IND Vs AUS: టీమిండియా అంటే చాలు, రెచ్చిపోతాడు.. స్టీవ్‌ స్మిత్‌ ప్రపంచ రికార్డు | AUS Vs IND: Steve Smith Hits 11th Test Hundred VS India, The Most By Any Batter, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

IND Vs AUS 4th Test: టీమిండియా అంటే చాలు, రెచ్చిపోతాడు.. స్టీవ్‌ స్మిత్‌ ప్రపంచ రికార్డు

Published Fri, Dec 27 2024 7:36 AM | Last Updated on Fri, Dec 27 2024 9:53 AM

AUS VS IND: Steve Smith Hits 11th Test Hundred VS India, Most By Any Batter

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ సెంచరీతో మెరిశాడు. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు భారత్‌పై ఇది 11వ సెంచరీ (43 ఇన్నింగ్స్‌ల్లో). ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు భారత్‌పై ఇన్ని టెస్ట్‌ సెంచరీలు చేయలేదు. స్టీవ్‌ తర్వాత ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ జో రూట్‌ (10) భారత్‌పై అత్యధిక టెస్ట్‌ సెంచరీలు చేశాడు.

టెస్ట్‌ల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు
స్టీవ్‌ స్మిత్‌ 11
జో రూట్‌ 10
గ్యారీ ఫీల్డ్‌ సోబర్స్‌ 8
వివ్‌ రిచర్డ్స్‌ 8
రికీ పాంటింగ్‌ 8

వరుసగా రెండో సెంచరీ
స్టీవ్‌కు ఇది కెరీర్‌లో 34వ టెస్ట్‌ సెంచరీ. మెల్‌బోర్న్‌లో ఐదవది. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు వరుసగా ఇది రెండో సెంచరీ. గబ్బా వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లోనూ స్టీవ్‌ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్‌ తన సెంచరీ మార్కును 167 బంతుల్లో చేరుకున్నాడు. ఇందులో రెండు సిక్స్‌లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి.

రెండో రోజు లంచ్‌ విరామం సమయానికి స్టీవ్‌ 139 పరుగలతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా స్టార్క్‌ (15) క్రీజ్‌లో ఉన్నాడు. 113 ఓవర్లలో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 454/7గా ఉంది. రెండో రోజు తొలి సెషన్‌లో ఆసీస్‌ పాట్‌ కమిన్స్‌ (49) వికెట్‌ కోల్పోయింది.

309/6 వద్ద ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఆసీస్‌ బ్యాటర్లలో కాన్‌స్టాస్‌(60), ఖావాజా(57), లబుషేన్‌(72) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా 2, ఆకాష్‌ దీప్‌, సుందర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

విరాట్‌ రికార్డును అధిగమించిన స్టీవ్‌
టెస్ట్‌ల్లో స్టీవ్‌ విరాట్‌ పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమించాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో స్టీవ్‌ ఖాతాలో 10 సెంచరీలు (41 ఇన్నింగ్స్‌లు) ఉండగా.. విరాట్‌ 9 (47 ఇన్నింగ్స్‌లు), సచిన్‌ 9 (65 ఇన్నింగ్స్‌లు), పాంటింగ్‌ 8 (51 ఇన్నింగ్స్‌లు), మైఖేల్‌ క్లార్క్‌ 7 సెంచరీలు (40 ఇన్నింగ్స్‌లు) కలిగి ఉన్నారు.

గవాస్కర్‌, లారా సరసన స్టీవ్‌
టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్‌ 11వ స్థానానికి చేరాడు. స్టీవ్‌.. దిగ్గజాలు బ్రియాన్‌ లారా, సునీల్‌ గవాస్కర్‌, యూనిస్‌ ఖాన్‌, జయవర్దనే సరసన చేరాడు. స్టీవ్‌తో పాటు వీరంతా 34 టెస్ట్‌ సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ (51) పేరిట ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement