
ముంబై: ఇటీవల టెస్టు ఫార్మాట్‌లో ఆ్రస్టేలియాపై తొలి విజయం అందుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ చాంపియన్‌పై తొలిసారి సిరీస్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య గురువారం జరిగే తొలి మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. గతంలో ఆ్రస్టేలియాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌కు నిరాశ ఎదురైంది. అయితే సొంతగడ్డపై ఈసారి టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఇప్పటి వరకు ఆ్రస్టేలియాతో 50 వన్డేలు ఆడిన భారత్ కేవలం 10 మ్యాచ్‌ల్లో నెగ్గి, 40 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో ఈ సీజన్‌లో భారత జట్టు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లోనూ గెలుపు రుచి చూసింది. అదే జోరు కొనసాగిస్తూ వన్డేల్లోనూ టీమిండియా సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్... బౌలింగ్‌లో రేణుక సింగ్, పూజ వస్త్రకర్, స్నేహ్ రాణా రాణిస్తే భారత్‌కు సిరీస్ విజయం దక్కే అవకాశాలున్నాయి.
మరోవైపు వరల్డ్ చాంపియన్ ఆ్రస్టేలియా ఏకైక టెస్టులో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగనుంది. యాష్లే గార్డ్‌నర్, అలీసా హీలీ, తాలియా మెక్‌గ్రాత్, ఎలీస్ పెరీ, బెత్ మూనీ ఆటతీరుపై ఆసీస్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment