India Vs Australia, 1st T20I: Check Live Streaming , Pitch & Weather Report - Sakshi
Sakshi News home page

India vs Australia T20: సమరానికి సై

Published Tue, Sep 20 2022 4:26 AM | Last Updated on Tue, Sep 20 2022 10:22 AM

India vs Australia T20: India vs Australia in the T20 series on 20 sept  2022 - Sakshi

గత టి20 ప్రపంచకప్‌కు భారత జట్టు చాలా పటిష్టంగా కనిపించింది. వరుసగా రెండు సీజన్లు ఐపీఎల్‌ ఆడిన వేదికపై సత్తా చాటడం ఖాయమనిపించింది. అయితే అనూహ్యంగా కనీసం సెమీస్‌ కూడా చేరలేకపోయింది. నాటి వైఫల్యానికి కారణమైన లోపాలను సరిదిద్దుకుంటూ టీమిండియా ఆ తర్వాతి నుంచి ఆటతీరును మార్చుకుంది. ఇప్పుడు సంవత్సరం తిరిగేలోగా మరో టి20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టింది. ఆ మెగా ఈవెంట్‌కు ముందు సరిగ్గా ఆరు మ్యాచ్‌లతో రోహిత్‌ సేన సన్నద్ధం కానుంది. పిచ్‌లు, పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నా ఆత్మవిశ్వాసంతో ఆసీస్‌ విమానమెక్కేందుకు మిగిలిన మ్యాచ్‌లలోనే కూర్పు ను పరీక్షించేందుకు లభించిన అవకాశమిది.   

మొహాలి: ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే జట్టుతో సొంతగడ్డపై భారత్‌ సమరానికి సై అంటోంది. ఆస్ట్రేలియాతో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీస్‌ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాతో కూడా భారత్‌ మూడు టి20లు ఆడనుంది.

వరల్డ్‌కప్‌కు టీమ్‌ను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆటగాళ్లందరినీ ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ ఆడించి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఒక అంచనాకు రానుంది. ముఖ్యంగా ఆసియా కప్‌లో టీమ్‌ను ఇబ్బంది పెట్టిన మిడిలార్డర్‌ను సరిదిద్దుకోవడం భారత్‌కు కీలకంగా మారింది. అటు ఆస్ట్రేలియా కూడా ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తుండటంతో సిరీస్‌ ఆసక్తికరంగా సాగనుంది.  

మూడో పేసర్‌ను ఆడిస్తారా...
ఆసియా కప్‌తో పోలిస్తే భారత జట్టులో రెండు కీలక మార్పులు ఖాయం. టాప్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తుది జట్టులోకి రానుండగా, కొంత కాలంగా ఆటకు దూరమైన హర్షల్‌ పటేల్‌ను కూడా పరీక్షించడం అవసరం. అలాంటప్పుడు మరో రెగ్యులర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ను ఆడిస్తారా లేదా అనేది చూడాలి. భువీకి ఎలాగూ అనుభవం ఉంది కాబట్టి వైవిధ్యం కోసం అర్‌‡్షదీప్‌ను కూడా ప్రయత్నించవచ్చు.

హార్దిక్‌ పాండ్యా మూడో పేసర్‌ పాత్రకు సరిపోడనేది ఆసియా కప్‌ నేర్పిన పాఠాల్లో ఒకటి. కాబట్టి అతడి బౌలింగ్‌ను కాకుండా రెగ్యులర్‌ బౌలర్‌ను నమ్ముకోక తప్పదు. ప్రధాన స్పిన్నర్‌గా చహల్‌కు చోటు ఖాయం. రెండో స్పిన్నర్‌గా అక్షర్, అశ్విన్‌లలో ఒకరికే అవకాశం దక్కుతుంది. ఈ సిరీస్‌తో పాటు వరల్డ్‌కప్‌ టీమ్‌లో ఉన్నా,

దీపక్‌ హుడాకు తుది జట్టులో చోటు దక్కుతుందా చెప్పలేని పరిస్థితి. టాప్‌–3గా రోహిత్, రాహుల్, కోహ్లి ఖాయం కాబట్టి తర్వాతి ముగ్గురు బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడటం అవసరం. సూర్యకుమార్, పంత్, హార్దిక్‌ సమష్టిగా విఫలం కావడంతోనే ఆసియా కప్‌లో భారత్‌ ఫైనల్‌ చేరలేకపోయింది. హార్దిక్‌ను పూర్తి స్థాయి బ్యాటర్‌గానే చూస్తూ ఐదుగురు బౌలర్లతో ఆడితే దినేశ్‌ కార్తీక్‌కు స్థానం లభించడం కష్టం.  

ఫించ్‌పై తీవ్ర ఒత్తిడి...
స్వదేశంలో వరల్డ్‌కప్‌కు ముందు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత్‌కు వచ్చి మ్యాచ్‌లు ఆడటంపై ఆస్ట్రేలియా కూడా అంత ఆసక్తిగా ఉన్నట్లు లేదు. సిరీస్‌కు ముందే విశ్రాంతి అంటూ డేవిడ్‌ వార్నర్‌ తప్పుకోగా, మరో ముగ్గురు కీలక ఆటగాళ్లు స్టార్క్, స్టొయినిస్, మిచెల్‌ మార్‌‡్ష కూడా దూరమయ్యారు. ఇలాంటి స్థితిలో కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ కచ్చితంగా రాణించాలి. పేలవ ఫామ్‌తో వన్డేల నుంచి రిటైర్‌ అయిన అతను టి20ల్లోనైనా సత్తా చాటితే జట్టుకు మేలు జరుగుతుంది.

ఫించ్‌తో కలిసి వేడ్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. స్మిత్‌ మూడో స్థానంలో ఆడతాడని ఇప్పటికే ఆసీస్‌ ప్రకటించగా, మ్యాక్స్‌వెల్‌ తనదైన దూకుడును జోడించగలడు. ఈ సిరీస్‌ ఒక యువ ఆటగాడికి ఎంతో కీలకం కానుంది. అతనే టిమ్‌ డేవిడ్‌. ఇంత కాలం సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించి తొలిసారి ఆసీస్‌ జట్టులోకి ఎంపికైన అతను ఐపీఎల్‌ అనుభవంతో ఎంత దూకుడుగా ఆడతాడో చూడాలి. కమిన్స్, హాజల్‌వుడ్, కేన్‌ రిచర్డ్సన్‌ పేస్‌ భారం మోయనుండగా, లెగ్‌స్పిన్నర్‌ జంపాకు మంచి రికార్డే ఉంది.  

23: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 23 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో భారత్, 9 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచాయి. మరో మ్యాచ్‌ వర్షంవల్ల రద్దయింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్‌ నాలుగింటిలో గెలిచి, మూడింటిలో ఓడిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement