![SL VS AUS 2nd Test: Steve Smith Surpasses Virat Kohli, Sets Record For Most Away Test Centuries](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/virat.jpg.webp?itok=ha3hieVa)
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు ఇది 36వ సెంచరీ. ఈ సెంచరీతో స్టీవ్ పలు రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు (జో రూట్‌తో కలిసి) చేసిన ఆటగాడిగా నిలిచాడు. రూట్, స్టీవ్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో తలో 36 సెంచరీలు చేశారు.
టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) అగ్రస్థానంలో ఉండగా.. జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు.
ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్‌లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.
విరాట్‌ను అధిగమించిన స్టీవ్
విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ ఇప్పటివరకు విదేశాల్లో 16 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో స్టీవ్ విదేశీ సెంచరీల సంఖ్య 17కు పెరిగింది.
తాజా సెంచరీతో స్టీవ్.. అలిస్టర్ కుక్, బ్రియాన్ లారా సరసన చేరాడు. కుక్, లారా ఇద్దరూ విదేశాల్లో తలో 17 టెస్ట్ సెంచరీలు చేశారు. ఈ సెంచరీతో స్టీవ్.. విదేశీ టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు (7) చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (120), అలెక్స్ క్యారీ (139) అజేయ సెంచరీలతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 73 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment