‘టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి త్వరలోనే శాశ్వతంగా భారత్‌ను వీడనున్నాడు. కుటుంబంతో కలిసి లండన్‌లో నివాసం ఉండబోతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి’... ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు.. కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ.
క్రికెట్ కింగ్‌గా పేరొందిన విరాట్ కోహ్లి.. 2017లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2021లో కుమార్తె వామిక జన్మించింది. పాప పుట్టిన దాదాపు మూడేళ్ల అనంతరం ఇటీవలే అనుష్క- కోహ్లి మగబిడ్డకు జన్మనిచ్చారు.
అప్పటి నుంచి ఎక్కువగా లండన్‌లోనే
ఇక వామిక భారత్‌లోనే జన్మించగా.. రెండోసారి ప్రసవం కోసం భర్త విరాట్‌తో కలిసి అనుష్క లండన్‌కు వెళ్లింది. అక్కడే ఆమె తమ కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చింది.
అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్‌లోనే నివసిస్తోంది. విరాట్ కూడా సొంతగడ్డపై మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. విదేశాల్లో సిరీస్‌లు ఉన్న సమయంలో లండన్ నుంచి నేరుగా అక్కడికి చేరుకుంటున్నాడు.
లండన్‌లో స్థిర నివాసం
అదే విధంగా.. అనుష్క శర్మ సైతం ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ముంబైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో విరుష్క జోడీ లండన్‌లో స్థిరనివాసం ఏర్పరచుకోబోతున్నారని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ.. దైనిక్ జాగరణ్‌తో మాట్లాడుతూ ఈ వదంతులు నిజమేనని పేర్కొన్నాడు.
‘‘అవును.. విరాట్ కోహ్లి లండన్‌కు పూర్తిగా మకాం మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. త్వరలోనే అతడు ఇండియాను శాశ్వతంగా వదిలివెళ్తాడు’’ అని రాజ్‌కుమార్ శర్మ తెలిపాడు. కాగా విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. అనుష్కకు కూడా భారీగానే అభిమానగణం ఉంది.
కారణం ఇదే
కాబట్టి ఈ సెలబ్రిటీ జంటకు సంబంధించిన చిన్న విషయమైనా అభిమానులకు పెద్ద వార్తే. అదే విధంగా.. మీడియా, సోషల్ మీడియాలోనూ వీరి గురించి ఎన్నో కథనాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కామెంట్లు శ్రుతిమించుతాయి కూడా! అప్పట్లో ఓ మ్యాచ్‌లో కోహ్లి భారత పేసర్ మహ్మద్ షమీకి మద్దతుగా నిలిచాడన్న కారణంతో అతడి కుమార్తెను ఉద్దేశించి నీచంగా మాట్లాడటంతో పాటు బెదిరింపులకు దిగారు కొందరు దుండగులు.
ఈ పరిణామాల నేపథ్యంలో తమ సంతానాన్ని లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్న విరుష్క జోడీ.. ఇప్పటి వరకు వారి ఫొటోలను కూడా ప్రపంచానికి చూపించలేదు. తమ పిల్లల గోప్యతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారు శాశ్వతంగా లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఆ తర్వాత శాశ్వతంగా లండన్‌లో
ఇటు కుటుంబ గోప్యతతో పాటు.. లండన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలోనే విరాట్ కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ రికార్డుల రారాజు.. వన్డే, టెస్టుల నుంచి తప్పుకొన్న తర్వాత మకాం మొత్తంగా లండన్‌కు మార్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం కోహ్లి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. భార్య అనుష్కతో పాటు పిల్లలు వామిక, అకాయ్‌లను కూడా తన వెంట తీసుకువెళ్లాడు. కాగా కోహ్లి ఖాతాలో ఇప్పటికే 81(టెస్టు 30, వన్డే 50, టీ20 1) అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి.
చదవండి: సంజూ శాంసన్‌కు షాక్
Comments
Please login to add a commentAdd a comment