
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, రోహిత్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (351) టాప్‌లో ఉన్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ తర్వాతి స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. బట్లర్ ఖాతాలో ప్రస్తుతం 170 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ గేల్ రికార్డును సమం చేశాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ 20 బంతుల్లో ఓ సిక్సర్, 6 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. రోహిత్ ఓ మోస్తరు స్కోర్‌తో రాణించినా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment