సమష్టిగా సాధిద్దాం | Missing piece in Dhoni’s jigsaw: Hardik Pandya poised to make the World T20 stage his own | Sakshi
Sakshi News home page

సమష్టిగా సాధిద్దాం

Published Mon, Mar 14 2016 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

సమష్టిగా సాధిద్దాం

సమష్టిగా సాధిద్దాం

నేటినుంచి టి20 ప్రపంచ కప్ 
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఢీ


ఐదేళ్ల క్రితం సొంతగడ్డపై ధోనిసేన సగర్వంగా వన్డే ప్రపంచకప్‌ను అందుకున్న జ్ఞాపకాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. విదేశాల్లో ఎంత పెద్ద సిరీస్‌లు గెలిచినా, ఎన్ని ట్రోఫీలు సాధించినా... స్వదేశంలో, సొంత ప్రేక్షకుల సమక్షంలో ప్రపంచకప్‌ను అందుకోవడం దేశంలో ప్రతి క్రికెట్ అభిమానికి గర్వకారణం. మరోసారి ధోని నేతృత్వంలోని భారత బృందం ఈ ఘనత సాధించడానికి సన్నద్ధమైంది.

ఆటగాళ్లు మారినా, ఫార్మాట్ మారినా... కెప్టెన్ అయిన దగ్గరి నుంచి ధోనిది ఒకటే మంత్రం. ‘జట్టులో ప్రతి ఆటగాడి సక్సెస్‌ను మిగిలిన ఆటగాళ్లంతా ఆస్వాదించాలి’... ‘సమష్టితత్వం కనబరిస్తేనే విజయాలు దక్కుతాయి’.... ఈ రెండు సూత్రాలతోనే ధోని భారత క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగాడు. మరోసారి అదే మంత్రంతో యువ జట్టును తీసుకుని ప్రపంచ సమరానికి సిద్ధమయ్యాడు. స్వదేశంలో ఆడుతున్న ఒత్తిడి తగ్గాలంటే తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించాలి. ఇప్పుడు భారత్ అదే లక్ష్యంతో ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది.
 
నాగ్‌పూర్‌నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ఆసియా కప్‌లో పరుగుల వరద పారని బోరింగ్ మ్యాచ్‌లను చూసిన విషయాన్ని ఇక మరచిపోండి. రికార్డులు కొల్లగొట్టే స్కోర్లు కనిపించలేదని బెంగ వద్దు. ఇప్పుడు అసలైన ధనాధన్ క్రికెట్‌కు చిరునామాగా టి20 ప్రపంచకప్ వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఎదురు చూసిన అభిమానులు క్రికెట్‌లో ఆనందం వెతుక్కునే సమయం ఆసన్నమైంది. రాబోయే 20 రోజుల పాటు పరుగుల ప్రవాహం సాగే వరల్డ్ కప్ నేడు (మంగళవారం) ప్రారంభమవుతోంది. ఆతిథ్య జట్టు హోదాలో భారత్ మొదటి మ్యాచ్ ఆడుతోంది. ఇక్కడి జామ్‌తా మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఎలాంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలాంటి హంగామా, సందడి లేకుండా నేరుగా మ్యాచ్‌తోనే టోర్నీ మొదలు కానుంది.

 బ్యాటింగ్ ఆర్డర్‌లో...
తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియా సన్నాహకం భిన్నంగా సాగింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు విడిగా వేర్వేరు నెట్స్‌లో సాధన మొదలు పెట్టారు. జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా నెట్స్‌లో త్రో డౌన్స్‌కే ప్రాక్టీస్ చేశారు. ముందుగా రోహిత్, ధావన్, కోహ్లి... ఆ తర్వాత రైనా, యువరాజ్, ధోని బ్యాటింగ్ చేశారు. చివర్లో కొన్ని బంతులు మినహా జట్టు సహాయక సిబ్బంది, ప్రాక్టీస్ బౌలర్లు విసిరిన బంతులకు అంతా భారీ షాట్లు ఆడారు.  ప్రధాన బౌలర్లు ఎవరూ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయలేదు. మరో వైపు బౌలర్లు ప్రత్యేకంగా సాధన చేశారు. నెట్స్‌లో బ్యాట్స్‌మన్ లేకుండా కేవలం స్టంప్స్‌ను పెట్టి బౌలింగ్ చేశారు. అయితే బుమ్రా, షమీ మాత్రం బౌలింగ్ చేయకుండా కేవలం బంతులు అందించేందుకే పరిమితం కాగా... అశ్విన్, హర్భజన్, జడేజా మాత్రం చాలా కొద్ది సేపు మాత్రమే బౌలింగ్ చేశారు.

సెషన్ ముగిసినా యువరాజ్ మాత్రం ఎక్కువ సేపు ప్రత్యేకంగా శ్రమించాడు. క్యురేటర్ చెప్పినదాని ప్రకారం పూర్తిగా బ్యాటింగ్ వికెట్, భారీ స్కోరుకు అవకాశం ఉండటంతో టీమ్ మేనేజ్‌మెంట్ అదే ఆలోచనతో ప్రాక్టీస్ చేయించినట్లుంది. ప్రస్తుత స్థితిలో బ్యాట్స్‌మెన్‌పైనే భారం ఎక్కువ కాబట్టి బౌలర్లను పెద్దగా శ్రమ పెట్టినట్లు లేదు. ఎప్పటిలాగే గాయాల భయంతో వార్మప్ ఫుట్‌బాల్‌కు దూరంగా ఉన్న నెహ్రా కూడా నెట్స్‌లో కనీసం రెండు ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేదు. అయితే షమీపై ఇంకా సందేహాలు ఉండటంతో తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు.

 జోరుగా అండర్సన్
‘ఐపీఎల్ ఎలాగూ ఆడుతున్నాడు కాబట్టి ఈ టోర్నీకి మెకల్లమ్ ఉంటే బాగుండేది. రిటైర్మెంట్‌కు ఇది తగిన సమయం కాదు’... కివీస్ కెప్టెన్ విలియమ్సన్ చేసిన వ్యాఖ్య ఇది. బ్రెండన్ ఉండి ఉంటే అతని ప్రభావం ఎలా ఉండేదో చెప్పడానికి ఈ మాట చాలు. బయట ఎంత క్రికెట్ ఆడినా ఒక రకంగా భారత్‌లో కివీస్ పూర్తిగా కొత్త జట్టులాంటిదే. ప్రాక్టీస్ సందర్భంగా నెట్స్‌లో న్యూజిలాండ్ అందరు ఆటగాళ్లను  పరీక్షించింది.  బ్యాట్స్‌మెన్, బౌలర్లు సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో శ్రమించారు.

నేటి మ్యాచ్‌లో కివీస్ తరఫున కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న కోరీ అండర్సన్ తనదైన శైలిలో భారీ షాట్లు ఆడగా, మరో  కీలక ఆటగాడు గప్టిల్ ఎక్కువసేపు సాధన చేశాడు.  ఇక్కడ ఆ జట్టుకు ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉన్న స్పిన్‌పైనే వారు ఎక్కువగా శ్రద్ధ పెట్టారు. కివీస్‌కు సహకరించిన ప్రాక్టీస్ బౌలర్లంతా స్పిన్నర్లే కావడం విశేషం.

 జట్లు (అంచనా)
 భారత్        : ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా
న్యూజిలాండ్ : విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, రాంచీ, టేలర్, ఇలియట్, సాన్‌ట్నర్, మెకల్లమ్, సౌతీ, మెక్లీన్‌గన్, బౌల్ట్.
 
 
ఇక్కడ స్పిన్ పిచ్‌లు ఎదురవుతాయని తెలుసు. అందుకోసం సన్నద్ధమయ్యే వచ్చాం. టోర్నీకి ముందు ఎక్కువ టి20 మ్యాచ్‌లు ఆడలేదు. కానీ అదేమీ వరల్డ్ కప్ మ్యాచ్‌ల గెలుపుపై గ్యారంటీ ఇవ్వదు. బ్రెండన్ లేడని తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే మా వ్యూహాలు రూపొందించుకున్నాం. టోర్నీ గెలవగలిగితే మార్టిన్ క్రోకు అంతకంటే పెద్ద నివాళి ఉండదు    - విలియమ్సన్, కివీస్ కెప్టెన్
 
 వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ ఆడుతున్నప్పుడు పాండ్యా, బుమ్రాలాంటి కుర్రాళ్లలో ఒక రకమైన ఉద్వేగం ఉంటుంది. 2011లో నేనూ దానిని అనుభవించాను. అయితే దీని వల్ల దృష్టి మరలకుండా ఏకాగ్రతగా ఆడటం ముఖ్యం. సొంతగడ్డపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. మైదానంలో మేం హాయిగా ఆడతాం. కానీ మైదానం బయట దీనిని తట్టుకోవడమే కష్టం. బ్యాటింగ్ చేసే అవకాశం రాని ఆటగాళ్లనుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోవడమే మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న మంచి వాతావరణానికి సూచన. టోర్నీలో శుభారంభంపై నమ్మకంతో ఉన్నాం.  - విరాట్ కోహ్లి
4  న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగు టి20 మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటీ గెలవలేదు.
 
 రా. గం. 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 పిచ్, వాతావరణం
పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం, భారీ స్కోరు నమోదు కావచ్చని క్యురేటర్ కర్లేకర్ చెప్పారు. పేస్‌బౌలర్లు కొంత ప్రభావం చూపగలరు కానీ  స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చు. మంచు ప్రభావం లేదు. శనివారం క్వాలిఫయర్ మ్యాచ్ రోజున అనూహ్యంగా ఇక్కడ వర్షం కురిసినా... ఇప్పుడు దాని ప్రభావం లేదు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది.
 
భువనేశ్వర్ కూడా జట్టుతోనే
గత ఏడాది వన్డే వరల్డ్ కప్ తరహాలోనే ఈ సారి కూడా భారత్ అదనపు ఆటగాడిని జట్టుతో కొనసాగిస్తోంది. షమీ గాయం గురించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో 15 మంది సభ్యుల జట్టులో లేని భువనేశ్వర్‌కుమార్ టీమ్‌తోపాటు వెళుతున్నాడు. సోమవారం షమీ ఒక్క బంతి వేయకపోగా, భువీ మాత్రం సుదీర్ఘంగా నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.
 
నల్ల రిబ్బన్‌లతో న్యూజిలాండ్ ఆటగాళ్లు
టి20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో న్యూజి లాండ్ ఆటగాళ్లు తమ భుజాలకు నల్ల రిబ్బన్‌లు ధరించి బరిలోకి దిగబోతున్నారు. తమ క్రికెట్ దిగ్గజం మార్టిన్ క్రో మృతికి నివాళిగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలం క్యాన్సర్‌తో పోరాడిన 53 ఏళ్ల మార్టిన్ క్రో ఈనెల 3న మరణించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement