లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి సెంచరీ చేయడం... భారత్ గెలవకపోవడమా! గతంలో 24 శతకాల్లో మూడు సార్లు మాత్రమే ఇలా జరిగింది. ఇది శుక్రవారం రాంచీలో మళ్లీ చోటు చేసుకుంది. తనకే సాధ్యమైన రీతిలో వరుసగా మరో శతకంతో భారత కెప్టెన్ మెరిసినా చివరకు విజయానందం మాత్రం దక్కలేదు. ముందుగా బ్యాటింగ్‌లో, ఆ తర్వాత బౌలింగ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా తొలి విజయంతో వన్డే సిరీస్‌లో నిలిచింది. ఖాజా తొలి సెంచరీ, ఫించ్ చక్కటి బ్యాటింగ్ ఆ జట్టు ఇన్నింగ్స్‌కు ఊపిరి పోస్తే... 314 పరుగుల లక్ష్యాన్ని చేరే ప్రయత్నంలో కోహ్లి మినహా మరే బ్యాట్స్‌మన్ కూడా కనీసం 40 పరుగులు చేయలేకపోవడం టీమిండియా ఓటమికి కారణమైంది. సొంత అభిమానుల మధ్య చివరి మ్యాచ్‌లో వారి జయజయధ్వానాల మధ్య బరిలోకి దిగిన ధోని ఆటగాడిగా మాత్రం అద్భుతం చేయలేకపోయాడు.
రాంచీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సొంతం చేసుకునే లక్ష్యంతో మూడో వన్డే బరిలోకి దిగిన భారత్‌కు నిరాశే ఎదురైంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 32 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉస్మాన్ ఖాజా (113 బంతుల్లో 104; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (99 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 193 పరుగులు జోడించడం విశేషం. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తనవంతు పాత్ర పోషించగా, కుల్దీప్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి (95 బంతుల్లో 123; 16 ఫోర్లు, 1 సిక్స్) వన్డేల్లో 41వ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్, కమిన్స్, జంపా తలా 3 వికెట్లు తీశారు.
భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం...
భారత బౌలర్ల అరుదైన వైఫల్యంతో ఈ పర్యటనలో ఎట్టకేలకు ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం అందించగలిగారు. ఫించ్ ఫామ్‌లోకి రాగా, ఖాజా మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఫించ్ రెండు ఫోర్లు కొట్టగా... అదే ఓవర్లో ఫించ్ ఎల్బీడబ్ల్యూ కోసం డీఆర్‌ఎస్‌ను ఆశ్రయించిన భారత్ తమ రివ్యూను కూడా కోల్పోయింది. జడేజా తొలి ఓవర్లో ఖాజా స్కోరు 17 వద్ద ధావన్ క్యాచ్ వదిలేయడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది. పవర్‌ప్లే ముగిసేసరికి ఆసీస్ స్కోరు 52 పరుగులకు చేరింది. ‘ట్రంప్‌కార్డ్’ జాదవ్ ఓవర్లో ఫించ్ పండగ చేసుకున్నాడు. వరుస బంతుల్లో 6, 4, 6 బాదిన అతను 51 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటికే ఖాజా హాఫ్ సెంచరీ (56 బంతుల్లో) కూడా పూర్తయింది. మరికొన్ని చక్కటి షాట్ల తర్వాత సెంచరీకి చేరువవుతున్న తరుణంలో వివాదాస్పద నిర్ణయంతో ఫించ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ తనదైన శైలిలో చెలరేగి స్కోరు జోరును కొనసాగించాడు. జడేజా ఓవర్లో అతను వరుసగా 6, 4, 4 బాదాడు. అదే ఓవర్లో ఫైన్‌లెగ్ దిశగా సింగిల్ తీసి ఖాజా తన కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. అయితే వెంటనే షమీ బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు. 40 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 244 పరుగులు. ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి. ఈ స్థితినుంచి భారత బౌలింగ్ ఒక్కసారిగా కట్టుదిట్టంగా మారిపోయింది. జడేజా చక్కటి ఫీల్డింగ్‌కు ధోని చురుకుదనం తోడై మ్యాక్స్‌వెల్ రనౌట్ కాగా...కుల్దీప్ ఒకే ఓవర్లో షాన్ మార్‡్ష (7), హ్యాండ్స్‌కోంబ్ (0)లను ఔట్ చేశాడు. స్టొయినిస్ (26 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు), అలెక్స్ క్యారీ (17 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) ఆరో వికెట్‌కు అభేద్యంగా 50 పరుగులు జోడించినా... చివరి పది ఓవర్లలో ఆసీస్ 69 పరుగులే చేయగలిగింది.
కొనసాగిన కోహ్లి జోరు...
ఛేదనలో భారత బ్యాటింగ్ కూడా తడబడింది. 27 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. తన తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌గా వేసిన రిచర్డ్సన్... ధావన్ (1) వికెట్ కూడా తీశాడు. ఆ తర్వాత కమిన్స్ వరుసగా రెండు ఓవర్లలో రోహిత్ (14), అంబటి రాయుడు (2)లను ఔట్ చేశాడు. ఈ దశలో కోహ్లి, ధోని (42 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకున్నారు. సొంత ప్రేక్షకుల సమక్షంలో ధోని కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. రిచర్డ్సన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అనంతరం లయన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా ధోని కొట్టిన భారీ సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. అయితే జంపా వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని మాజీ కెప్టెన్ నిష్క్రమించడంతో రాంచీ మైదానం ఒక్కసారిగా మూగబోయింది. మరోవైపు కోహ్లి మాత్రం తన స్థాయికి తగిన ఆటతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఆసీస్ జట్టులో బలహీన బౌలర్ అయిన స్టొయినిస్ వేసిన వరుస రెండు ఓవర్లలో కలిపి అతను 5 ఫోర్లు బాదడం విశేషం. కోహ్లికి సహకరించిన జాదవ్ (39 బంతుల్లో 26; 3 ఫోర్లు)ను జంపా ఔట్ చేయడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో 98 పరుగుల వద్ద కీపర్ క్యారీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి అదే ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ దిశగా రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జంపా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం మరో షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్ కావడంతో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో విజయ్ శంకర్ (30 బంతుల్లో 32; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (31 బంతుల్లో 24; 1 సిక్స్) కొంత పోరాడినా లాభం లేకపోయింది.
‘ఆర్మీ’ క్యాప్‌లతో బరిలోకి...
పుల్వామా ఘటనలో మృతి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు భారత క్రికెటర్లు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. మూడో వన్డేలో జట్టు సభ్యులంతా ఆర్మీ అధికారులు ధరించే ‘క్యామోఫ్లాగ్’ క్యాప్‌లు ధరించి బరిలోకి దిగారు. బీసీసీఐ లోగోతో ఉన్న ఈ క్యాప్‌ను నైకీ ప్రత్యేకంగా రూపొందించింది. రాంచీ వన్డే ద్వారా తమకు లభించే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (సుమారు కోటి రూపాయలు) కూడా ‘జాతీయ రక్షణ నిధి’కి అందిస్తున్నట్లు కెప్టెన్ కోహ్లి ప్రకటించాడు. ‘ప్రత్యేక క్యాప్’ను ధరించే విషయంలో నిబంధనల గురించి ఐసీసీకి బీసీసీఐ ముందుగానే సమాచారం అందించి అనుమతి పొందింది. వాస్తవానికి మహేంద్ర సింగ్ ధోనిదే ఈ ఆలోచన. భారత సైన్యంలో గౌరవ హోదాలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న అతనే స్వయంగా జట్టు సహచరులకు క్యాప్‌లు అందించాడు. కామెంటరీ బృందంలో ఉన్న గావస్కర్, మంజ్రేకర్ తదితర భారత మాజీలు కూడా ఇవే క్యాప్‌లను ధరించారు.
టాస్‌కు డయానా ఎడుల్జీ...
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ క్రికెటర్, ప్రస్తుత సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీని బీసీసీఐ టాస్ వేసే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించింది. టాస్ వేసేందుకు కోహ్లికి ఎడుల్జీ నాణెం అందించింది. 63 ఏళ్ల ఎడుల్జీ భారత్ తరఫున 20 టెస్టులు, 34 వన్డేలు ఆడింది.
రాత్రి 7.30 సమయంలో మంచు ప్రభావం చూపిస్తుందని మాకు ఎవరో చెప్పారు. అందుకే ముందు బౌలింగ్ ఎంచుకున్నా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆరంభంలోనే ఇలా మేం వికెట్లు కోల్పోలేదు. మూడేసి వికెట్లు తక్కువ వ్యవధిలో పడిపోవడం సిరీస్‌లో రెండు సార్లు జరిగింది. ఇకపై ఇలా కుప్పకూలిపోవడాన్ని చూడదల్చుకోలేదు. తర్వాతి మ్యాచ్‌లకు మార్పులు ఖాయం. నేను ఆడిన చక్కటి ఇన్నింగ్స్‌లలో ఇది కూడా ఒకటి.
– కోహ్లి
చివరి 2 వన్డేలకు ధోని దూరం
ఆస్ట్రేలియాతో జరిగే తర్వాతి రెండు వన్డేలలో ఎమ్మెస్ ధోని బరిలోకి దిగడం లేదు. ఈ మ్యాచ్‌ల నుంచి అతను విశ్రాంతి కోరాడని భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ నిర్ధారించాడు. వరల్డ్ కప్ తర్వాత రిటైరయ్యే అవకాశం ఉండటంతో... తన స్వస్థలం రాంచీలో మూడో వన్డే ఆడిన ధోనికి బహుశా స్వదేశంలో ఇదే చివరి మ్యాచ్ కావచ్చు. ధోని గైర్హాజరులో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను ఆడించే అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్‌లలో కచ్చితంగా మార్పులు ఉంటాయని కెప్టెన్ కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment