
బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ నిర్ణయంపై (విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై అంక్షలు) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పర్యటనల్లో కుటుంబాలు దగ్గరగా లేకపోతే ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని అన్నాడు. దీని ప్రభావం జట్టు జయాపజయాలపై పడుతుందని తెలిపాడు. కఠిన సమయాల్లో కుటుంబాలు వెంట ఉంటే ఆటగాళ్లకు ఊరట కలుగుతుందని పేర్కొన్నాడు. పర్యటనల్లో ఆటగాళ్లకు కుటంబాలు తోడుండటం ఎంతో ముఖ్యమో కొంతమందికి తెలియట్లేదని బీసీసీఐపై పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
మ్యాచ్‌లు ముగిశాక ఆటగాళ్లు ఒంటరిగా కూర్చొని బాధపడాలా అని ప్రశ్నించాడు. కుటుంబాలు దగ్గరగా ఉంటే ఆటగాళ్ల ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని తెలిపాడు. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో కోహ్లి ఈ విషయాలను పంచుకున్నాడు.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 పరాజయం తర్వాత బీసీసీఐ విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు ఓ రూల్‌ను జారీ చేసింది. కుటుంబ నియంత్రణ రూల్ ప్రకారం.. 45 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉండే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి లేదు. 45 రోజుల కంటే ఎక్కువ నిడివితో సాగే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలను రెండు వారాల తర్వాత అనుమతిస్తారు. మొత్తంగా కుటుంబాలు ఆటగాళ్లతో కేవలం 14 రోజులు మాత్రమే గడిపే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విరాట్ అద్భుతంగా ఆడి భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కొద్ది రోజులు దుబాయ్‌లోనే సేద తీరిన విరాట్.. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం తన జట్టుతో చేరాడు. ఐపీఎల్‌లో విరాట్ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ.. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌తో తమ జర్నీ ప్రారంభిస్తుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమ్మదే అంటూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.
ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment