
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పుట్టినరోజు(నవంబరు 5) సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రికెట్ కింగ్ విజయాలను కీర్తిస్తూ.. అతడి బ్యాటింగ్ నైపుణ్యాలను కొనియాడుతూ విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఈ జాబితాలో ఇటాలియన్ ఫుట్‌బాలర్ అగతా ఇసబెల్ల సెంటాసో(Agata Isabella Centasso) కూడా చేరిపోయింది.
అయితే, కోహ్లికి బర్త్‌డే విషెస్ తెలిపినందుకు ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కోహ్లి అభిమానులుగా చెప్పుకొనే కొంతమంది సోషల్ మీడియా యూజర్లు అగతాను కించపరిచే విధంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తమ ఆరాధ్య ఆటగాడిని విస్ చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇటలీ అభిమాని నుంచి విరాట్ కోహ్లికి హ్యాపీ బర్త్‌డే
అసలేం జరిగిందంటే.. కోహ్లి పుట్టినరోజును పురస్కరించుకుని.. ‘‘ఇటలీ అభిమాని నుంచి విరాట్ కోహ్లికి హ్యాపీ బర్త్‌డే. ఆల్ ది బెస్ట్’’ అంటూ ట్వీట్ చేసిన అగతా.. టీమిండియా జెర్సీ ధరించిన ఫొటో షేర్ చేసింది. ఇందుకు బదులుగా.. ఓ నెటిజన్.. ‘‘అసలు నీకు క్రికెట్ గురించి, కోహ్లి గురించి ఏమీ తెలియదు!
అంత చీప్‌గా కనిపిస్తున్నానా?
అయినా సరే.. కోట్ల సంఖ్యలో ఉన్న భారతీయుల్లో పాపులర్ అవడానికి ఈ ట్వీట్ చేశావు! వెల్ డన్!’ అంటూ విద్వేషం ప్రదర్శించాడు. అగతా ఇందుకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘‘నా మీద అంత దురభిప్రాయం ఉంటే.. ఇంకా నన్నెందుకు ఫాలో అవుతున్నావు? నీ నెగటివిటీని ఇక్కడ కాకుండా మరెక్కడైనా ప్రదర్శించు’’ అని సమాధానమిచ్చింది.
ఎందుకిలా చేస్తున్నారు?
అంతేగాకుండా.. ‘‘నేను విరాట్ కోహ్లి లేదంటే క్రికెట్ గురించి పోస్ట్ పెట్టిన ప్రతిసారీ ఎవరో ఒకరు ఇలా నెగటివ్‌గా స్పందిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నమస్తే’’ అంటూ అగతా తన ఆవేదనను వ్యక్తం చేసింది.
గడ్డు పరిస్థితులు
కాగా విరాట్ కోహ్లి ప్రస్తుతం ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి నిరాశపరిచాడు. బంగ్లాపై 6, 17, 47, 29(నాటౌట్) పరుగులు స్కోరు చేశాడు.
అదే విధంగా.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. 0, 70, 1, 17, 4, 1 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో రాణిస్తేనే అతడిని జట్టులో కొనసాగించాలని టీమిండియా మాజీలు సైతం డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: Akaay: కోహ్లి బర్త్‌డే.. తొలిసారి కుమారుడి ఫొటో షేర్ చేసిన అనుష్క
@imVkohli, happy birthday from a fan in Italy. All the best to you 🇮🇳🏏 pic.twitter.com/wIk1UXO3eR
— Agata Isabella Centasso (@AgataCentasso) November 5, 2024