
టీమిండియాకు ప్రకటించిన నగదు బహుమతి పంపిణీ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆటగాళ్లకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి ఇచ్చే మొత్తం ఎంతన్నది తాజాగా వెల్లడించారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్ల మేర అందజేయనున్నట్లు తెలిపారు.
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచి తొమ్మిది నెలల వ్యవధిలోనే మరో ఐసీసీ ట్రోఫీని సాధించింది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టుకు భారీ క్యాష్ రివార్డు (BCCI Cash Reward) ప్రకటించింది. రూ. 58 కోట్ల నజరానా ఇవ్వనున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే, ఇందులో ఎవరెవరికి ఎంత మొత్తం ఇస్తారన్న విషయం గురించి కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా వెల్లడించారు.
గౌతం గంభీర్‌కు మూడు కోట్లు
వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్లు.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు మూడు కోట్లు.. మిగిలిన కోచ్‌లలో అసిస్టెంట్లు ర్యాన్ టెన్ డష్కాటే, అభిషేక్ నాయర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్‌కు టి. దిలీప్‌నకు రూ. 50 లక్షలు.. మిగిలిన సహాయక సిబ్బందికి రూ. యాభై లక్షలు.. బీసీసీఐ అధికారులకు రూ. 25 లక్షలు ఇస్తాం’’ అని దేవజిత్ సైకియా తెలిపారు.
కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమి పాలై టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే, టీ20 ప్రపంచకప్-2024తో ఈ గాయాలను మాన్పివేసింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు ఓటమన్నదే లేక చాంపియన్‌గా నిలిచింది.
దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు
తొమ్మిది నెలల అనంతరం తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఈ వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరించిగా.. భద్రతా కారణాల వల్ల టీమిండియాను అక్కడకు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది.
ఈ క్రమంలో ఐసీసీ జోక్యంతో దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ ఆడేలా హైబ్రిడ్ మోడల్‌కు పాక్ అంగీకరించింది. ఇక ఒకే వేదిక మీద అన్ని మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియాకు మిగతా జట్లతో పోలిస్తే.. అదనపు ప్రయోజనాలు చేకూరాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు విమర్శించారు.
అయితే, భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని.. వేదిక ఏదైనా గెలుపు టీమిండియాదేనంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ఆ విమర్శలను తిప్పికొట్టారు. టీ20 ప్రపంచకప్-2024లో మిగతా జట్ల మాదిరే టీమిండియా కూడా ప్రయాణాలు చేసిందని.. అయినా విజేతగా నిలిచిందంటూ కౌంటర్ ఇచ్చారు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లొ పాల్గొన్న భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రిషభ్ పంత్.
సహాయక సిబ్బంది:
హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటే, టి. దిలీప్, మోర్నీ మోర్కెల్.
చదవండి: ‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’
Comments
Please login to add a commentAdd a comment