‘కోహ్లి కార్బన్‌ కాపీలా అకాయ్‌’.. ఫొటోలు వైరల్‌! మండిపడుతున్న ఫ్యాన్స్‌ | Stop This: Fans Slams Broadcasters For Trying To Show Kohli Son Akaay On Screens | Sakshi
Sakshi News home page

‘కోహ్లి కార్బన్‌ కాపీలా అకాయ్‌’.. ఫొటోలు వైరల్‌! మండిపడుతున్న ఫ్యాన్స్‌

Published Sun, Nov 24 2024 2:27 PM | Last Updated on Sun, Nov 24 2024 3:47 PM

Stop This: Fans Slams Broadcasters For Trying To Show Kohli Son Akaay On Screens


టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఆస్ట్రేలియా గడ్డపై ఎట్టకేలకు బ్యాట్‌ ఝులిపించాడు. పెర్త్‌ టెస్టులో అర్ధ శతకంతో మెరిసి అభిమానులను అలరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌(161), కేఎల్‌ రాహుల్‌(77) బలమైన పునాది వేయగా.. కోహ్లి తన హాఫ్‌ సెంచరీతో స్కోరును 400 దాటించాడు.

కాగా ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లికి ఇది కేవలం రెండో ఫిఫ్టీ కావడం గమనార్హం. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తొలి టెస్టు సందర్భంగా కోహ్లి 70 పరుగులు సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఫిఫ్టీ బాదడం.

ఇదిలా ఉంటే.. కోహ్లిని చీర్‌ చేసేందుకు అతడి భార్య అనుష్క శర్మ పెర్త్‌ స్టేడియానికి వచ్చిన విషయం తెలిసిందే. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఆమె స్టాండ్స్‌లో సందడి చేసిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. అయితే, ఆదివారం నాటి ఆటలో విరుష్క జోడీ కుమారుడు అకాయ్‌గా చెబుతున్న బుడ్డోడి ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి.

ఈ నేపథ్యంలో అకాయ్‌ కోహ్లి కార్బన్‌ కాపీలా ఉన్నాడంటూ కొంతమంది నెటిజన్లు ఆ ఫొటోలను వైరల్‌ చేయగా.. విరుష్క ఫ్యాన్స్‌ మాత్రం బ్రాడ్‌కాస్టర్స్‌పై మండిపడుతున్నారు. తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోహ్లి- అనుష్క చెబుతున్నా.. ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఎవరూ కూడా అకాయ్‌ ఫొటోలను షేర్‌ చేయవద్దని.. తమ కుమారుడి గోప్యత విషయంలో కోహ్లి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని హితవు పలుకుతున్నారు.

కాగా కోహ్లి కుమార్తె వామిక ఫొటోలు కూడా గతంలో ఇలాగే బ్రాడ్‌కాస్టర్స్‌ తప్పిదం వల్ల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను పెళ్లాడిన కోహ్లికి ఇద్దరు పిల్లలు. ఈ జోడీకి మొదటి సంతానంగా కుమార్తె వామిక 11 జనవరి, 2021లో జన్మించగా.. రెండో సంతానం కుమారుడు అకాయ్‌. 2024, ఫిబ్రవరి 15న లండన్‌లో జన్మించాడు. అయితే, ఇంతవరకు విరుష్క జోడీ తమ పిల్లలను బయటిప్రపంచానికి చూపించలేదు.

ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. సెలబ్రిటీ లైఫ్‌నకు.. ముఖ్యంగా సోషల్‌ మీడియాకు దూరంగా వారిని పెంచాలని భావిస్తున్నట్లు కోహ్లి దంపతులు గతంలో తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్‌ 500 పరుగులకు పైగా ఆదిక్యంలో కొనసాగుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి కేవలం ఐదు పరుగులకే నిష్క్రమించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement