![Steve Smith Becomes First Ever Australian Fielder To Complete 200 Catches In Test Matches](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/steve.jpg.webp?itok=4LBVYHY6)
ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో 200 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆస్ట్రేలియన్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్ మొత్తం ఐదు క్యాచ్‌లు పట్టుకున్నాడు. స్మిత్ క్యాచ్‌ల్లో డబుల్ సెంచరీ సాధించే క్రమంలో రికీ పాంటింగ్ (Ricky Ponting) రికార్డును అధిగమించాడు.
🚨 HISTORY BY STEVEN SMITH. 🚨
- Smith becomes the first ever Australian fielder to complete 200 catches in Tests. 🙇♂️pic.twitter.com/3T2v9jgcid— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025
పాంటింగ్ 287 ఇన్నింగ్స్‌ల్లో 196 క్యాచ్‌లు అందుకోగా.. స్మిత్ 205 ఇన్నింగ్స్‌ల్లోనే 200 క్యాచ్‌లు పూర్తి చేశాడు. ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న నాన్ వికెట్‌కీపర్ల జాబితాలో స్మిత్, పాంటింగ్ తర్వాతి స్థానంలో మార్క్ వా ఉన్నాడు. మార్క్ వా 209 ఇన్నింగ్స్‌ల్లో 181 క్యాచ్‌లు పట్టుకున్నాడు.
ఓవరాల్‌గా ఐదో క్రికెటర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే 200 క్యాచ్‌లు పూర్తి చేశారు. వీరిలో టీమిండియా గ్రేట్ రాహుల్ ద్రవిడ్ (Rahu Dravid) 210 క్యాచ్‌లతో (164 టెస్ట్‌ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. జో రూట్ (152 టెస్ట్‌ల్లో 207), మహేళ జయవర్దనే (149 టెస్ట్‌ల్లో 205), జాక్ కల్లిస్ (166 టెస్ట్‌ల్లో 200) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకతో మ్యాచ్‌లో స్మిత్ కల్లిస్ సరసన చేరడంతో పాటు 200 క్యాచ్‌ల క్లబ్‌లో చేరిన ఐదో ఆటగాడిగా నిలిచాడు.
అలాగే టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతంగా 200 క్యాచ్‌లు పూర్తి చేసిన ఆటగాడిగానూ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. స్మిత్ కేవలం 116 టెస్ట్‌ల్లోనే 200 క్యాచ్‌లు పూర్తి చేశాడు. స్మిత్ మరో 11 క్యాచ్‌లు పడితే టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొడతాడు.
లంకతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన స్మిత్.. బ్యాటింగ్‌లోనూ చెలరేగి టెస్ట్‌ల్లో 36వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ టెప్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్, జో రూట్ తలో 36 సెంచరీలతో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది.
అంతకుముందు స్మిత్ లంకతో జరిగిన తొలి టెస్ట్‌లోనూ సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్‌లో స్మిత్ టెస్ట్‌ల్లో 10000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరం కాగా.. అతని గైర్హాజరీలో స్మిత్ ఆసీస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. తొలి టెస్ట్‌లోనూ ఘన విజయం సాధించిన ఆసీస్.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఊడ్చేసింది. ఫిబ్రవరి 12, 14 తేదీల్లో ఆసీస్.. శ్రీలంకతో రెండు వన్డేలు ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment