కోహ్లీ సీరియస్.. అంపైర్ల పరుగులు!
►డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ సిస్టం!
►స్మిత్‌ను మోసగాడిగా తేల్చేసిన కోహ్లి
ఏదో ఒక వివాదమో, గొడవో లేకపోతే అది భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు ఎలా అవుతుంది? ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో అలాంటి ఘటనే జరిగింది. ఉమేశ్ బౌలింగ్‌లో స్మిత్‌ను అంపైర్ నైజెల్ లాంగ్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించారు. రివ్యూ చేయాలని భావించిన స్మిత్ ముందుగా సహచరుడు హ్యాండ్స్‌కోంబ్‌తో చర్చించాడు. అయితే సందేహం తీరక ఏంటి అన్నట్లుగా చేతులతో డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు. దీనిని గుర్తించిన కోహ్లి వెంటనే దూసుకొచ్చి అలా ఎలా చేస్తావంటూ స్మిత్‌తో వాదించాడు. ఇది తప్పంటూ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అప్పటికే స్మిత్‌ను కూడా హెచ్చరించిన అంపైర్, కోహ్లిని కూడా పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
నిబంధనల ప్రకారం ఆటగాడు డీఆర్‌ఎస్ విషయంలో మైదానంలో ఉన్నవారితో తప్ప బయటివారి సహాయం తీసుకోరాదు. చివరకు స్మిత్ రివ్యూ కోరకుండా నిష్క్రమించాడు. దీనిపై స్మిత్ స్పందిస్తూ ‘ఆ సమయంలో నా బుర్ర పని చేయలేదు. అలా చేయకుండా ఉండాల్సింది’ అని వివరణ ఇచ్చాడు. అయితే కోహ్లి మాత్రం దీనితో విభేదించాడు. ‘ఒకసారి అలా జరిగిందంటే ఏదో ఒత్తిడిలో బుర్ర పని చేయలేదు అనుకోవచ్చు. కానీ వారు మూడు రోజులుగా ఇలాగే చేశారు. నా బ్యాటింగ్ సమయంలో కూడా వారు రివ్యూ గురించి పెవిలియన్ వైపు చూశారని కచ్చితంగా చెప్పగలను. నేను అంపైర్లకు, రిఫరీకి కూడా ఫిర్యాదు చేశాను’ అని కోహ్లి అన్నాడు. ‘డీఆర్‌ఎస్ విషయంలో ఆసీస్ గీత దాటింది. నేనైతే అలా ఎప్పుడూ చేయను. స్లెడ్జింగ్ చేయడం వేరు కానీ ఇలా ....’ అంటూ ఆ మాట చెప్పకుండా ఆగిపోయి అన్యాపదేశంగా మోసం చేసినట్లు తేల్చేశాడు.
‘గో’ అంటే వెళ్లిపోయాడు...
పాపం షాన్ మార్ష్... ఉమేశ్ బౌలింగ్‌లో షాన్ మార్ష్ ను కూడా అంపైర్ ఎల్బీగా అవుటిచ్చారు. ఆ సమయానికి ఆసీస్ దగ్గర ఒక రివ్యూ ఉంది. కానీ వాడాలా వద్దా అని సంశయపడి చివరకు రివ్యూ అడగకుండానే నిష్క్రమించాడు. కానీ రీప్లేలు చూస్తే అది కచ్చితంగా నాటౌట్ అయ్యేదని తేలింది. దీనిపై వివరణ ఇస్తూ స్మిత్ ‘నేను రివ్యూ అడగమంటూ గో అని చెప్పాను. కానీ అతను తప్పుగా అర్థం చేసుకొని పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. అది నా తప్పే. నేనే రివ్యూ కోసం సైగ చేయాల్సింది’ అని చెప్పాడు.