వన్స్‌మోర్ | India and Bangladesh in the final match today | Sakshi
Sakshi News home page

వన్స్‌మోర్

Published Sun, Mar 6 2016 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

వన్స్‌మోర్

భారత్, బంగ్లా ఫైనల్ పోరు నేడు  ఆత్మవిశ్వాసంతో ధోనిసేన
►  సంచలనం కోసం బంగ్లా తహతహ ఆసియా కప్ టి20 టోర్నీ

సరిగ్గా పది రోజుల క్రితం బంగ్లాదేశ్‌పై ఘనంగా గెలిచి ఆసియా కప్‌ను మొదలుపెట్టిన భారత్... ఆ తర్వాత టోర్నీ మొత్తం తన సత్తా చూపెట్టింది. ప్రత్యర్థులందర్నీ చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు టైటిల్ పోరులో మళ్లీ బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. మరోసారి టోర్నీ తొలి మ్యాచ్ ఫలితాన్ని ధోనిసేన పునరావృతం చేస్తే ఆసియాకప్‌తో ఘనంగా స్వదేశానికి వచ్చి ప్రపంచకప్ సమరాన్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రారంభించొచ్చు.
 
  
 మిర్పూర్: బంగ్లాదేశ్ జట్టు ఏడాది కాలంగా సొంతగడ్డపై అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడుతోంది. ప్రస్తుత ఆసియాకప్ టి20 టోర్నీలోనూ ఒక్క భారత్ మినహా అన్ని జట్లపై గెలిచింది. ఇందులో పాకిస్తాన్, శ్రీలంకలాంటి బలమైన జట్లపై విజయాలు ఉన్నాయి. కాబట్టి ఆ జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. దీనికితోడు స్టేడియాన్ని హోరెత్తించే అభిమానుల మద్దతు కూడా వారికే ఉంటుంది. నేడు (ఆదివారం) జరిగే ఫైనల్‌లో ధోనిసేన ఏమాత్రం అలసత్వం చూపకుండా బంగ్లాను మరోసారి కొట్టేయాలి. ఫామ్ పరంగా భారత్ ఈ మ్యాచ్‌లో తిరుగులేని ఫేవరెట్. అయితే అనిశ్చితికి మారుపేరైన టి20 ఫార్మాట్‌లో భారత్‌నూ ఓడించి ఓ పెద్ద టైటిల్ గెలవాలని బంగ్లాదేశ్ తహతహలాడుతోంది.

 మళ్లీ పాత జట్టే
యూఏఈతో మ్యాచ్‌కు రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇచ్చిన ధోని... ఫైనల్‌కు మాత్రం మళ్లీ పాత జట్టునే బరిలోకి దించనున్నాడు. జట్టులో ప్రతి ఒక్కరూ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఓపెనర్లలో రోహిత్ ఇప్పటికే టోర్నీలో 137 పరుగులు చేసినా.. ధావన్ చెలరేగాల్సి ఉంది. కోహ్లి సూపర్ ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తుండగా, రైనా కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. శ్రీలంక, యూఏఈలపై మంచి ఇన్నింగ్స్ ఆడి ఒత్తిడి తగ్గించుకున్న యువరాజ్ ఈ మ్యాచ్‌లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడు.

ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తుండటం భారత్‌కు అదనపు బలం. జడేజా బ్యాట్ మెరవకపోయినా... బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టిపడేస్తున్నాడు. కీలక వికెట్లతో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు చూపెడుతున్నాడు. ఇక ప్రధాన స్పిన్నర్ అశ్విన్ తన బాధ్యత మరోసారి సమర్థంగా నిర్వర్తిస్తే టీమిండియాకు తిరుగుండదు. పేసర్లు నెహ్రా, జస్‌ప్రీత్ బూమ్రాలు అంచనాలకు అనుగుణంగా రాణిస్తుండటం అనుకూలాంశం. ఓవరాల్‌గా జట్టుపై కెప్టెన్ ధోని పూర్తి విశ్వాసం చూపెట్టడం శుభసూచకం.

 గాయాల బెడద
మరోవైపు బంగ్లాదేశ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ టోర్నీ నుంచి వైదొలగగా, ఆల్‌రౌండర్ షకీబ్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆడటంపై అనిశ్చితి నెలకొంది. అయితే పాక్‌తో ఆడిన తుది జట్టునే ఫైనల్‌కు కొనసాగించాలని మేనేజ్‌మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ స్లో వికెట్‌ను ఎంచుకుంటే మాత్రం స్పిన్నర్ అరాఫత్ సన్నీ చోటు నిలబెట్టుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ ఫామ్‌లో ఉన్నా కీలక సమయంలో తడబడటం ఆందోళనగా మారింది. తమీమ్ ఇక్బాల్ ఇంతవరకు బ్యాట్‌కు పని చెప్పలేదు.

సౌమ్య సర్కార్, షబ్బీర్ రెహమాన్‌లు పోరాడుతున్నా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోతున్నారు. ముష్ఫికర్, షకీబ్, మహ్మదుల్లా మరోసారి కీలకం కానున్నారు. బౌలింగ్‌లో స్ట్రయిక్ బౌలర్ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అమిన్ హుస్సేన్ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. తస్కిన్, మోర్తజా, షకీబ్‌లు గాడిలో పడాల్సి ఉంది. అంచనాలకు మించి రాణిస్తే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్‌ను కట్టడి చేయడం బంగ్లాకు అంత సులువుకాదు.

 జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా.
బంగ్లాదేశ్: మోర్తజా (కెప్టెన్), తమీమ్, సౌమ్య, షబ్బీర్, ముష్ఫికర్, షకీబ్, మహ్మదుల్లా, మిథున్, అల్ అమిన్, సన్నీ, తస్కిన్.
 
 
 పిచ్, వాతావరణం
టోర్నీ ఆరంభంతో పోలిస్తే పిచ్‌లు క్రమంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నాయి. అలాగే మంచు కూడా కీలక పాత్ర పోషిస్తున్నందున టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. వర్షం ముప్పేమీ లేదు.

బంగ్లాదేశ్‌తో ఫైనల్ కూడా ఓ మామూలు మ్యాచ్‌లాంటిదే. భారత జట్టులో ప్రతి ఒక్కరికీ అనుభవం ఉంది కాబట్టి ప్రతి జట్టును, ప్రతి మ్యాచ్‌ను ఒకేలా చూశాం.  అయితే తొలి మ్యాచ్‌లో బంగ్లాపై గెలవడం మాకు కలిసొచ్చింది. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో మేం చివరి 10 ఓవర్ల వరకూ ఒత్తిడిలోనే ఆడాం. ఇక తర్వాతి మ్యాచ్‌ల్లో మా ప్రదర్శన అద్భుతంగా ఉంది. మా బ్యాటింగ్, బౌలింగ్ బాగా పని చేశాయి. ఎలాంటి పిచ్‌లు ఇస్తారనేది మన చేతుల్లో లేదు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. - రవిశాస్త్రి (భారత్ టీమ్ డెరైక్టర్)
 
 
 1  భారత్, బంగ్లాదేశ్ జట్లు ఒక పెద్ద టోర్నీ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి
 
ఈ మ్యాచ్‌లో భారత్ జట్టే ఫేవరెట్. ఇందులో ఎలాంటి చర్చకు తావులేదు. అయితే ఇక్కడి అభిమానులు, పరిస్థితులు, పిచ్ మాకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో చివరి వరకు పోరాడేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటికీ మా జట్టులో టి20 స్టార్ లేడు. అయినా మేమంతా సమష్టిగా రాణించి విజయాలు సాధిస్తున్నాం.  - మోర్తజా (బంగ్లా కెప్టెన్)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement