ఊరట విజయం
♦ ఆఖరి వన్డేలో భారత్ గెలుపు
♦ 2-1తో సిరీస్ బంగ్లా వశం
♦ రాణించిన ధావన్, ధోని
హమ్మయ్య... ఇక భారత జట్టు కాస్త ధైర్యంగానే స్వదేశానికి రావచ్చు. సిరీస్ ఓటమితో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనిసేన.. బంగ్లాదేశ్‌తో ఆఖరి వన్డేలో ఊరట విజయాన్ని దక్కించుకుంది. సిరీస్‌లో తొలిసారి భారత్ అసలు సిసలు ఆటతీరుతో చెలరేగడంతో... బంగ్లా‘వాష్’ ఆశ నెరవేరలేదు.
మిర్పూర్ : సొంతగడ్డపై వరుసగా మూడో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి అరుదైన రికార్డును అందుకోవాలనుకున్న బంగ్లాదేశ్‌కు భారత్ కళ్లెం వేసింది. సిరీస్‌లో తొలిసారి అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించిన ధోనిసేన మూడో వన్డేలో 77 పరుగులతో ఘన విజయం సాధించింది. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 317 పరుగులు చేసింది. ధావన్ (73 బంతుల్లో 75; 10 ఫోర్లు), ధోని (77 బంతుల్లో 69; 6 ఫోర్లు, 1 సిక్స్), రాయుడు (49 బంతుల్లో 44; 3 ఫోర్లు), రైనా (21 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.
మొర్తజా 3, ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. షబ్బీర్ రెహమాన్ (38 బంతుల్లో 43; 6 ఫోర్లు), సౌమ్య సర్కార్ (34 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), లిట్టన్ దాస్ (50 బంతుల్లో 34; 3 ఫోర్లు), నాసిర్ హుస్సేన్ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు)లు మెరుగ్గా ఆడారు. రైనా 3, అశ్విన్, ధవల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచిన సురేశ్ రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ముస్తాఫిజుర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు.
ధావన్ జోరు
జడేజా, భువనేశ్వర్‌ల స్థానంలో బిన్నీ, ఉమేశ్‌లను భారత్ తుది జట్టులోకి తెచ్చింది. ఓపెనర్లలో ధావన్ ఫామ్‌ను కొనసాగించగా, రోహిత్ (29 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి నిరాశపర్చాడు. వన్‌డౌన్‌లో కోహ్లి (35 బంతుల్లో 25; 1 ఫోర్) విఫలమయ్యాడు. 50 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధావన్... రెండో వికెట్‌కు కోహ్లితో కలిసి 75 పరుగులు జోడించాడు. తర్వాత ధావన్‌తో జతకలిసిన ధోని వేగంగా ఆడాడు.
నాసిర్ ఓవర్ (23)లో సిక్సర్, ఫోర్‌తో కెప్టెన్ టచ్‌లోకి వచ్చాడు. అయితే 27వ ఓవర్‌లో మొర్తజా.. ధావన్‌ను అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన రాయుడు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ధోనితో పోటీగా పరుగులు చేయడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 58 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధోనితో పాటు రాయుడు కూడా స్వల్ప వ్యవధిలో అవుటయ్యాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచారు. చివర్లో రైనా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. బిన్నీ (11 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) కూడా జోరు పెంచడంతో భారత్‌కు భారీస్కోరు లభించింది.
ఆకట్టుకున్న బౌలర్లు
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్‌ను భారత్ బౌలర్లు బాగా కట్టడి చేశారు. రెండో ఓవర్‌లోనే తమీమ్ (5)ను అవుట్ చేసిన ధవల్.. పవర్‌ప్లే ముగియకముందే సౌమ్య సర్కార్‌నూ పెవిలియన్‌కు చేర్చాడు. వన్‌డౌన్‌లో లిట్టన్ దాస్, తర్వాత ముష్ఫికర్ (24) ఓ మాదిరిగా ఆడారు. అయితే రైనా, అక్షర్‌లు స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దర్ని అవుట్ చేయడంతో బంగ్లా 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్‌లో షకీబ్ (20), మొర్తజా (0)లు నిరాశపరిచారు. షబ్బీర్ రెహమాన్, నాసిర్ హుస్సేన్‌లు కాసేసపు పోరాడినా టెయిలెండర్ల నుంచి సహకారం లభించలేదు. ఓవరాల్‌గా బంగ్లా 122 పరుగుల తేడాలో చివరి 6 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.
ముస్తాఫిజుర్ ప్రపంచ రికార్డు
మూడో వన్డేలో రెండు వికెట్లు తీసిన ముస్తాఫిజుర్... మొత్తం 13 వికెట్లతో సిరీస్‌లో అత్యధిక వికెట్ల రికార్డు నెలకొల్పాడు. గతంలో హారిస్ (ఆస్ట్రేలియా) కూడా 13 వికెట్లు తీసినా... ఐదు వన్డేల సిరీస్‌లో సాధించాడు.
భారత్‌పై బంగ్లాదేశ్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
రెండు ఓటముల తర్వాత పౌరుషం పొడుచుకొచ్చిందో... లేక ప్రతిష్ట గుర్తొచ్చిందో... మొత్తానికి ధోనిసేన తమ సత్తా చూపెట్టింది. నిజానికి భారత్, బంగ్లాదేశ్‌ల బలాలను పరిశీలిస్తే... మూడు వన్డేల్లోనూ ధోని సేన సులభంగా గెలవాల్సింది. కానీ తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిపోయి, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఆలస్యంగా కోలుకుంది. ఈసారి కూడా ఓడిపోయి ఉంటే పరువు పాతాళంలోకి పోయేది. సిరీస్‌లో తొలిసారి భారత బ్యాట్స్‌మెన్ స్థాయికి తగ్గట్టు ఆడారు. రోహిత్ విఫలమైనా, ధావన్ నిలకడగా ఆడటంతో లోటు తెలియదు. ఇక కోహ్లి సిరీస్ ఆసాంతం విఫలమయ్యాడు.
సిరీస్‌కు ముందు ఊహించినట్లే ధోని తనని తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేసుకున్నాడు. ఇన్నాళ్లూ ఆరో స్థానంలో ఆడిన కెప్టెన్... ఇకపై నాలుగో నంబర్‌లో ఆడతానని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ కీలక దశలో వచ్చిన ధోని క్రీజులో ఎక్కువ సేపు గడపడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. మొత్తానికి ఓ అర్ధసెంచరీతో విమర్శకులకు కొంతమేర సమాధానం చెప్పాడు. నిజానికి ధోని సహజశైలిలో ఆడిన షాట్లు తక్కువ. అయితే ఇకపై గతంలో లాగా హెలికాప్టర్ ఎగరదనేది ధోనికి కూడా అర్థమైంది. అందులో మధ్య ఓవర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పడమనే బాధ్యత తీసుకుంటున్నాడు. రాయుడు, రైనా కూడా రాణించడంతో భారత్ సిరీస్‌లో తొలిసారి 300 మార్కును దాటింది.
తొలి రెండు వన్డేల విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం బంగ్లాదేశ్ జట్టులో కనిపించింది. పవర్‌ప్లేలో సర్కార్ ఆడిన తీరు... రెండు వికెట్లు పడ్డాక కూడా ముష్ఫికర్, దాస్ ఆడిన షాట్లు చూస్తే... కచ్చితంగా మరో విజయం కోసమే ఆ జట్టు తపన పడిందని అర్థమైంది. అయితే భారీ లక్ష్యం ఛేదించే సమయంలో కచ్చితంగా టాపార్డర్‌లో ఎవరో ఒకరు సెంచరీ చేసి నిలబడాలి. లేకపోతే ఎంత పెద్ద జట్టుకైనా 300 ఛేదించడం కష్టం. కాబట్టి బంగ్లా క్లీన్‌స్వీప్ ఆశ తీరలేదు.
ఇక కొంత విశ్రాంతి
ప్రస్తుతం భారత జట్టుకు కొంత విశ్రాంతి దొరుకుతుంది. షెడ్యూల్ ప్రకారం జులైలో జింబాబ్వే వెళ్లాల్సి ఉన్నా ఆ సిరీస్‌కు ద్వితీయ శ్రేణి జట్టును పంపుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రావచ్చు. ఒకవేళ సీనియర్లు విశ్రాంతి తీసుకుంటే... ఆగస్టులో శ్రీలంక వెళ్లేదాకా వీళ్లకి క్రికెట్ లేదు. కాబట్టి భారత క్రికెటర్లకు పూర్తిగా నెలరోజులకు పైగా విశ్రాంతి దొరుకుతుంది. మూడో వన్డేలోనూ భారత్ ఓడిపోయి ఉంటే ధోని రాజీనామా చేసేదాకా గోల జరిగేది. కానీ మూడో వన్డేలో జట్టు గెలవడం, ధోని ఆడటంతో తాత్కాలికంగా విమర్శలకు తె రపడుతుంది.
చాలా లోపాలు ఉన్నాయి
బంగ్లాదేశ్ పర్యటన ద్వారా భారత్‌కు పరాభవం ఎదురైనా... ఆకాశంలో విహరిస్తున్న స్టార్ ఆటగాళ్లను ఈ సిరీస్ కొంత మేరకు నేలకు దించింది. స్టార్ హోదా ఉంటే పరుగులు రావని, చిన్న జట్టయినా కచ్చితంగా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలని తెలిసొచ్చింది. బౌలింగ్ విభాగంలో మాత్రం చాలా లోపాలు కనిపించాయి. అశ్విన్‌తో సమస్య లేకపోయినా రెండో స్పిన్నర్ పాత్రను జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ సరిగ్గా పోషించలేకపోయారు. చివరకు రైనా రెండో స్పిన్నర్‌గా జట్టును ఆదుకోవాల్సి వచ్చింది.
ఇక పేస్ విభాగంలో ఏ ఒక్కరు కూడా మూడు మ్యాచ్‌లు ఆడలేకపోయారు. బంగ్లాదేశ్ కుర్రాడు ముస్తాఫిజుర్ చూపించిన దారిలో కూడా బంతులు వేయలేకపోయారు. కాబట్టి భారత సెలక్టర్లు ఈ సిరీస్ ఫలితాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇప్పటికిప్పుడు జట్టును పూర్తిగా మార్చకపోయినా... దేశవాళీ క్రికెట్‌లో నిలకడ చూపుతున్న కుర్రాళ్లను ఒకరిద్దరిని తీసుకుని అవకాశాలివ్వాలి.
కోచ్ కావాలి
తాను జట్టుతో ఉండగా ప్రత్యేకంగా కోచ్ అవసరం లేదని రవిశాస్త్రి అంటున్నాడు. కోహ్లి, ధోని కూడా దీనికి వంత పాడుతున్నారు. కోచ్ లేకుండా తమ సమస్యలు సరిదిద్దుకునే ప్రొఫెషనలిజమ్ ఈ క్రికెటర్లలో ఉంటే ఈ సిరీస్‌లో ఓడిపోయేవారే కాదు. కాబట్టి ఢాంబికాలు పక్కనబెట్టి సరైన కోచ్‌ను వెతుక్కోవడమే మేలు. సలహా కమిటీ సచిన్, లక్ష్మణ్, గంగూలీ ఈ సిరీస్ ఫలితాన్ని ఎలా విశ్లేషిస్తారనేది అన్నింటికంటే ఆసక్తికర అంశం.
-సాక్షి క్రీడావిభాగం
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) లిట్టన్ (బి) ముస్తాఫిజుర్ 29; ధావన్ (సి) నాసిర్ (బి) మొర్తజా 75; కోహ్లి (బి) షకీబ్ 25; ధోని (సి) ముస్తాఫిజుర్ (బి) మొర్తజా 69; రాయుడు (సి) లిట్టన్ (బి) మొర్తజా 44; రైనా (బి) ముస్తాఫిజుర్ 38; బిన్నీ నాటౌట్ 17; అక్షర్ పటేల్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 317.
వికెట్ల పతనం : 1-39; 2-114; 3-158; 4-251; 5-268; 6-301.
బౌలింగ్ : ముస్తాఫిజుర్ 10-0-57-2; మొర్తజా 10-0-76-3; అరాఫత్ సన్నీ 6-0-42-0; రూబెల్ హుస్సేన్ 9-0-75-0; నాసిర్ హుస్సేన్ 6-0-27-0; షకీబ్ 9-1-33-1.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : తమీమ్ ఎల్బీడబ్ల్యు (బి) కులకర్ణి 5; సౌమ్య సర్కార్ (సి) అశ్విన్ (బి) కులకర్ణి 40; లిట్టన్ దాస్ (బి) అక్షర్ 34; ముష్ఫికర్ (సి) ధోని (బి) రైనా 24; షకీబ్ (సి) కులకర్ణి (బి) రైనా 20; షబ్బీర్ (బి) బిన్నీ 43; నాసిర్ హుస్సేన్ (సి) రాయుడు (బి) అశ్విన్ 32; మొర్తజా (బి) అశ్విన్ 0; అరాఫత్ సన్నీ నాటౌట్ 14; రూబెల్ హుస్సేన్ (సి) అక్షర్ (బి) రైనా 2; ముస్తాఫిజుర్ ఎల్బీడబ్ల్యు (బి) రాయుడు 9;ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: (47 ఓవర్లలో ఆలౌట్) 240.
వికెట్ల పతనం : 1-8; 2-62; 3-112; 4-118; 5-148; 6-197; 7-205; 8-216; 9-222; 10-240
బౌలింగ్ : స్టువర్ట్ బిన్నీ 6-0-41-1; ధవల్ కులకర్ణి 8-0-34-2; ఉమేశ్ 4-0-33-0; అశ్విన్ 10-1-35-2; అక్షర్ 9-1-44-1; రైనా 8-0-45-3; రాయుడు 2-1-5-1.