స్టీవ్ స్మిత్ హద్దులు మీరుతున్నాడు: కోహ్లీ
బెంగళూరు: మ్యాచ్ గెలిచిన ఆనందం టీమిండియాలో ఉన్నా.. మరోవైపు కెప్టెన్ కోహ్లీ మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. ప్రత్యర్థి జట్టుతో మైదానంలో స్లెడ్జింగ్ చేస్తూ ఆటడం, స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించడం రెండూ వేరేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఈ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ లక్ష్మణ రేఖను దాటాడని, దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఉమేశ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన తర్వాత స్మిత్ మైదానాన్ని వీడకుండా హైడ్రామా చేయడంపై కోహ్లీ మండిపడ్డాడు. నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న హ్యాండ్ స్కాంబ్ తో చర్చించిన తర్వాత ఏదైనా డౌట్ ఉండే రివ్యూ కోరాలి గానీ, తన ఔట్ పై స్పందించాలని డ్రెస్సింగ్ రూమ్ సభ్యులను స్మిత్ కోరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాడు.
అంపైర్లకు, మ్యాచ్ రిఫరీకి ఈ విషయంపై ఫిర్యాదు చేశానని, గత మూడు రోజులుగా వారి తీరు ఇదే విధంగా ఉందని.. నేటి ఆటలో స్మిత్ ఇంకా తీవ్ర స్థాయి చర్యకు దిగాడని కోహ్లీ ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్ మాకు ఎంతో ప్రతిష్టాత్మకమని.. జట్టు అంతా ఎంతో ఉద్వేగానికి లోనైందన్నాడు. తొలి టెస్టు ఓటమితో ఒత్తిడికి లోనైన మా ఆటగాళ్లు ఈ విజయాన్ని ఎంతో ఆస్వాదిస్తారని కోహ్లీ పేర్కొన్నాడు. బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడి చిన్నస్వామి స్డేడియంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 75 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్ ను విరాట్ కోహ్లీ సేన 1-1తో సమం చేసింది.