చివర్లో చేతులెత్తేశారు... | Zimbabwe won the two-run defeat to India in the first T20 | Sakshi
Sakshi News home page

చివర్లో చేతులెత్తేశారు...

Published Sat, Jun 18 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

చివర్లో చేతులెత్తేశారు...

చివర్లో చేతులెత్తేశారు...

 తొలి టి20లో భారత్ ఓటమి రెండు పరుగులతో గెలిచిన జింబాబ్వే
 
భారత్ గెలవాలంటే 6 బంతుల్లో 8 పరుగులు కావాలి. క్రీజులో సూపర్ ఫినిషర్ ధోనితో పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు... మామూలుగా అయితే ఈ జోడీకిది పెద్ద స్కోరు కాదు... అందులోనూ బౌలింగ్ వేయడానికి వచ్చిన మద్జీవా కూడా ఓవర్‌కు 9కి పైగా పరుగులు ఇచ్చాడు. దీంతో ఇక భారత్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకుంటున్న తరుణంలో జింబాబ్వే అనూహ్యంగా షాకిచ్చింది. క్రీజులో ఉన్న ధోనికి సరైన అవకాశం ఇవ్వకుండా ఇతర బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి కేవలం ఐదు పరుగులతోనే సరిపెట్టింది. దీంతో ఈ టూర్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది.
 
 
హరారే:  వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఊపుమీదున్న భారత్‌ను జింబాబ్వే ఒకే ఒక్క మ్యాచ్‌తో కిందకు దించింది. అన్ని రంగాల్లో సమష్టిగా రాణిస్తూ టి20 సిరీస్‌లో శుభారంభం చేసింది. చిగుంబురా (26 బంతుల్లో 54 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్‌తో... శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 2 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసింది. మనీష్ పాండే (35 బంతుల్లో 48; 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. సిరీస్‌లో రెండో టి20 మ్యాచ్ సోమవారం జరుగుతుంది.


 సిక్సర్ల జాతర...
 అనుభవం లేని భారత కుర్ర పేసర్లపై ఓపెనర్ మసకద్జా మూడు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డా... ఐదో ఓవర్‌లో బుమ్రా దెబ్బకు వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో ముతుబామి (0) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన జింబాబ్వే.. ఏడో ఓవర్‌లో చిబాబా (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) వికెట్‌ను చేజార్చుకుంది. ఈ దశలో రజా (18 బంతుల్లో 20; 2 ఫోర్లు), వాలర్ (30) సింగిల్స్‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్‌రేట్ తగ్గకుండా చూశారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 34 బంతుల్లో 47 పరుగులు జత చేశారు. ఆఖర్లో చిగుంబురా భారత బౌలర్ల దుమ్ముదులిపాడు. ఏడు సిక్సర్లు బాది 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు సాధించాడు.  



 మనీష్ హవా...
 వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించిన లోకేశ్ రాహుల్ (0) తొలి బంతికే డకౌట్ అయినా... మన్‌దీప్ సింగ్, రాయుడు (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఒకర్నిమించి ఒకరు బౌండరీలు బాదారు. అయితే ఆరో ఓవర్‌లో రాయుడు అనూహ్యంగా అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో మనీష్ పాండే నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నా.. రెండో ఎండ్‌లో మన్‌దీప్ వికెట్ చేజార్చుకున్నాడు. ఇక కేదార్ జాదవ్ (19), మనీష్‌లు సింగిల్స్‌కు పరిమితమైనా.. చెరో సిక్సర్ బాది ఒత్తిడిని తగ్గించుకున్నారు. నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించాకా జాదవ్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 90/4. తర్వాత ధోని (19 నాటౌట్) అండతో మనీష్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. చకచకా ఐదో వికెట్‌కు 53 పరుగులు జత చేసి వెనుదిరిగాడు. దీంతో స్కోరు 143/5కి చేరుకుంది. ఇక 12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన దశలో అక్షర్ పటేల్ (18)... 19వ ఓవర్‌లో 13 పరుగులు రాబట్టినా... ఆఖరి ఓవర్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో భారత్ బోల్తా పడింది.

 
2 టి20ల్లో భారత్‌పై జింబాబ్వేకిది వరుసగా రెండో విజయం. గతేడాది జులై 19న హరారేలోనే జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 10 పరుగులతో నెగ్గింది.
 
1 టి20ల్లో ఒకే మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదుగురు ఆటగాళ్లు (రిషి ధావన్, మన్‌దీప్ సింగ్, ఉనాద్కట్, రాహుల్, చాహల్) అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి.
 

1 టి20 మ్యాచ్‌లో తొలి బంతికే భారత్ వికెట్ కోల్పోవడం ఇదే మొదటిసారి.
 
 
స్కోరు వివరాలు
జింబాబ్వే ఇన్నింగ్స్: చిబాబా (బి) ధావన్ 20; మసకద్జా (సి) ధోని (బి) బుమ్రా 25; ముతుబామి రిటైర్డ్ హర్ట్ 0; సికిందర్ రజా రనౌట్ 20; వాలర్ (బి) చాహల్ 30; ముటోంబోది (సి) ధావన్ (బి) పటేల్ 3; చిగుంబురా నాటౌట్ 54; క్రెమర్ (సి) ధావన్ (బి) బుమ్రా 4; మద్జీవా నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170.

వికెట్ల పతనం: 1-33; 2-50; 3-97; 4-98; 5-111; 6-130.

బౌలింగ్: ఉనాద్కట్ 4-0-43-0; రిషీ ధావన్ 4-0-42-1; బుమ్రా 4-1-24-2; అక్షర్ పటేల్ 4-0-18-1; చాహల్ 4-0-38-1.

భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) తిరిపానో 0; మన్‌దీప్ (సి) ముటోంబోడి (బి) చిబాబా 31; రాయుడు (బి) చిబాబా 19; మనీష్ పాండే (సి) తిరిపానో (బి) ముజురబాని 48; కేదార్ జాదవ్ (బి) ముజురబాని 19; ధోని నాటౌట్ 19; అక్షర్ పటేల్ (సి) సబ్ మసకద్జా (బి) మద్జీవా 18; రిషీ ధావన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168.

వికెట్ల పతనం: 1-0; 2-44; 3-53; 4-90; 5-143; 6-164.
బౌలింగ్: తిరిపానో 4-0-35-1; మద్జీవా 4-0-34-1; ముజురబాని 4-0-31-2; చిబాబా 2-0 -13-2; రజా 3-0-18-0; క్రెమెర్ 3-0-35-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement