ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె... | Team India fans jubilant after historic Test series win | Sakshi
Sakshi News home page

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె...

Published Tue, Jan 8 2019 12:38 AM | Last Updated on Tue, Jan 8 2019 6:36 AM

 Team India fans jubilant after historic Test series win - Sakshi

ఆస్ట్రేలియా గడ్డపై మ్యాచ్‌లు అంటే మన దగ్గర శీతాకాలంలో సూర్యోదయానికి ముందే లేచి చలిలో వణుకుతూ కూడా ఆటను చూడటం నాటి లాలా అమర్‌నాథ్‌ తరం నుంచి నేటి ధోని తరం భారత అభిమానుల వరకు అందరికీ అనుభవమే. క్రికెట్‌ను ఆస్వాదించడంలో ఎక్కడా తగ్గకపోయినా తుది ఫలితానికి వచ్చేసరికి మాత్రం చివరకు మనకు నిరాశే. ఈసారి గెలుస్తారేమో... తప్పక గెలుస్తారు... గెలవడం తప్ప మరో మాటకు తావు లేదు... ఇప్పుడైనా గెలుస్తారేమో... ప్రతీ సిరీస్‌కు ముందు ఆశలు పెట్టుకోని అభిమాని లేడు. మధ్యలో కొన్ని సార్లు గెలుపునకు అతి చేరువగా వచ్చి కూడా అనూహ్యంగా ఆ ఆనందాన్ని దూరం చేసిన క్షణాలు కూడా బోలెడు. అయితే ఇక గెలవగలరా అనే మాట తలపున కూడా రానీయకుండా... భారత జట్టు సిరీస్‌ విజయం కోసం తపించిన ప్రతీ అభిమాని గర్వపడే రోజు వచ్చింది. ఇంతకంటే మంచి అవకాశం లేదంటూ కంగారూ గడ్డపై అడుగు పెట్టిన కోహ్లి సేన దానిని చేసి చూపించింది. ఆసీస్‌ గడ్డపై తొలిసారి సిరీస్‌ జయకేతనాన్ని ఎగరవేసింది. 

గావస్కర్, కపిల్‌ దేవ్‌లాంటి దిగ్గజాలు ప్రయత్నించారు. బిషన్‌ సింగ్‌ బేది బృందం త్రుటిలో అవకాశం చేజార్చుకుంది. అజహరుద్దీన్‌కు విజయం అందనంత దూరంలో నిలిస్తే కుంబ్లేకు కూడా అది సాధ్యం కాలేదు. మధ్యలో గంగూలీ విజయసౌరభం విరబూయించినా ఆఖరి మెట్టుపై అదృష్ట దేవత దూరంగా వెళ్లిపోయింది. కంగారూ గడ్డపై కెప్టెన్‌గా ధోనికి మిగిలింది అవమానభారమే. సర్వాంతర్యామి సచిన్‌ టెండూల్కర్‌... ఆసీస్‌ ఆటగాళ్ల గుండెల్లో నిద్రబోయిన వీవీఎస్‌ లక్ష్మణుడు... విధ్వంసానికి మారుపేరైన వీరేంద్రుడు... ‘వాల్‌’ రాహుల్‌లాంటి వాళ్ల జమానాలో కూడా సిరీస్‌ గెలుపు కలగానే మిగిలి పోయింది. కానీ విరాట్‌ బృందం విశ్వరూపం చూపించింది. ఒక సెషన్‌లోనో, ఒక రోజులోనో పట్టు బిగించి తర్వాత దానిని సడలించే పాత కాలపు అలవాటును ఛేదించింది. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రత్యర్థిని వారి సొంతగడ్డపై ఒక ఆటాడుకుంది. మధ్యలో ఓటమి ఎదురైనా కుంగిపోలేదు. అంతే వేగంతో మళ్లీ పైకి లేచి కొత్త చరిత్రను సృష్టించింది. ఎన్నాళ్లుగానో వేచిన ‘ఉదయాన్ని’ అభిమానులకు చూపించి సంబరాల్లో ముంచింది.   

సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారత జట్టు చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయం పూర్తయింది. వర్షం కారణంగా చివరిదైన నాలుగో టెస్టు ఆఖరి రోజు ఒక్క బంతి కూడా పడలేదు. ఆసీస్‌ ఓవర్‌నైట్‌ స్కోరు 6/0 వద్దనే ఆట ఆగిపోయింది. దాంతో సిడ్నీ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2–1తో సొంతం చేసుకుంది. అడిలైడ్, మెల్‌బోర్న్‌ టెస్టులలో భారత్‌ గెలవగా... పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ విజయం సాధించింది. ఫలితంగా ఆసీస్‌ గడ్డపై భారత్‌ తొలిసారి సిరీస్‌ గెలిచినట్లయింది. ఎప్పుడో 1947–48 సిరీస్‌తో మొదలు పెట్టి 2014–15 వరకు 11 సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా 8 సార్లు ఓడిపోగా... 3 సార్లు సమంగా నిలిచింది. ఎట్టకేలకు 72 ఏళ్ల తర్వాత 12వ ప్రయత్నంలో విజయం భారత్‌ సొంతమైంది.  

సోమవారం ఆస్ట్రేలియా సమయం ప్రకారం ఉదయం 10 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సింది. అయితే వర్షం వెంటాడటంతో ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి వెళ్లాల్సిన అవసరమే రాలేదు. పదే పదే అంపైర్లు తనిఖీలు, చర్చల అనంతరం చివరకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఆటను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాంతో భారత్‌ సిరీస్‌ విజయం ఖాయమైంది. చతేశ్వర్‌ పుజారా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడంతో పాటు మొత్తంగా సిరీస్‌లో మూడు సెంచరీలు సహా 74.42 సగటుతో 521 చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’అవార్డు కూడా గెలుచుకున్నాడు.  
సంక్షిప్త స్కోర్లు: భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 622/7 డిక్లేర్డ్‌; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 300; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 6/0. 

ప్రశంసలు వెల్లువెత్తాయిలా...
►కంగారూ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ తదితరులు కోహ్లిసేనను ట్విట్టర్‌లో అభినందనలతో ముంచెత్తారు. 

► ఆసీస్‌లో టెస్టు సిరీస్‌ గెలవాలన్న భారత క్రికెట్‌ అంతిమ లక్ష్యాన్ని కోహ్లి అండ్‌ కో పూర్తిచేసింది. ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో సాధించిన ఈ విజయం మమ్మల్ని గర్వపడేలా చేసింది. ఇకపై దీన్నే అలవాటుగా చేసుకోవాలి  
– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 

►ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించిన టీమిండియాకు శుభాభినందనలు. ఈ సిరీస్‌లో సమష్టిగా అద్భుత ప్రదర్శనతో రాణించిన భారత్‌కే విజయార్హత ఉంది.          
 – ప్రధాని నరేంద్ర మోదీ 

► ఆసీస్‌లో టెస్టు సిరీస్‌ గెలిచిన తొలి ఆసియా జట్టుగా ఘనచరిత్ర సృష్టించిన టీమిండియాకు అభినందనలు. విరాట్‌ సారథ్యం, పుజారా బ్యాటింగ్‌ అద్భుతం. కొత్తేడాదిలో జాతికి గొప్ప కానుక ఇచ్చారు. వన్డేల్లోనూ ఇదే జోరు కొనసాగాలి. 
–బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా 

► ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ గెలిచిన టీమిండియాకు అభినందనలు. మనందరికీ ఇది గర్వపడే క్షణం.          
 – వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి,   వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు 

► భారత జట్టుకు అభినందనలు. చతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిస్తే బౌలింగ్‌లో బుమ్రా అద్భుతం.           –హర్భజన్‌ సింగ్‌  
భారత క్రికెట్‌లో గొప్ప రోజు. ఆటగాళ్ల పట్టుదల అపూర్వం. కుర్రాళ్ల ప్రదర్శన గర్వకారణం. వారితో కలిసి సీనియర్లు బాధ్యత పంచుకోవడంతో ప్రత్యేక విజయం సాధ్యమైంది. రిషభ్, కుల్దీప్‌లకు మంచి భవిష్యత్తు ఉంది.     
– సచిన్‌ టెండూల్కర్‌ 

​​​​​​​► చారిత్రక విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఇది సమష్టి ప్రదర్శన. కుర్రాళ్లు సాధించిన ఘనతను చూస్తే చాలా సంతృప్తికరంగా ఉంది.           
– వీవీఎస్‌ లక్ష్మణ్‌ 
  
​​​​​​​►ఆస్ట్రేలియాలో తొలిసారి సిరీస్‌ గెలిచిన కోహ్లి, అతని సహచరులకు నా అభినందనలు. అన్ని రంగాల్లో ఆసీస్‌పై ఆ జట్టు ఆధిపత్యం కనబర్చింది.                          
– మెక్‌గ్రాత్‌ 

​​​​​​​►ఈ విజయాన్ని ఆస్వాదించండి. స్మిత్, వార్నర్‌ లేకపోవడం గురించి కోడిగుడ్డుకు ఈకలు పీకే చర్చ మాత్రం చేయకండి.            
 – గౌతం గంభీర్‌   

​​​​​​​► నా దృష్టిలో 1983 ప్రపంచకప్, 1985 వరల్డ్‌ సిరీస్‌ విజయాలకంటే ఇదే పెద్ద గెలుపు. ఎందుకంటే టెస్టు ఫార్మాట్‌ అన్నింటికంటే ఉత్తమమని, కఠినమైనదని నేను నమ్ముతా. నాపై వచ్చిన విమర్శలు పేలని తూటాల్లాంటివి (గావస్కర్‌ను ఉద్దేశించి). అవి భారత్‌ నుంచి ఇçక్కడికి చేరేలోపే గాల్లో కలిసిపోతాయి. ఈ విజయం కోసం జట్టు ఎంతగా కష్టపడిందో నాకు బాగా తెలుసు. మేం మాత్రం ఆసీస్‌పై సరిగ్గా గురి చూసి గన్‌ పేల్చాం. గతంలో ఇక్కడ ఆడిన కెప్టెన్లు, భవిష్యత్తు గురించి నేను మాట్లాడను. ఈ రోజు గురించే ఆలోచిస్తా. 72 ఏళ్ల తర్వాత గెలిచాం. గెలిపించిన కెప్టెన్‌ కోహ్లికి నా సెల్యూట్‌. ఎందుకంటే అంత కసితో టెస్టులు ఎవరూ ఆడరు. ఈ జట్టులో సీనియర్లు, జూనియర్లు లేదా దేవుడు, దైవాంశ సంభూతులు ఎవరూ లేరు. అంతా భారత జట్టు సభ్యులే. పట్టుదల, అంకితభావం కనబర్చిన ఆటగాళ్లకు హ్యాట్సాఫ్‌.  – రవిశాస్త్రి, భారత కోచ్‌ 

​​​​​​​► విదేశాల్లో సిరీస్‌ గెలవాలని మేం చాలా కాలంగా శ్రమిస్తున్నాం. అదీ ఆస్ట్రేలియాలో అంటే అంత సులువు కాదు. ఇందులో నా భాగస్వామ్యం ఉండటం గర్వంగా ఉంది. తొలి టెస్టులో సాధించిన సెంచరీ నాకు అన్నింటికంటే ప్రత్యేకం. కఠోర సాధన, సన్నద్ధత వల్లే ఇది సాధ్యమైంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలని నేనూ కోరుకుంటున్నా. కానీ ఎప్పటికీ నా తొలి ప్రాధాన్యత మాత్రం టెస్టులకే.                       
– పుజారా 

భారత బౌలింగ్‌ దళం అద్భుతంగా ఉంది. వారు సిరీస్‌ ఆసాంతం మాపై ఒత్తిడి కొనసాగించారు. తొలి టెస్టులో మాకు అంది వచ్చిన పలు అవకాశాలను చేజార్చుకోవడమే ఫలితాన్ని శాసించింది. అక్కడ పట్టు కొనసాగించి ఉంటే 2–1తో మేమే గెలిచేవాళ్లమేమో. సొంతగడ్డపై మేం భారత్‌ను ఓడించగలమని సిరీస్‌కు ముందు నమ్మాం. కానీ భారత ఆటగాళ్లు కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నారు. భారత్‌నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మా టాప్‌–7 మొత్తం విఫలమైంది.        
– టిమ్‌ పైన్, ఆసీస్‌ కెప్టెన్‌    

అది మా తప్పు కాదు!
ఆస్ట్రేలియా జట్టులో స్మిత్, వార్నర్‌ లేకపోవడం భారత్‌ తప్పు కాదు. వారిపై తక్కువ సమయం పాటు నిషేధం విధించాల్సింది. తమకు ఎదురైన ప్రత్యర్థితో తలపడటమే ఆటగాళ్ల పని. టీమిండియా సాధించిన విజయం గొప్ప ఘనతగా చెప్పవచ్చు. గతంలో కూడా ఆసీస్‌ గడ్డపై భారత జట్లు విజయం కోసమే ఆడాయి. అయితే కోహ్లి మార్గనిర్దేశనంలో ఫిట్‌నెస్‌పరంగా ఈ జట్టు ఉత్తమంగా నిలిచింది.   
 – సునీల్‌ గావస్కర్‌ 

మేరీ దేశ్‌ కీ ధర్తీ... 
విజయానంతరం భారత ఆటగాళ్ల జోష్‌కు అంతు లేకుండా పోయింది. ముఖ్యంగా సిరీస్‌ హీరో పుజారాతో డ్యాన్స్‌ చేయించేందుకు పంత్‌ తదితరులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తన వల్ల కాదన్నట్లుగా రెండు సార్లు గట్టిగా చేతులు మాత్రమే కదిలించి అతను ఊరుకున్నాడు. ‘దీనిని పుజారా డ్యాన్స్‌ అనాలేమో. అతను మామూలుగా నడిచినప్పుడు కూడా చేతులు పెద్దగా కదల్చడు. చిన్న స్టెప్‌ కూడా వేయలేకపోవడం చూస్తే పుజారా ఎలాంటి సింపుల్‌ మనిషో మనకు అర్థమవుతుంది’ అని కోహ్లి సరదాగా అన్నాడు. హోటల్లోనూ అభిమా నులు క్రికెటర్లను ఆటపాటలతో ఆహ్వానించారు. ‘పుకార్‌’ సినిమాలోని దేశభక్తి పాట ‘మేరీ దేశ్‌ కీ ధర్తీ సోనా ఉగ్‌లే...’కు అభిమానులతో కలిసి కోహ్లి డ్యాన్స్‌ చేశాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement