శ్రీలంకతో మూడో వన్డేకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో రెండు సిక్సర్లు కొడితే.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్‌ను (294 ఇన్నింగ్స్‌ల్లో 331 సిక్సర్లు) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 330 సిక్సర్లు (256 ఇన్నింగ్స్‌ల్లో) ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాక్ మాజీ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 369 ఇన్నింగ్స్‌ల్లో 351 సిక్సర్లు బాదాడు.
కాగా, లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్.. గేల్ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్.. ఛేదనలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గేల్ 177 సిక్సర్లు కొడితే.. రోహిత్ 179 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ రెండు మ్యాచ్‌ల్లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలు చేశాడు.
తొలి వన్డేలో 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసిన రోహిత్.. రెండో వన్డేలో 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. రోహిత్ రెండు వన్డేల్లో మెరిసినా భారత్ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో భారత్ రోహిత్ అందించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమిపాలైంది. సిరీస్‌లో మూడో వన్డే ఆగస్ట్ 7న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment