హర్షిత్‌ రాణాపై రోహిత్‌ శర్మ ఫైర్‌!.. వీడియో వైరల్‌ | Dimaag Kidhar Hai: Rohit Sharma Fumes As Harshit Rana Grave Error | Sakshi
Sakshi News home page

హర్షిత్‌ రాణాపై రోహిత్‌ శర్మ ఫైర్‌!.. వీడియో వైరల్‌

Published Mon, Feb 10 2025 1:29 PM | Last Updated on Mon, Feb 10 2025 1:58 PM

Dimaag Kidhar Hai: Rohit Sharma Fumes As Harshit Rana Grave Error

టీమిండియా యువ పేసర్‌ హర్షిత్‌ రాణా(Harshit Rana)పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మెదడు పని చేస్తోందా?.. మనసు ఎక్కడపెట్టి ఆడుతున్నావు?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా కటక్‌ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌(India vs England) మధ్య ఆదివారం రెండో వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పర్యాటక ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో ఫిల్‌ సాల్ట్‌(26) నిరాశపరిచినా.. బెన్‌ డకెట్‌ మాత్రం అర్ధ శతకం(56 బంతుల్లో 65)తో మెరిశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన జో రూట్‌(72 బంతుల్లో 69) కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు.

ఉచితంగా నాలుగు పరుగులు
ఇక హ్యారీ బ్రూక్‌(31) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. అయితే, ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 32వ ఓవర్‌ను భారత యువ పేస్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా వేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న బట్లర్‌ ఐదో బంతిని డిఫెన్స్‌ ఆడగా.. బంతిని అందుకున్న రాణా వికెట్ల వైపునకు త్రో చేశాడు.

అయితే, అది స్టంప్స్‌ను తాకకపోగా.. వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ చేతికి కూడా అందకుండా బౌండరీ వైపు దూసుకువెళ్లింది. దీంతో రాణా చేసిన తప్పు వల్ల ఇంగ్లండ్‌కు ఉచితంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రోహిత్‌ శర్మ.. హర్షిత్‌ రాణాను చూస్తూ.. ‘మెదడు ఎక్కడ పెట్టుకుని ఆడుతున్నావు?’ అన్నట్లుగా సైగలతో అతడిపై అసహనం వెళ్లగక్కాడు.

రోహిత్‌ విశ్వరూపం
ఇదిలా ఉంటే.. ఇక బట్లర్‌ 34 పరుగులు చేసి నిష్క్రమించగా.. లివింగ్‌స్టోన్‌ 41 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లు విఫలం కాగా 49.5 ఓవర్లలో ఇంగ్లండ్‌ 304 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా మూడు, వరుణ్‌ చక్రవర్తి ఒక వికెట్‌ పడగొట్టగా.. పేసర్లు హర్షిత్‌ రాణా, హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ షమీ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శతకం(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు- 119 రన్స్‌) చెలరేగగా.. శుబ్‌మన్‌ గిల్‌(60), శ్రేయస్‌ అయ్యర్‌(47 బంతుల్లో 44), అక్షర్‌ పటేల్‌(43 బంతుల్లో 41*) కూడా రాణించారు. ఫలితంగా 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 308 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ టెండుల్కర్‌ను దాటేసి..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement