
అశ్విన్ ఫిట్‌గా ఉన్నా కూడా నలుగురు పేసర్లతోనే బరిలోకి దిగేవాళ్లం. రవీంద్ర జడేజా గురించి అసలు ఆలోచనే రాలేదు. పిచ్‌ను చూసిన తర్వాత ఇది స్పిన్‌కంటే పేస్‌కే ఎక్కువగా అనుకూలిస్తుందని మేం నమ్మాం. మొదటి మూడు రోజులు సరిగ్గా అదే జరిగింది. సరిగ్గా చూస్తే గరుకు ప్రాంతం వల్ల పెద్దగా సహకారం లేదు. లయన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. బంతి వేగాన్నే ఎక్కువగా ఉపయోగించుకొని అతను వికెట్లు పడగొట్టాడు. ఇటీవల భువనేశ్వర్ ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు. అటు ఉమేశ్ తన ఆఖరి టెస్టులో 10 వికెట్లు పడగొట్టి జోరు మీదున్నాడు. అందుకే అతడిని ఎంపిక చేశాం. నలుగురు పేసర్లు ఉంటే బ్యాటింగ్ బలహీనంగా మారుతుందని తెలుసు.
కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకొని అది ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా దానికి కట్టుబడాల్సిందే. మ్యాచ్ ముందుకు సాగుతున్నకొద్దీ పరిస్థితులు మారిపోతుంటాయి కాబట్టి మనకు ఏం కావాలో మొదటి రోజే తేల్చుకోవాలి. అసభ్యంగా దూషించనంత వరకు, వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడనంత వరకు గీత దాటనట్లే. మైదానంలో పోటీతత్వం ఎలాగూ ఉంటుంది కాబట్టి ఈ విషయంపై చర్చ అనవసరం. తొలి ఇన్నింగ్స్‌లో నేను ఔటైన తీరును వివాదం చేయదల్చుకోలేదు. మైదానంలో ఒక నిర్ణయం తీసుకున్నాక దాని పని అయిపోయింది.
– విరాట్ కోహ్లి, భారత కెప్టెన్