ హజారే ట్రోఫీలోనూ అతడు పరుగులు రాబట్టలేకపోయాడు.
ఇక సంజూ శాంసన్ ఇంత వరకు ఈ దేశీ వన్డే టోర్నీలో ఆడనేలేదు. అయితే, శ్రేయస్ అయ్యర్ మాత్రం వరల్డ్‌కప్ నుంచే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్ నుంచి 15 ఇన్నింగ్స్‌లో కలిపి 620 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా కూడా ఈ జట్టులో ఉంటారు.
వన్డేల్లో పంత్ రికార్డు గొప్పగా లేకున్నా ఇషాన్ కిషన్ స్థానంలో అతడు టీమ్‌లోకి వస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనూ దాదాపు ఇదే జట్టు పాల్గొంటుందని అంచనా వేశాడు.
చాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment