three days cricket match
-
India vs Australia T20: సమరానికి సై
గత టి20 ప్రపంచకప్‌కు భారత జట్టు చాలా పటిష్టంగా కనిపించింది. వరుసగా రెండు సీజన్లు ఐపీఎల్ ఆడిన వేదికపై సత్తా చాటడం ఖాయమనిపించింది. అయితే అనూహ్యంగా కనీసం సెమీస్ కూడా చేరలేకపోయింది. నాటి వైఫల్యానికి కారణమైన లోపాలను సరిదిద్దుకుంటూ టీమిండియా ఆ తర్వాతి నుంచి ఆటతీరును మార్చుకుంది. ఇప్పుడు సంవత్సరం తిరిగేలోగా మరో టి20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టింది. ఆ మెగా ఈవెంట్‌కు ముందు సరిగ్గా ఆరు మ్యాచ్‌లతో రోహిత్ సేన సన్నద్ధం కానుంది. పిచ్‌లు, పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నా ఆత్మవిశ్వాసంతో ఆసీస్ విమానమెక్కేందుకు మిగిలిన మ్యాచ్‌లలోనే కూర్పు ను పరీక్షించేందుకు లభించిన అవకాశమిది. మొహాలి: ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే జట్టుతో సొంతగడ్డపై భారత్ సమరానికి సై అంటోంది. ఆస్ట్రేలియాతో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాతో కూడా భారత్ మూడు టి20లు ఆడనుంది. వరల్డ్‌కప్‌కు టీమ్‌ను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆటగాళ్లందరినీ ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ ఆడించి టీమ్ మేనేజ్మెంట్ ఒక అంచనాకు రానుంది. ముఖ్యంగా ఆసియా కప్‌లో టీమ్‌ను ఇబ్బంది పెట్టిన మిడిలార్డర్‌ను సరిదిద్దుకోవడం భారత్‌కు కీలకంగా మారింది. అటు ఆస్ట్రేలియా కూడా ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తుండటంతో సిరీస్ ఆసక్తికరంగా సాగనుంది. మూడో పేసర్‌ను ఆడిస్తారా... ఆసియా కప్‌తో పోలిస్తే భారత జట్టులో రెండు కీలక మార్పులు ఖాయం. టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి రానుండగా, కొంత కాలంగా ఆటకు దూరమైన హర్షల్ పటేల్‌ను కూడా పరీక్షించడం అవసరం. అలాంటప్పుడు మరో రెగ్యులర్ బౌలర్ భువనేశ్వర్‌ను ఆడిస్తారా లేదా అనేది చూడాలి. భువీకి ఎలాగూ అనుభవం ఉంది కాబట్టి వైవిధ్యం కోసం అర్‡్షదీప్‌ను కూడా ప్రయత్నించవచ్చు. హార్దిక్ పాండ్యా మూడో పేసర్ పాత్రకు సరిపోడనేది ఆసియా కప్ నేర్పిన పాఠాల్లో ఒకటి. కాబట్టి అతడి బౌలింగ్‌ను కాకుండా రెగ్యులర్ బౌలర్‌ను నమ్ముకోక తప్పదు. ప్రధాన స్పిన్నర్‌గా చహల్‌కు చోటు ఖాయం. రెండో స్పిన్నర్‌గా అక్షర్, అశ్విన్‌లలో ఒకరికే అవకాశం దక్కుతుంది. ఈ సిరీస్‌తో పాటు వరల్డ్‌కప్ టీమ్‌లో ఉన్నా, దీపక్ హుడాకు తుది జట్టులో చోటు దక్కుతుందా చెప్పలేని పరిస్థితి. టాప్–3గా రోహిత్, రాహుల్, కోహ్లి ఖాయం కాబట్టి తర్వాతి ముగ్గురు బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడటం అవసరం. సూర్యకుమార్, పంత్, హార్దిక్ సమష్టిగా విఫలం కావడంతోనే ఆసియా కప్‌లో భారత్ ఫైనల్ చేరలేకపోయింది. హార్దిక్‌ను పూర్తి స్థాయి బ్యాటర్‌గానే చూస్తూ ఐదుగురు బౌలర్లతో ఆడితే దినేశ్ కార్తీక్‌కు స్థానం లభించడం కష్టం. ఫించ్‌పై తీవ్ర ఒత్తిడి... స్వదేశంలో వరల్డ్‌కప్‌కు ముందు మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌కు వచ్చి మ్యాచ్‌లు ఆడటంపై ఆస్ట్రేలియా కూడా అంత ఆసక్తిగా ఉన్నట్లు లేదు. సిరీస్‌కు ముందే విశ్రాంతి అంటూ డేవిడ్ వార్నర్ తప్పుకోగా, మరో ముగ్గురు కీలక ఆటగాళ్లు స్టార్క్, స్టొయినిస్, మిచెల్ మార్‡్ష కూడా దూరమయ్యారు. ఇలాంటి స్థితిలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ కచ్చితంగా రాణించాలి. పేలవ ఫామ్‌తో వన్డేల నుంచి రిటైర్ అయిన అతను టి20ల్లోనైనా సత్తా చాటితే జట్టుకు మేలు జరుగుతుంది. ఫించ్‌తో కలిసి వేడ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. స్మిత్ మూడో స్థానంలో ఆడతాడని ఇప్పటికే ఆసీస్ ప్రకటించగా, మ్యాక్స్‌వెల్ తనదైన దూకుడును జోడించగలడు. ఈ సిరీస్ ఒక యువ ఆటగాడికి ఎంతో కీలకం కానుంది. అతనే టిమ్ డేవిడ్. ఇంత కాలం సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించి తొలిసారి ఆసీస్ జట్టులోకి ఎంపికైన అతను ఐపీఎల్ అనుభవంతో ఎంత దూకుడుగా ఆడతాడో చూడాలి. కమిన్స్, హాజల్‌వుడ్, కేన్ రిచర్డ్సన్ పేస్ భారం మోయనుండగా, లెగ్‌స్పిన్నర్ జంపాకు మంచి రికార్డే ఉంది. 23: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 23 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో భారత్, 9 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచాయి. మరో మ్యాచ్ వర్షంవల్ల రద్దయింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగింటిలో గెలిచి, మూడింటిలో ఓడిపోయింది. -
విహారి, రోహిత్, అన్షుల్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో స్పోర్టింగ్ ఎలెవన్, ఆర్. దయానంద్ జట్ల మధ్య జరి గిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలిరోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ రెండు రోజులు మాత్రమే జరిగింది. ఓవర్‌నైట్ స్కోరు 247/1తో శుక్రవారం మూడో రోజుతొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆర్. దయానంద్ జట్టు ఆటముగిసే సమయానికి 142.1 ఓవర్లలో 6 వికెట్లకు 630 పరుగుల భారీ స్కోరు చేసింది. దయానంద్ జట్టుకు ప్రాతిని ధ్యం వహిస్తున్న ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి (96 బంతుల్లో 136; 10 ఫోర్లు, 12 సిక్సర్లు), పి. రోహిత్ రెడ్డి (92 బంతుల్లో 108; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీలు చేయగా... జె. అన్షుల్ లాల్ (243 బంతుల్లో 122 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. టి. ఆరోన్ పాల్ (50 నాటౌట్), భగత్ వర్మ (75) అర్ధ సెంచరీలు చేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టుకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. ఇతర ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్ మ్యాచ్‌ల వివరాలు ఆంధ్రాబ్యాంక్: 286 (కార్తి్తకేయ 4/86); జై హనుమాన్: 288/6 (రోహిత్ రాయుడు 97 నాటౌట్, విఠల్ అనురాగ్ 42). డెక్కన్ క్రానికల్: 198 (నితీశ్ రెడ్డి 61, బి. రేవంత్ 92; రాజమణి ప్రసాద్ 4/52, అజయ్ దేవ్ 3/51); ఈఎంసీసీ: 179/7 (బెంజ మిన్ థామస్ 68 నాటౌట్; వరుణ్ గౌడ్ 3/43). ఎస్బీఐ: 320/6 (డానీ డెరెక్ ప్రిన్స్ 86, బి. సుమంత్ 99, ఆకాశ్ భండారి 69; ప్రణీత్ రాజ్ 5/63); ఇన్‌కం ట్యాక్స్‌తో మ్యాచ్. కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 337/7 డిక్లేర్డ్; ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్: 302 (హృషికేశ్ సింహా 110, జయసూర్య 48; మెహదీ హసన్ 4/73, మీర్ ఒమర్ ఖాన్ 3/37). జెమిని ఫ్రెండ్స్: 292 (ఎం. రాధాకృష్ణ 90; శ్రీ చరణ్ 4/106, రాజేంద్ర 5/53); హైదరాబాద్ బాట్లింగ్: 131/2 (జయరామ్ రెడ్డి 37, జి. రోహన్ యాదవ్67 నాటౌట్). కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 190, ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 213 (టి. వంశీకృష్ణ 37, జి. చిరంజీవి 40, హేమంత్ సింగ్ 50; ఆకాశ్ సనా 5/32), కాంటినెంటల్ రెండో ఇన్నింగ్స్: 86/4 (సాయి ప్రణయ్ 34; ఎం. సురేశ్ 3/44);