అడిలైడ్: స్మిత్, వార్నర్ లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా కనిపిస్తోందనే వాదనతో భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే విభేదించాడు. కంగారూలు తమ సొంతగడ్డపై ఆడుతున్నారనే విషయాన్ని మరచిపోవద్దని అన్నాడు. ప్రత్యర్థి బౌలింగ్‌లో చాలా పదునుందనే విషయాన్ని గుర్తు చేశాడు. ‘స్మిత్, వార్నర్ నాణ్యమైన ఆటగాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వారు లేకపోవడం వల్ల జట్టు బలహీనంగా మారిందంటే అంగీకరించను. తమదైన రోజున ఎవరైనా పరుగులు చేయగలరు. ఇక్కడి పరిస్థితుల్లో ఖవాజా, ఫించ్ కూడా ఎంతో ప్రమాదకరం.
పిచ్ ఎలా స్పందిస్తుందో వారికి బాగా తెలుసు. సొంతగడ్డపై ఏ జట్టయినా బలమైనదే. నా దృష్టిలో సిరీస్ గెలిచేందుకు ఇప్పటికీ ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. టెస్టు మ్యాచ్‌లు, సిరీస్‌లు గెలవాలంటే మంచి బౌలర్లు ఉండటం చాలా ముఖ్యం’ అని రహానే విశ్లేషించాడు. 2014–15 సిరీస్ తరహాలో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పితే భారత్ మెరుగైన స్థితిలో నిలుస్తుందని అతను అభిప్రాయ పడ్డాడు. నాటి సిరీస్‌లో మెల్‌బోర్న్ టెస్టులో రహానే, కోహ్లి 262 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లు కోహ్లిని లక్ష్యంగా చేసుకోవడంతో మరో వైపు నుంచి తన పని తాను చేసుకుపోయానని అజింక్య గుర్తు చేసుకున్నాడు. ‘గత సిరీస్‌లో కోహ్లిపైనే మిషెల్ జాన్సన్ గురి పెట్టాడు. మరో వైపు నేను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాను. కోహ్లి ఆటతో పాటు మాటలతోనూ ఎదురుదాడి చేయడంతో నా పని సులువైంది. ఇప్పుడు కూడా జట్టులో ప్రతి ఒక్కరికీ వేర్వేరు బాధ్యతలున్నాయి. వాటిని సమర్థంగా నెరవేర్చాలి. జట్టుగా ఆడే ఆట కాబట్టి వ్యక్తిగత ప్రదర్శనకంటే భాగస్వామ్యాలే మ్యాచ్‌లను గెలిపిస్తాయి’ అని వైస్ కెప్టెన్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment