రవీంద్ర-చహల్‌ విజయం | India beats Australia by 11 runs to take 1-0 lead | Sakshi
Sakshi News home page

రవీంద్ర-చహల్‌ విజయం

Published Sat, Dec 5 2020 2:07 AM | Last Updated on Sat, Dec 5 2020 9:29 AM

India beats Australia by 11 runs to take 1-0 lead - Sakshi

చహల్‌కు సహచరుల అభినందన

వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌ గెలిచిన ఉత్సాహంతో భారత జట్టు అదే వేదికపై టి20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరే సాధించినా... యజువేంద్ర చహల్, నటరాజన్‌ బౌలింగ్‌తో విజయం దిశగా సాగింది. అంతకుముందు కేఎల్‌ రాహుల్‌ అర్ధ సెంచరీకి తోడు రవీంద్ర జడేజా మెరుపులు జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా, ఆతిథ్య జట్టు మాత్రం అతి సాధారణ ప్రదర్శనతో తేలిపోయింది. అయితే విజయంలోనూ జడేజా–చహల్‌ ‘కన్‌కషన్‌’ వివాదం మ్యాచ్‌ ఫలితంకంటే ఎక్కువ చర్చ రేపింది.

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో భారత్‌ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 11 పరుగుల తేడాతో ఆస్టేలియాను ఓడించింది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (40 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా, రవీంద్ర జడేజా (23 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడాడు. అనంతరం ఆసీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులకే పరిమితమైంది. ఫించ్‌ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌), డార్సీ షార్ట్‌ (38 బంతుల్లో 34; 3 ఫోర్లు), హెన్రిక్స్‌ (20 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు. గాయపడ్డ జడేజా స్థానంలో ‘కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌’గా తుది జట్టులోకి వచ్చిన స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ (3/25) మూడు కీలక వికెట్లు పడగొట్టి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ ఆడిన నటరాజన్‌ (3/30) కూడా ఆకట్టుకున్నాడు.   

జడేజా మెరుపులు...
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. ధావన్‌ (1)ను స్టార్క్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే ఐపీఎల్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన రాహుల్‌ తన ఫామ్‌ను కొనసాగించాడు. అబాట్‌ బౌలింగ్‌లో రాహుల్‌ వరుసగా 4, 6 కొట్టగా పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. అయితే తర్వాతి ఓవర్లోనే కోహ్లి (9)ని అవుట్‌ చేసి స్వెప్సన్‌ దెబ్బ తీశాడు. 37 బంతుల్లో రాహుల్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, సామ్సన్‌ (15 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే ఆరు పరుగుల వ్యవధిలో భారత్‌ సామ్సన్, మనీశ్‌ పాండే (2), రాహుల్‌ వికెట్లు కోల్పోయింది. హార్దిక్‌ (16) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ దశలో జడేజా ఇన్నింగ్స్‌ జట్టుకు చెప్పుకో దగ్గ స్కోరును అందించింది. హాజల్‌వుడ్‌ వేసిన 19వ ఓవర్లో తొలి బంతిని ఫోర్‌గా మలచిన జడేజా... చివరి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 బాదాడు. చివరి ఓవర్లో కూడా అతను మరో రెండు ఫోర్లు కొట్టాడు.  

ఆకట్టుకున్న నటరాజన్‌...
సాధారణ లక్ష్య ఛేదనను ఆసీస్‌ ఓపెనర్లు డార్సీ షార్ట్, ఫించ్‌ మెరుగ్గానే ప్రారంభించారు. దీపక్‌ చహర్‌ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో 14 పరుగులు వచ్చాయి. షమీ ఓవర్లోనూ 12 పరుగులు రాబట్టిన ఆసీస్‌ పవర్‌ప్లేలో 53 పరుగులు నమోదు చేసింది. తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో పాండే, కోహ్లి క్యాచ్‌లు వదిలేసినా... స్పిన్నర్‌ చహల్‌ రాకతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. తొలి వికెట్‌కు 46 బంతుల్లో 56 పరుగులు జోడించిన అనంతరం హార్దిక్‌ పాండ్యా పట్టిన అద్భుత క్యాచ్‌తో ఫించ్‌ వెనుదిరిగాడు. చహల్‌ తన తర్వాతి ఓవర్లోనే స్మిత్‌ (12)ను కూడా అవుట్‌ చేశాడు. ఈసారి సామ్సన్‌ సూపర్‌ క్యాచ్‌ అందుకోగా, మ్యాక్స్‌వెల్‌ (2)ను ఎల్బీగా అవుట్‌ చేసిన నటరాజన్‌ తన కెరీర్‌లో తొలి వికెట్‌ సాధించాడు. ఆ తర్వాత హెన్రిక్స్‌ కొంత ప్రయత్నించడం మినహా ఆసీస్‌ గెలుపునకు చేరువగా రాలేకపోయింది. చివరి ఓవర్లో ఆసీస్‌ విజయానికి 27 పరుగులు కావాల్సి ఉండగా ఆ జట్టు 15 పరుగులే చేసింది.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) అబాట్‌ (బి) హెన్రిక్స్‌ 51; ధావన్‌ (బి) స్టార్క్‌ 1; కోహ్లి (సి అండ్‌ బి) స్వెప్సన్‌ 9; సామ్సన్‌ (సి) స్వెప్సన్‌ (బి) హెన్రిక్స్‌ 23; మనీశ్‌ పాండే (సి) హాజల్‌వుడ్‌ (బి) జంపా 2; హార్దిక్‌ (సి) స్మిత్‌ (బి) హెన్రిక్స్‌ 16; జడేజా (నాటౌట్‌) 44; సుందర్‌ (సి) అబాట్‌ (బి) స్టార్క్‌ 7; దీపక్‌ చహర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161.
వికెట్ల పతనం: 1–11; 2–48; 3–86; 4–90; 5–92; 6–114; 7–152.
బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–34–2; హాజల్‌వుడ్‌ 4–0–39–0; జంపా 4–0–20–1; అబాట్‌ 2–0–23–0; స్వెప్సన్‌ 2–0–21–1; హెన్రిక్స్‌ 4–0–22–3.  

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: డార్సీ షార్ట్‌ (సి) హార్దిక్‌ (బి) నటరాజన్‌ 34; ఫించ్‌ (సి) హార్దిక్‌ (బి) చహల్‌ 35; స్మిత్‌ (సి) సామ్సన్‌ (బి) చహల్‌ 12; మ్యాక్స్‌వెల్‌ (ఎల్బీ) (బి) నటరాజన్‌ 2; హెన్రిక్స్‌ (ఎల్బీ) (బి) చహర్‌ 30; వేడ్‌ (సి) కోహ్లి (బి) చహల్‌ 7; అబాట్‌ (నాటౌట్‌) 12; స్టార్క్‌ (బి) నటరాజన్‌ 1; స్వెప్సన్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 150.
వికెట్ల పతనం: 1–56; 2–72; 3–75; 4–113; 5–122; 6–126; 7–127.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–29–1; సుందర్‌ 4–0–16–0; షమీ 4–0–46–0; నటరాజన్‌ 4–0–30–3; చహల్‌ 4–0–25–3.
 


హార్దిక్‌ పాండ్యా అద్భుత క్యాచ్‌


కండరాల నొప్పితో కూలబడ్డ జడేజా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement