![Most Sixes In ODIs: Rohit Sharma Goes Past Chris Gayle Eyes In World Record](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/rohitsixes.jpg.webp?itok=cbcc9Ni_)
తాను బ్యాట్ ఝులిపిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి నిరూపించాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి.. బౌండరీలు, సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రో‘హిట్’.. వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్(Chris Gayle) సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాదు.. అరుదైన ప్రపంచ రికార్డుకు మరింత చేరువయ్యాడు.
కాగా గత కొంతకాలంగా బ్యాటింగ్ కష్టాలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. కటక్ వన్డేతో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో డెబ్బై ఆరు బంతుల్లోనే శతకమార్కును అందుకుని.. తన వన్డే కెరీర్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో పన్నెండు ఫోర్లతో పాటు.. ఏడు సిక్స్‌లు ఉన్నాయి.
రెండో స్థానానికి
ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండోస్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్‌ను అధిగమించి షాహిన్ ఆఫ్రిది తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 267 వన్డేలు పూర్తి చేసుకున్న రోహిత్ 338 సిక్స్‌లు బాదాడు.
మరోవైపు.. వెస్టిండీస్ తరఫున 301 వన్డేల్లో గేల్ 331 సిక్సర్లు కొట్టాడు. ఇక పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది 351 సిక్స్‌లతో వన్డేల్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ప్రపంచ రికార్డుకు రోహిత్ శర్మ ఇంకా కేవలం పదమూడు సిక్స్‌ల దూరంలో ఉన్నాడు.
అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఇప్పటికే అత్యధిక సిక్సర్ల వీరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. అతడి ఖాతాలో ఏకంగా 631 సిక్స్‌లు ఉన్నాయి. రోహిత్ వన్డేల్లో 338, టీ20లలో 205, టెస్టుల్లో 88 సిక్స్‌లు బాదాడు.
సిరీస్ కైవసం
కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతున్న టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత సూర్యకుమార్ బృందం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకోగా.. మరో వన్డే మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 2-0తో కైవసం చేసుకుంది. కటక్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బట్లర్ బృందాన్ని 304 పరుగులకు ఆలౌట్ చేసింది.
ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ... మొత్తంగా తొంభై బంతుల్లో 119 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మెరుపు అర్ధ శతకం(52 బంతుల్లో 60) రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) మరోసారి రాణించారు.
ఈ క్రమంలో 44.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. హిట్ షోతో అలరించిన రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం ఆఖరి వన్డే జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.
చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి..
Comments
Please login to add a commentAdd a comment