![Virat Kohli Anushka Sharma Visit Premanand Maharaj With Kids Video Goes Viral](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/10/virushka.jpg.webp?itok=QEdMV4Sq)
పిల్లలతో విరుష్క జోడీ(PC: X)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయాడు. సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma), పిల్లలు వామిక(Vamika), అకాయ్(Akaay)లతో కలిసి ప్రేమానంద్ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా కెరీర్ పరంగా కోహ్లి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ విఫలం
ముఖ్యంగా టెస్టుల్లో నిలకడలేమి ఆట తీరు, వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నాడు కోహ్లి. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తేలిపోయిన ఈ ‘రన్‌మెషీన్’.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియాలోనూ చేతులెత్తేశాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రధాన కారణమయ్యాడు కోహ్లి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అంతేకాదు.. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి.. ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు.
అంతేకాదు.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ప్రతిసారి బోల్తా పడి వికెట్ సమర్పించుకున్నాడు ఇక ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు.. ఈ పరాజయం కారణంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ రేసు నుంచి కూడా భారత జట్టు నిష్క్రమించింది.
ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌లు
తదుపరి ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానున్నాయి. ఆ తర్వాత వెంటనే చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి కోహ్లి భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మానసిక ప్రశాంతతకై ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఉన్న ప్రేమానంద్ మహరాజ్ దర్శనం చేసుకున్నాడు. ఆ సమయంలో భార్య అనుష్కతో పాటు.. కుమార్తె వామిక, చిన్నారి కుమారుడు అకాయ్ కూడా కోహ్లి వెంట ఉన్నారు.
అనుష్క వల్లే కోహ్లి ఇలా
ఈ సందర్భంగా అనుష్క ప్రేమానంద్ మహరాజ్‌తో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇక్కడికి వచ్చినపుడు నా మనసులోని కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు వేరే వాళ్లు అడిగేశారు.
ఈసారి ఇక్కడికి వచ్చినపుడు మాత్రం నా మనసులోని సందేహాలకు సమాధానం పొందాలని భావించాను. అయితే, ఈసారి కూడా వేరేవాళ్ల వల్ల నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇప్పుడు మాకు కేవలం మీ ఆశీస్సులు ఉంటే చాలు’’ అని పేర్కొంది.
ఇక విరుష్క దంపతులు తన ముందు ప్రణమిల్లడం చూసి భావోద్వేగానికి గురైన ప్రేమానంద్ మహరాజ్.. ‘‘మీరు చాలా ధైర్యవంతులు. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన తర్వాత కూడా దేవుడి పట్ల ఇంత అణకువగా ఉండటం అందరికీ సాధ్యం కాదు,.
భక్తి మార్గంలో నడుస్తున్న అనుష్క ప్రభావమే కోహ్లి మీద కూడా ఉంటుందని మేము అనుకుంటూ ఉంటాం. విరాట్ కోహ్లి తన ఆటతో దేశం మొత్తానికి సంతోషాన్ని పంచుతాడు. అతడు గెలిస్తే దేశమంతా సంతోషంగా ఉంటుంది. అంతలా ప్రజలు అతడిని ప్రేమిస్తున్నారు’’ అంటూ కోహ్లిపై ప్రశంసలు కురిపించారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో వామిక, అకాయ్‌ల ముఖాలు కనిపించకుండా విరుష్క జోడీ జాగ్రత్తపడింది. కాగా ఈ జంట ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.
చదవండి: భార్యను భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు: గుత్తా జ్వాల ఫైర్
Virat Kohli and Anushka Sharma with their kids visited Premanand Maharaj. ❤️
- VIDEO OF THE DAY...!!! 🙏 pic.twitter.com/vn1wiD5Lfc— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2025
Comments
Please login to add a commentAdd a comment