బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం.. సిరీస్‌ సమర్పయామి  | Australia won the ODI series | Sakshi
Sakshi News home page

IND Vs AUS: బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం.. సిరీస్‌ సమర్పయామి 

Published Thu, Mar 23 2023 4:46 AM | Last Updated on Thu, Mar 23 2023 7:34 AM

Australia won the ODI series  - Sakshi

నాలుగేళ్ల క్రితం ఆ్రస్టేలియా జట్టు భారత పర్యటనలో వన్డే సిరీస్‌లో ఒకదశలో 0–2తో వెనుకబడింది. కానీ చివరకు 3–2తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా దాదాపు అదే తరహాలో వెనుకబడినా కూడా పుంజుకొని కంగారూ టీమ్‌ భారత గడ్డపై మరో వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. తొలి రెండు వన్డేల్లో పేస్, స్వింగ్‌ బౌలింగ్‌ను  ఆడలేక తడబడిన టీమిండియా తుదిపోరులో స్పిన్‌కు బోల్తా పడింది.

ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయకపోయినా అంతా తలా ఓ చేయి వేయడంతో ఆసీస్‌ ముందుగా 269 పరుగులు సాధించింది. ఊహించినట్లుగా స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన బ్యాటర్లు తడబడ్డారు. రోహిత్, గిల్‌ ఇచ్చిన మెరుపు ఓపెనింగ్‌ భాగస్వామ్యం, ఆ తర్వాత కోహ్లి, రాహుల్‌ అర్ధ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌తో ఒకదశలో టీమిండియా విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే 39 పరుగుల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి జట్టు ఓటమిని ఆహ్వానించింది. టెస్టు సిరీస్‌ కోల్పోయినా ఒక మ్యాచ్‌ నెగ్గిన ఆసీస్‌ బృందం, ఇప్పుడు వన్డే సిరీస్‌తో సంతృప్తిగా స్వదేశం వెళ్లనుంది. 

చెన్నై: స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలోని ఆ్రస్టేలియా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్‌ 21 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ఓడి రెండో వన్డేలో నెగ్గిన కంగారూ బృందం 2–1తో సిరీస్‌ను దక్కించుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది.

మిచెల్‌ మార్ష్ (47 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... పాండ్యా, కుల్దీప్‌ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (72 బంతుల్లో 54; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా, హార్దిక్‌ పాండ్యా (40 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆడమ్‌ జంపా (4/45) భారత్‌ను దెబ్బ తీశాడు. మెరుపు వేగంతో ఈ సిరీస్‌లో 194 పరుగులు చేసిన మిచెల్‌ మార్ష్ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు.  

ఆసీస్‌ శుభారంభం... 
గత మ్యాచ్‌ల తరహాలోనే ఆసీస్‌కు ఓపెనర్లు హెడ్‌ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్ష్ శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి 10 ఓవర్లలో 61 పరుగులు జత చేశారు. పిచ్‌పై స్పిన్‌కు అనుకూలిస్తున్నట్లు కనిపించడంతో ఆరో ఓవర్లోనే భారత్‌ అక్షర్‌తో బౌలింగ్‌ చేయించింది. అయితే పాండ్యా బౌలింగ్‌కు దిగి మ్యాచ్‌ పరిస్థితిని మార్చాడు. తన తొలి మూడు ఓవర్లలో అతను హెడ్, స్మిత్‌ (0), మార్ష్ లను పెవిలియన్‌ పంపించాడు.

ఈ దశలో వార్నర్‌ (23), లబుõషేన్‌ (28) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరిని కుల్దీప్‌ అవుట్‌ చేయడంతో స్కోరు 138/5 వద్ద నిలిచింది. ఈ సమయంలో క్యారీ (46 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్‌), స్టొయినిస్‌ (25) భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరు 58 పరుగులు జత చేశారు. భారత బౌలర్లు మళ్లీ దెబ్బ కొట్టడంతో ఆసీస్‌ స్కోరు 203/7కు చేరింది. సరిగ్గా ఇక్కడే భారత్‌ పట్టు కోల్పోయింది. లోయర్‌ ఆర్డర్‌ అండతో చివరి మూడు వికెట్లకు ఆసీస్‌ 66 పరుగులు జత చేయడం విశేషం.  

రాణించిన పాండ్యా... 
ఛేదనను ఓపెనర్లు రోహిత్‌ శర్మ (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ప్రారంభించారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఎదురుదాడినే నమ్ముకున్నారు. అయితే 12 పరుగుల వ్యవధిలో వీరిద్దరిని ఆసీస్‌ వెనక్కి పంపించింది. ఈ దశలో కోహ్లి, రాహుల్‌ (50 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 69 పరుగులు జత చేశారు.

అయితే మరీ నెమ్మదిగా ఆడిన రాహుల్‌తో పాటు అక్షర్‌ (2) కూడా నిష్క్రమించారు . కోహ్లి, పాండ్యా ఉన్నంత వరకు భారత్‌కు గెలుపు ఆశలు ఉన్నాయి. 61 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి పేలవ షాట్‌కు వెనుదిరగడంతో ఆసీస్‌ ఒత్తిడి పెంచింది. సూర్యకుమార్‌ (0) విఫలం కాగా, పాండ్యాను అవుట్‌ చేసి జంపా దెబ్బ కొట్టాడు. రవీంద్ర జడేజా (33 బంతుల్లో 18; 1 ఫోర్‌ ) ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోవడంతో లక్ష్యం మరీ కష్టంగా మారిపోయింది. మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన ఆసీస్‌ భారత బ్యాటర్లను కట్టపడేయడంతో చివరకు ఓటమి తప్పలేదు. 

సూర్యకుమార్‌ ‘హ్యాట్రిక్‌ గోల్డెన్‌ డక్‌’
పాపం సూర్యకుమార్‌ యాదవ్‌... టి20ల్లో  విధ్వంసకర బ్యాటింగ్‌తో నంబర్‌వన్‌గా ఎదిగిన అతను వన్డేల్లో మాత్రం ‘బాంబే డక్‌’గా మారిపోయాడు. ఈ సిరీస్‌కు ముందు కూడా వన్డేల్లో గొప్ప రికార్డేమీ లేకపోయినా ఈసారి ప్రదర్శన మాత్రం అయ్యో అనిపించేదే. సిరీస్‌లో ఆడిన మూడు వన్డే ల్లోనూ తొలి బంతికే వెనుదిరిగి 0, 0, 0తో ‘హ్యాట్రిక్‌ గోల్డెన్‌ డక్‌’ను నమోదు చేశాడు. గతంలో భారత ఆటగాళ్లు వరుసగా మూడు వన్డేల్లో డకౌటైనా, ఇలా మూడుసార్లు తొలి బంతికే ఎవరూ వెనుదిరగలేదు.   

స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) కుల్దీప్‌ (బి) పాండ్యా 33; మార్ష్ (బి) పాండ్యా 47; స్మిత్‌ (సి) రాహుల్‌ (బి) పాండ్యా 0; వార్నర్‌ (సి) పాండ్యా (బి) కుల్దీప్‌ 23; లబుõషేన్‌ (సి) గిల్‌ (బి) కుల్దీప్‌ 28; క్యారీ (బి) కుల్దీప్‌ 38; స్టొయినిస్‌ (సి) గిల్‌ (బి) అక్షర్‌ 25; అబాట్‌ (బి) అక్షర్‌ 26; అగర్‌ (సి) అక్షర్‌ (బి) సిరాజ్‌ 17; స్టార్క్‌ (సి) జడేజా (బి) సిరాజ్‌ 10; జంపా (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్‌) 269. వికెట్ల పతనం: 1–68, 2–74, 3–85, 4–125, 5–138, 6–196, 7–203, 8–245, 9–247, 10–269. బౌలింగ్‌: షమీ 6–0–37–0, సిరాజ్‌ 7–1–37–2, అక్షర్‌ 8–0–57–2, పాండ్యా 8–0–44–3, జడేజా 10–0–34–0, కుల్దీప్‌ 10–1–56–3.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) స్టార్క్‌ (బి) అబాట్‌ 30; గిల్‌ (ఎల్బీ) (బి) జంపా 37; కోహ్లి (సి) వార్నర్‌ (బి) అగర్‌ 54; రాహుల్‌ (సి) అబాట్‌ (బి) జంపా 32; అక్షర్‌ (రనౌట్‌) 2; పాండ్యా (సి) స్మిత్‌ (బి) జంపా 40; సూర్యకుమార్‌ (బి) అగర్‌ 0; జడేజా (సి) స్టొయినిస్‌ (బి) జంపా 18; కుల్దీప్‌ (రనౌట్‌) 6; షమీ (బి) స్టొయినిస్‌ 14; సిరాజ్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.1 ఓవర్లలో ఆలౌట్‌) 248. వికెట్ల పతనం: 1–65, 2–77, 3–146, 4–151, 5–185, 6–185, 7–218, 8–225, 9–243, 10–248. బౌలింగ్‌: స్టార్క్‌ 10–0–67–0, స్టొయినిస్‌ 9.1–0–43–1, అబాట్‌ 10–0–50–1, జంపా 10–0–45–4, అగర్‌ 10–0–41–2.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement