BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మొహమద్(Dr Shama Mohamed) చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia ) ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత్ సెమీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతుంటే.. రాజకీయ నాయకులు జట్టుపై ప్రభావం పడేలా ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ- 2025లో భాగంగా టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. కివీస్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి హ్యాట్రిక్ విజయంతో లీగ్ దశను ముగించింది. అయితే, దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన షామా మొహమద్ ‘ఎక్స్’ వేదికగా రోహిత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.యావరేజ్ ఆటగాడు.. అవునా?‘‘క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలి. అతడు అధిక బరువుతో ఉన్నాడు. కెప్టెన్‌గానూ ఆకట్టుకోలేకపోతున్నాడు. మాజీ కెప్టెన్లతో పోలిస్తే అసలు అతడు ఎందుకూ కొరగాడు. యావరేజ్ ఆటగాడు’’ అని షామా పేర్కొన్నారు. అయితే, రోహిత్ శర్మను ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌కు అధిక విజయాలు అందించడంతో పాటు.. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియాకు వరల్డ్‌కప్ అందించిన సారథి, వన్డేలలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీ చేసిన మొనగాడి పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ పెద్ద ఎత్తున షామాపై ట్రోలింగ్ జరిగింది.అదేమీ బాడీ షేమింగ్ కాదే!ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చే క్రమంలో షామా మొహమద్ మాట్లాడిన తీరు రోహిత్ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ‘‘క్రీడాకారులకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో చెప్పే క్రమంలో నేను ఆ ట్వీట్ చేశాను. అదేమీ బాడీ షేమింగ్ కాదే!.. నేను కేవలం ఫిట్నెస్ గురించే మాట్లాడాను. అతడు కాస్త లావుగా ఉన్నాడనిపించింది. అదే విషయం గురించి ట్వీట్ చేశా.కారణం లేకుండానే నాపై మాటల దాడికి దిగుతున్నారు. ఇతర కెప్టెన్లు.. అంటే ధోని, గంగూలీ, ద్రవిడ్, టెండుల్కర్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లిలతో అతడిని పోల్చినప్పుడు రోహిత్ గురించి నాకేం అనిపించిందో అదే చెప్పాను. ఇది ప్రజాస్వామ్యం. నా అభిప్రాయాన్ని పంచుకునే హక్కు నాకు ఉంది. నా మాటల్లో తప్పేముంది?నేను ఓ వ్యక్తిని ఉద్దేశించి ఇలా మాట్లాడలేదు. అయినా ప్రజాస్వామ్యం గురించి అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యాననుకుంటా. నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడకూడదేమో’’ అని షామా మొహమద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, షామా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలపగా.. బీజేపీ మాత్రం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.హుందాగా ప్రవర్తించాలిఇక ఈ విషయంపై తీవ్రస్థాయిలో దుమారం రేగడంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా స్పందించారు. ‘‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇలాంటి మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం. బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు హుందాగా ప్రవర్తించాలి. టీమిండియా కీలక సెమీ ఫైనల్ ఆడేముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు’’ అని షామా వ్యాఖ్యలను ఖండించారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన రోహిత్ సేన.. తదుపరి పాకిస్తాన్, న్యూజిలాండ్‌పై వరుస విజయాలు సాధించింది. ఈక్రమంలో గ్రూప్-‘ఎ’ టాపర్‌గా నిలిచిన టీమిండియా మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh— ANI (@ANI) March 3, 2025