భారత్ ‘జిగేల్’
ఐదు వికెట్లతో చెలరేగిన అమిత్ మిశ్రా
సిరీస్ 3-2తో ధోని సేన సొంతం
చివరి వన్డేలో 190 పరుగులతో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం
వెలుగుల పండుగకు ఒక రోజు ముందే భారత క్రికెట్ అభిమానులు దీపావళి చేసుకున్నారు. మన బౌలింగ్ ‘బాంబు’ అదిరేలా పేలడంతో విశాఖలో కివీస్ ‘తుస్’మంది. మిశ్రా ‘మిస్సైల్’ దాడికి ఆ జట్టు తునాతునకలైంది. వన్డే సిరీస్ అంతటా ఆకట్టుకున్న న్యూజిలాండ్ బ్యాటింగ్... అసలు సమయంలో పేలని టపాసులా తుస్‌మంది. ఎప్పటిలాగే సీజన్‌తో సంబంధం లేకుండా వెలుగులు విరజిమ్మే కోహ్లితో పాటు ‘దోసౌవాలా’ రోహిత్ తారాజువ్వలా ఉవ్వెత్తున ఎగిస్తే... చిన్నపాటి చిచ్చుబుడ్లలా ధోని, జాదవ్‌ల ఆట పండుగ వెలుగులు తెచ్చింది. మొత్తం మీద భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను చీకటిలోకి పంపుతూ సగర్వంగా సిరీస్‌ను చేజిక్కించుకుంది.
పదమూడేళ్ల వన్డే కెరీర్... ఆడిన మ్యాచ్‌లు మాత్రం నాలుగు పదులు దాటలేదు... జట్టుతోనే ఉన్నా మ్యాచ్‌లో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు తీసేస్తారో తెలీదు. కానీ అమిత్ మిశ్రా మాత్రం తన ఆటపై పట్టును, పట్టుదలను కోల్పోలేదు. ఒక లెగ్‌స్పిన్నర్‌గా కుంబ్లే గర్వంగా చూస్తుండగా... భూచక్రాల్లా తిరుగుతూ అందకుండా వెళ్లిన గుగ్లీలతో కివీస్ పతనాన్ని శాసించి కోచ్‌కు కృతజ్ఞతలు ప్రకటించాడు. ‘ఈ సారి అంటించడం నా వంతు’ అన్న తరహాలో 19 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీసి అద్భుతం చేశాడు. వైజాగ్ గత రికార్డుతో పోలిస్తే అసాధ్యమేమీ కాకపోరుునా మరీ 79 పరుగులకే ఆట ముగించి కివీస్ పర్యటన ముగించింది.
టెస్టు సిరీస్‌లో ఏకపక్షంగా 3-0తో ఘన విజయం అనంతరం వన్డేల్లో తడబాటుతో సిరీస్‌తో 2-2తో సమంగా నిలిచిన స్థితి. ఈ సమయంలో ధోని తన ఆటతో, వ్యూహంతో కివీస్‌ను చిత్తుగా ఓడించి పరువు పోకుండా (పోగొట్టుకోకుండా) కాపాడుకున్నాడు. ఒత్తిడిలో బరిలోకి దిగి చివరకు గెలుపుతో అందరికీ ఆనందం పంచాడు. సొంతగడ్డపై విజయంతో మొదలైన కొత్త సీజన్‌లో తొలి అంకం ఇప్పుడు విజయంతో ముగిసింది. ఇక ధోనికి మరి కొద్ది రోజులు ప్రశాంతంగా విశ్రాంతి... వచ్చే నెల 9నుంచి ఇంగ్లండ్‌తో కోహ్లి కొత్త ఆట (టెస్టులు) మొదలు!
విశాఖపట్నం: సాగర తీరంలో భారత జట్టు అద్భుతం చేసింది. గత మ్యాచ్ వరకు తడబాటుగా సాగిన ఆటతో చివరి వన్డేకు ముందు సందేహాలు రేకెత్తించిన ధోని బృందం తమ అసలు సత్తాను ప్రదర్శించింది. కనీస పోటీకి కూడా అవకాశం లేకుండా న్యూజిలాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి సిరీస్‌ను 3-2తో సొంతం చేసుకుంది. శనివారం ఇక్కడి వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఐదో వన్డేలో భారత్ 190 పరుగుల భారీ తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (65 బంతుల్లో 70; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (76 బంతుల్లో 65; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా, ధోని (59 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 23.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. విలియమ్సన్ (27)దే టాప్ స్కోరు. 18 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన అమిత్ మిశ్రా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకోవడంతో పాటు మొత్తం 15 వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ఈ సిరీస్‌లో ధర్మశాల, మొహాలీ, వైజాగ్‌లలో జరిగిన మ్యాచ్‌లలో భారత్ గెలవగా, న్యూఢిల్లీ, రాంచీలలో కివీస్ విజయం అందుకుంది. ఈ పర్యటనలో కివీస్ టెస్టు, వన్డే సిరీస్‌లు రెండూ కోల్పోరుుంది.
రోహిత్ మెరిశాడు
సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో భారత జట్టు ధావల్ స్థానంలో బుమ్రాకు తిరిగి చోటు కల్పించగా, హార్దిక్ పాండ్యా స్థానంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం జయంత్ యాదవ్‌కు లభించింది. కివీస్ టీమ్‌లో డెవ్‌సిక్ స్థానంలో అండర్సన్ వచ్చాడు. సిరీస్‌లో గత వన్డేలతో పోలిస్తే విశాఖ పిచ్ చాలా నెమ్మదిగా కనిపించింది. దీంతో ఆరంభంలో భారత జట్టు జాగ్రత్తగా ఆడింది. ముఖ్యంగా రహానే (39 బంతుల్లో 20; 3 ఫోర్లు) కాస్త ఇబ్బంది పడ్డాడు. అరుుతే సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లలో విఫలమైన రోహిత్ అసలు పోరులో తన సత్తా ప్రదర్శించాడు. పవర్‌ప్లే చివరి ఓవర్లో రహానే అవుటైన తర్వాత భారత్ స్కోరు 45 పరుగులు. తొలి పది ఓవర్లలో 19 బంతులు మాత్రమే ఆడే అవకాశం వచ్చిన రోహిత్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. నీషమ్, సోధి ఓవర్లలో అతను కొట్టిన సిక్సర్లు హైలైట్‌గా నిలిచారుు. అరుుతే 17వ ఓవర్లో సింగిల్ తీసే ప్రయత్నంలో అతని కండరాలు పట్టేయడంతో ఫిజియో సహాయం తీసుకోవాల్సి వచ్చింది. చికిత్స తర్వాత సోధి ఓవర్లో ఫోర్‌తో 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్, అదే ఓవర్లో మరో భారీ సిక్సర్ బాదాడు. అరుుతే 66 పరుగుల వద్ద టేలర్ క్యాచ్ వదిలేసినా... దానిని ఉపయోగించుకోవడంలో విఫలమైన అతను తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. రోహిత్, కోహ్లి రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. అనంతరం కోహ్లి, ధోని కలిసి ఇన్నింగ్‌సను నడిపించారు.
తన తొలి 22 బంతుల్లో 8 పరుగులే చేసిన ధోని...సోధి ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టి ఊపు మీదకు రాగా, కోహ్లి కూడా మరో భారీ సిక్స్‌తో వేగం పెంచాడు. ఈ జోడి కుదురుకునే ప్రయత్నంలో తొలి 40 బంతుల్లో 20 పరుగులే జోడించినా... తర్వాతి 52 బంతుల్లో 51 పరుగులు జత చేసింది. 71 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం తర్వాత ధోని వెనుదిరగ్గా, పాండే (0) విఫలమయ్యాడు. 44వ ఓవర్లో 220 పరుగుల వద్ద కోహ్లి వెనుదిరిగినప్పుడు జట్టు పరిస్థితి ఇబ్బందకరంగా కనిపించింది. కానీ కేదార్ జాదవ్ (37 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (18 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) ఆరో వికెట్‌కు 39 బంతుల్లోనే 46 పరుగులు జత చేయడంతో జట్టు మెరుగైన స్కోరు చేసింది.
ఐదుగురు డకౌట్
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు స్వీయ విధ్వంసానికి పాల్పడింది. ఒక్క ఆటగాడు కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేక చేతులెత్తేశాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతో వికెట్ ఇచ్చేసి భారత్ విజయాన్ని మరింత సునాయాసం చేశారు. తొలి ఓవర్లోనే అద్భుత బంతితో గప్టిల్ (0)ను అవుట్ చేసి ఉమేశ్ భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత విలియమ్సన్ రెండో వికెట్‌కు లాథమ్ (17 బంతుల్లో 19; 3 ఫోర్లు)తో 28 పరుగులు, మూడో వికెట్‌కు టేలర్ (32 బంతుల్లో 19; 1 ఫోర్)తో కలిసి 35 పరుగులు జోడించడం మినహా కివీస్ ఏమీ చేయలేకపోరుుంది. ఒక దశలో 63/2తో మెరుగ్గా కనిపించిన ఆ జట్టు మరో 17 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 8 వికెట్లు కోల్పోరుుంది. ఇందులో 5 మిశ్రానే పడగొట్టడం విశేషం. అక్షర్‌కు 2 వికెట్లు దక్కగా, కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడిన జయంత్ కూడా ఒక వికెట్‌తో సంబరంలో పాలుపంచుకున్నాడు.
1 పూర్తిగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఆడిన అతి తక్కువ ఓవర్లు (23.1) ఇవే.
5 భారత గడ్డపై ఒక జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం ఇదే తొలిసారి.