ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్‌పై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడికి భారత క్రికెట్‌తో పనేంటని.. ఎదుటి వాళ్ల గురించి మాట్లాడే ముందు తమ ఆటగాళ్లు ఎలా ఉన్నారో చూసుకోవాలని హితవు పలికాడు. కాగా టెస్టుల్లో టీమిండియా ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో నిలవాలంటే
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది రోహిత్ సేన. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2023-25 ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కనీసం నాలుగు టెస్టుల్లో గెలిస్తేనే డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది.
ఇక కివీస్‌తో సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ చేతిలో చారిత్రాత్మక ఓటమికి ఒకరకంగా వీరిద్దరి వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో ఆసీస్ పర్యటన భారత జట్టుకు మరింత కఠినతరంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోహ్లిపై పాంటింగ్ విమర్శలు
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి విమర్శలు చేశాడు. అగ్రశ్రేణి బ్యాటర్‌గా కొనసాగుతూ గత ఐదేళ్లలో టెస్టుల్లో కేవలం రెండు శతకాలే బాదడం ఏమిటని ప్రశ్నించాడు. కోహ్లి ఆట తీరు ఇలాగే ఉంటే టీమిండియాకు తిప్పలు తప్పవని.. అతడి బ్యాటింగ్ గణాంకాలు నిజంగా ఆందోళనకరంగా ఉన్నాయని పాంటింగ్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో సిరీస్‌కు ముందు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సోమవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పాంటింగ్ వ్యాఖ్యలను విలేఖరులు ప్రస్తావించగా గౌతీ ఫైర్ అయ్యాడు. ‘‘అసలు పాంటింగ్‌కు భారత క్రికెట్‌తో ఏం పని? అతడు.. ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిదనుకుంటున్నాను.
భారత క్రికెట్‌తో అతడికి ఏం పని?
అయినా, విరాట్, రోహిత్ గురించి అతడికి ఆందోళన ఎందుకు? నా దృష్టిలో వాళ్లిద్దరు అద్భుతమైన ఆటగాళ్లు. కఠిన సవాళ్లకు సమర్థవంతంగా ఎదురీదగల సత్తా ఉన్నవాళ్లు. భారత క్రికెట్ తరఫున ఎన్నో విజయాలు సాధించారు. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతారు’’ అని గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను సమర్థిస్తూ పాంటింగ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
కాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. కివీస్‌తో సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి కోహ్లి చేసిన పరుగులు 0, 70, 1, 17, 4, 1.
ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
భారత్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్ , మిచెల్ మార్ష్, మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.
చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టుకు రోహిత్ దూరం! భారత కెప్టెన్ అతడే? గంభీర్ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment