నేటి నుంచి దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లు
భారత్ ‘ఎ’తో ఆడనున్న భారత్ ‘డి’
భారత్ ‘బి’తో భారత్ ‘సి’ పోరు
ఉదయం గం. 9:30 నుంచి జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, అనంతపురం: దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో నేడు రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అనంతపురం వేదికగా జరగనున్న ఈ మ్యచ్‌ల్లో భారత్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘డి’... భారత్ ‘బి’ జట్టుతో భారత్ ‘సి’ తలపడనున్నాయి.
తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో భారత్ ‘బి’, ‘సి’ జట్లు విజయాలు సాధించాయి. ఈ నెల 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ మినహా టీమిండియా ప్లేయర్లెవరూ రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొనడం లేదు.
తొలి మ్యాచ్‌లో ఆడిన శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాళ్, అక్షర్ పటేల్... తమతమ జట్లను వీడి టీమిండియాతో జట్టు కట్టారు.
దీంతో భారత్ ‘సి’ జట్టులో మినహా మిగిలిన టీమ్‌లలో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ‘ఎ’ జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహించనుండగా.. ‘బి’ టీమ్‌కు అభిమన్యు ఈశ్వరన్ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు.
‘సి’ టీమ్‌కు రుతురాజ్ గైక్వాడ్, ‘డి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నారు. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో దేశవాళీల్లో నిలకడ కొనసాగిస్తున్న యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లు మంచి అవకాశం కానున్నాయి. రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ వంటి వాళ్లు మెరుగైన ప్రదర్శన చేసి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నారు.
గత మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టుకు సారథిగా వ్యవహరించిన శుబ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో మయాంక్‌కు జట్టు పగ్గాలు దక్కాయి. రెండేళ్ల క్రితం జాతీయ జట్టు తరఫున చివరి టెస్టు ఆడిన మయాంక్ తిరిగి సెలెక్టర్ల దృష్టిలో పడాలంటే భారీగా పరుగులు చేయాల్సిన అవసరముంది.
బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు కోసమే భారత జట్టును ఎంపిక చేయగా... దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేస్తే బంగ్లాతో రెండో టెస్టు కోసం ప్రకటించనున్న జట్టులో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం ప్రకటించిన టీమిండియాలో సభ్యుడైన సర్ఫరాజ్... ఈ మ్యాచ్ అనంతరం నేరుగా చెన్నైలో జట్టుతో చేరనున్నాడు. భారత్ ‘బి’ జట్టు తరఫున బరిలోకి దిగనున్న సర్ఫరాజ్ ఖాన్... మరో మంచి ఇన్నింగ్స్‌తో రాణించి టీమిండియాలో చేరాలనుకుంటున్నాడు.
ఇక గత మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నాడు. అటు బ్యాట్‌తో ఇటు బంతితో సత్తాచాటగల స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన రజత్ పాటిదార్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ తిరిగి సత్తాచాటి సెలెక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నారు.
గత మ్యాచ్ ప్లెయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేకపోయిన దేవదత్ పడిక్కల్, సంజూ సామ్సన్ భారత్ ‘డి’ జట్టు తరఫున ఈ మ్యాచ్‌లోనైనా అవకాశం దక్కించుకుంటారా చూడాలి.
ఇక పేస్ బౌలర్లు ముఖేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సుదీర్ఘ టెస్టు సీజన్‌కు ముందు లయ అందుకునేందుకు ఇది చక్కటి అవకాశం. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడనుండగా... పేస్ బౌలర్లకు విరివిగా అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో రాణించిన వారిపై సెలెక్టర్ల దృష్టి ఉండనుంది. ఇక గత మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో సత్తాచాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.
దులీప్ ట్రోఫీలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు
తిలక్ వర్మ (భారత్ ‘ఎ’)
షేక్ రషీద్ (భారత్ ‘ఎ’)
నితీశ్ కుమార్ రెడ్డి (భారత్ ‘బి’)
రికీ భుయ్ (భారత్ ‘డి’)
శ్రీకర్ భరత్ (భారత్ ‘డి’)
Comments
Please login to add a commentAdd a comment