
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) కీలక సూచనలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో దూకుడు వద్దని.. సంయమనంతో ఆడాలని సూచించాడు.
అదే విధంగా.. రోహిత్ బ్యాటింగ్ శైలిని సమర్థిస్తూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని సన్నీ కుండబద్దలు కొట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే.
తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా.. రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ ఓడించాయి. ఈ క్రమంలో దుబాయ్‌లో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా- న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ వన్డే టోర్నమెంట్‌కు ఆతిథ్యం దేశం పాకిస్తాన్ అయినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతోన్న విషయం తెలిసిందే.
ఒక్క ఫిఫ్టీ కూడా లేదు
గ్రూప్ దశలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన భారత్.. సెమీస్‌లోనూ సత్తా చాటి అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టింది. అంతాబాగానే ఉన్నా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి మాత్రం ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన రాలేదు. నాలుగు మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా... 41(36 బంతుల్లో), 20(15 బంతుల్లో), 15(17 బంతుల్లో), 28(29 బంతుల్లో).
దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. దీంతో రోహిత్ శర్మ బ్యాటింగ్, భవిష్యత్‌పై విమర్శలు రాగా.. గంభీర్ అతడికి మద్దతుగా నిలిచాడు. అద్భుతమైన టెంపోతో ఆడుతున్న హిట్‌మ్యాన్ జట్టుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని పేర్కొన్నాడు.
గంభీర్ వ్యాఖ్యలతో ఏకీభవించని గావస్కర్
ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్‌గా అతడు జట్టును ప్రభావితం చేస్తున్నాడన్నది నిజమే. అయితే, బ్యాటర్‌గా 25-30 పరుగులు మాత్రమే చేస్తే తన ప్రదర్శన పట్ల అతడు సంతోషంగా ఉంటాడా? ఓ బ్యాటర్‌గా అదొక లోటే.
జట్టుపై నీ ఆట తీరుతో ప్రభావం చూపడం ఎంత ముఖ్యమో.. బ్యాటర్‌గా ఓ 25 ఓవర్ల పాటు క్రీజులో నిలబడితే మరింత గొప్పగా ప్రభావితం చేయవచ్చు. ఏడు, ఎనిమిది, తొమ్మిది ఓవర్లపాటే ఆడితే మజా ఏం ఉంటుంది?
వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట.. కానీ
దూకుడుగా ఆడటం మంచిదే కావొచ్చు. కానీ.. కొన్నిసార్లు అది బెడిసికొట్టవచ్చు. నిజానికి రోహిత్ గనుక 25- 30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే.. టీమిండియా సగం ఇన్నింగ్స్ తర్వాత 180- 200 పరుగులకు చేరుకుంటుంది. ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే సత్తా రోహిత్‌కు ఉంది. అతడొక ప్రతిభావంతుడైన బ్యాటర్.
వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట. అయితే, గత వన్డే వరల్డ్‌కప్ నుంచి రోహిత్ శైలి పూర్తిగా మారిపోయింది, దూకుడుగా ఆడేందుకు అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఈ విషయంలో విజయవంతమైనా.. కీలక మ్యాచ్‌లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడటం మంచిది’’ అని న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు ముందు గావస్కర్ రోహిత శర్మకు సూచించాడు.
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
ఇదిలా ఉంటే.. నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ జట్టును ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీలు.. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
చదవండి: ‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment