సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా 375 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో ఫించ్(114;124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్(105; 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్(69; 76 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో భాగంగా భారత్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్-శిఖర్ ధావన్‌లు ధాటిగా ప్రారంభించారు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌ను మెయింటైన్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 5 ఓవర్లలో 53 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు. అయితే హజిల్‌వుడ్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి మయాంక్ ఔటయ్యాడు. ఆఫ్ సైడ్ ఆడబోయిన బంతిని మ్యాక్స్‌వెల్ క్యాచ్‌గా పట్టుకోవడంతో మయాంక్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
ఆదిలోనే కోహ్లికి లైఫ్
మయాంక్ అగర్వాల్ ఔటైన తర్వాత ఫస్ట్‌డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లికి ఆదిలోనే లైఫ్ లభించింది. కోహ్లి కేవలం పరుగు వద్ద ఉండగా షాట్‌కు యత్నించాడు. కమిన్స్ వేసిన ఏడో ఓవర్ మూడో బంతిని భారీ షాట్ ఆడాడు. అది బ్యాట్‌కు మిడిల్‌కాకపోవడంతో గాల్లోకి లేచింది. ఆ సమయంలో ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆడమ్ జంపా క్యాచ్‌ను పట్టేశాడనుకున్న తరుణంలో వదిలేశాడు. క్యాచ్‌ను పట్టిన తర్వాత సరైన సమయంలో హ్యాండ్స్‌ను మూయకపోవడంతో అది నేలపాలైంది. దాంతో కోహ్లికి లైఫ్ లభించినట్లయ్యింది. కాగా, ఫ్యాన్స్ మాత్రం జంపా క్యాచ్ వదిలేసిన తీరుపై జోకులు పేల్చుతున్నారు. ఆడమ్ జంపాకు ఆర్సీబీ గుర్తొచ్చిందేమో.. కోహ్లికి లైఫ్ ఇవ్వాలని అనిపించిందేమో అని సెటైర్లు వేస్తున్నారు. ‘మా కెప్టెనే కదా అని క్యాచ్ వదిలేశాడేమో’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో జంపా ఆర్సీబీ తరఫున ఆడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు జంపా. మైదానం బయట కోహ్లి చాలా సరదా మనిషి అని వ్యాఖ్యానించాడు. ఆన్‌ఫీల్డ్‌లో చూసే కోహ్లికి, బయట చూసే కోహ్లికి చాలా తేడా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 21 పరుగులు చేసి ఔటయ్యాడు. హజిల్‌వుడ్ వేసిన 10 ఓవర్ మూడో బంతికి మిడ్‌వికెట్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ ఐదో బంతికి అయ్యర్(2) కూడా ఔటయ్యాడు. దాంతోభారత్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
సిడ్నీలో ఇదే కోహ్లి అత్యధిక స్కోరు..
ఎస్‌సీజే(సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో) కోహ్లికి ఇదే అత్యధిక వన్డే స్కోరు. గతంలో 3, 1, 8,3 పరుగుల్నే ఇక్కడ కోహ్లి సాధించాడు. తాజాగా మ్యాచ్‌లో కోహ్లి 21 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment