
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో మరో రికార్డు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరించాడు.
రోహిత్ ఐసీసీ వన్డే టోర్నీల్లో ఇప్పటివరకు 42 ఇన్నింగ్స్‌ల్లో 65 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు రోహిత్, క్రిస్ గేల్ పేరిట సంయుక్తంగా ఉండేది. గేల్ 51 ఇన్నింగ్స్‌ల్లో 64 సిక్సర్లు బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాస్-5 ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.
రోహిత్ శర్మ-65 సిక్సర్లు (42 ఇన్నింగ్స్‌లు)
క్రిస్ గేల్-64 (51 ఇన్నింగ్స్‌లు)
గ్లెన్ మ్యాక్స్‌వెల్-49 (30 ఇన్నింగ్స్‌లు)
డేవిడ్ మిల్లర్-45 (30 ఇన్నింగ్స్‌లు)
సౌరవ్ గంగూలీ-42 (32 ఇన్నింగ్స్‌లు)
మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ 29 బంతుల్లో 3 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ టోర్నీలో రోహిత్‌కు మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. రోహిత్ తక్కువ స్కోర్‌కే ఔట్ కావడం టీమిండియా విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
అంతకుముందు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా తక్కువ స్కోర్‌కే (8) ఔటయ్యాడు. రోహిత్ ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 43/2గా ఉంది. విరాట్ కోహ్లి (5), శ్రేయస్ అయ్యర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు దక్కింది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలు చేసి ఆసీస్‌కు ఫైటింగ్ స్కోర్ అందించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment