
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్ స్మిత్ 179 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్‌లో 35వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) స్మిత్‌కు ఇది 47వ సెంచరీ. శ్రీలంక గడ్డపై మూడవది (టెస్ట్‌ల్లో).
Steve Smith with yet another 100
It's his 35th test 100✨ pic.twitter.com/4ppbWFEehc— Schrödinger (@srhnation) January 29, 2025
టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ ఏడవ స్థానానికి ఎగబాకాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38), జో రూట్ (36), రాహుల్ ద్రవిడ్ (36) మాత్రమే టెస్ట్‌ల్లో స్మిత్ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు.
తాజా సెంచరీతో స్మిత్ ఫాబ్ ఫోర్‌లో (టెస్ట్ సెంచరీల పరంగా) రెండో స్థానానికి ఎగబాకాడు. 36 సెంచరీలతో రూట్ అగ్రస్థానంలో ఉండగా.. 33 సెంచరీలతో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో, 30 సెంచరీలతో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నారు.
ఈ సెంచరీతో స్మిత్ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో నాలుగో అత్యధిక సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ (81) అగ్రస్థానంలో నిలువగా.. రూట్ (52) రెండో స్థానంలో, రోహిత్ శర్మ (48) మూడో స్థానంలో, స్మిత్ (47) నాలుగులో, కేన్ విలియమ్సన్ (46) ఐదో స్థానంలో ఉన్నారు.
వివిధ దేశాల్లో స్మిత్ చేసిన సెంచరీలు
ఆస్ట్రేలియాలో 18
ఇంగ్లండ్‌లో 8
భారత్‌లో 3
శ్రీలంకలో 3
న్యూజిలాండ్‌లో 1
సౌతాఫ్రికాలో 1
వెస్టిండీస్‌లో 1
35వ సెంచరీకి ముందు స్మిత్ ఇదే మ్యాచ్‌లో 10000 పరుగుల మైలురాయిని కూడా దాటాడు. ఈ ఇన్నింగ్స్ తొలి బంతికే స్మిత్ ఈ ఘనత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. స్టీవ్‌కు ముందు రికీ పాంటింగ్ (13378), అలెన్ బోర్డర్ (11174), స్టీవ్ వా (10927) ఈ ఘనత సాధించారు.
205వ ఇన్నింగ్స్‌లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న స్మిత్.. బ్రియాన్ లారా (195), సచిన్ టెండూల్కర్ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఈ ఫీట్‌ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
టెస్ట్ క్రికెట్‌లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (12972) తర్వాత స్టీవ్ స్మిత్ మాత్రమే 10000 పరుగుల క్లబ్‌లో చేరాడు. స్టీవ్ సమకాలీకులు కేన్ విలియమ్సన్ (9276), విరాట్ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్‌లోనే ఉన్నారు.
తన టెస్ట్ కెరీర్‌లో 114 మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 56కు పైగా సగటుతో 10100* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు, 35 సెంచరీలు, 41 అర్ద సెంచరీలు ఉన్నాయి.
ఇదే మ్యాచ్‌లో మరో ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja) కూడా సెంచరీ చేశాడు. ఖ్వాజా 135 బంతుల్లో 8 బౌండరీలు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకుని 147 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలికాలంలో పెద్దగా ఫామ్‌లో లేని ఖ్వాజాకు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి సెంచరీ. టెస్ట్‌ల్లో ఖ్వాజాకు ఇది 16వ శతకం. ఇటీవల భారత్‌తో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖ్వాజా దారుణంగా నిరాశపరిచాడు (కేవలం 20.44 సగటున పరుగులు చేశాడు).
16TH TEST CENTURY FOR USMAN KHAWAJA - A TERRIFIC KNOCK. 💯pic.twitter.com/H2jliMrAVy
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2025
ఖ్వాజా, స్మిత్ సెంచరీతో కదంతొక్కడంతో లంకతో తొలి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 81.1 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. మ్యాచ్ ముగియడానికి కొద్ది సేపటి ముందు వర్షం మొదలుకావడంతో అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 57; 10 ఫోర్లు, సిక్స్) చెలరేగి మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. వన్‌డౌన్ బ్యాటర్ లబూషేన్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రభాత జయసూర్య, జెఫ్రీ వాండర్సేలకు తలో వికెట్ దక్కింది.