
దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా వరుసగా మూడోసారి (2013, 2017, 2025), మొత్తంగా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ గెలుపుతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
రోహిత్ సారథ్యంలో టీమిండియా 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్.. తాజాగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ చేరింది. ప్రపంచంలో ఏ ఇతర కెప్టెన్ ఈ నాలుగు ఐసీసీ టోర్నీల్లో తన జట్టును ఫైనల్స్‌కు చేర్చలేదు. ప్రస్తుతం ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే.
ప్రతీకారం తీర్చుకున్న భారత్
తాజాగా గెలుపుతో భారత్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. 2023 వరల్డ్‌కప్ ఫైనల్స్ తర్వాత వన్డేల్లో భారత్ ఆసీస్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
హ్యాట్రిక్ విజయాలు
ఇతర టోర్నీలో భారత్ పాలిట కొరకరాని కొయ్యగా ఉన్న ఆస్ట్రేలియా.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. ఈ టోర్నీలో భారత్ ఆసీస్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో మూడుసార్లు ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో టీమిండియానే జయకేతనం ఎగురవేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలిసారి 1998 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. తర్వాత 2000 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇరు జట్లు రెండో సారి ఢీకొన్నాయి. ఈసారి భారత్ 20 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. తాజాగా 2025 ఎడిషన్ సెమీస్‌లో గెలుపుతో భారత్ ఆసీస్‌పై హ్యాట్రిక్ విజయాలు (ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో) నమోదు చేసింది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఛేదనలో విరాట్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (84) ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment