క్రికెట్‌లో క్యాచస్ విన్ మ్యాచస్ అనే నానుడు ఉంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్లో ఇదే జరిగింది. భారత ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలి అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకుని తమ జట్టు విజయంలో కీలకప్రాత పోషించారు. ముఖ్యంగా వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మైదానంలో మెరుపు వేగంగా కదిలి ఏకంగా 7 అద్బుతమైన క్యాచ్‌లు పట్టుకున్నారు.
ఆఖర్లో జడేజా అయితే బంతి గాల్లోకి లేవడమే ఆలస్యం అన్నట్లు మైదానం నలుమూలలా తిరిగి క్యాచ్‌లు అందున్నాడు. రాహుల్ నేనేమీ తక్కువ కాదన్నట్లు వికెట్ల వెనక పక్షిలా గాల్లో ఎగురుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌లు పట్టుకున్నాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో వీరికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని కొందరు అభిమానులు భావిస్తున్నారు. భారత గెలుపులో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), షమీ (9.5-0-57-7) పాత్ర ఎంత కీలకమో రాహుల్ ,జడ్డూ పాత్ర కూడా అంతే కీలకమని అభిప్రాయపడుతున్నారు.
ఫీల్డర్లకు ఎంత గుర్తింపునిస్తే అన్ని అద్భుతాలు చేస్తారని అంటున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ఫీల్డర్ల పాత్ర వెలకట్టలేనిదని కామెంట్లు చేస్తున్నారు. షమీ డ్రాప్ క్యాచ్ (విలియమ్సన్) మినహాయించి, మ్యాచ్ మొత్తం టీమిండియా ఫీల్డర్లు మైదానంలో చిరుతల్లా కదిలారని కితాబునిస్తున్నారు.
కాగా, ఉత్కంఠభరితంగా సాగిన నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి, నాలుగో సారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్, శుభ్‌మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి, శ్రేయస్, రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది.
అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఏమాత్రం తగ్గకుండా టీమిండియాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయితే లక్ష్యం భారీది కావడంతో కివీస్ బ్యాటర్లు చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడినా 40 ఓవర్ల వరకు టీమిండియాను భయపెట్టింది. డారిల్ మిచెల్ (134) పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్‌లో పాతుకుపోయి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.
విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) సహకారంతో టీమిండియాకు దడ పుట్టించాడు. లక్ష్యం గనక కాస్త చిన్నది అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment