IND vs NZ 2nd T20: Different Version of SuryaKumar Yadav - Sakshi
Sakshi News home page

IND VS NZ 2nd T20: ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌.. పని మొదలుపెట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌

Published Mon, Jan 30 2023 2:56 PM | Last Updated on Mon, Jan 30 2023 3:13 PM

IND VS NZ 2nd T20: Different Version Of Surya Kumar Yadav - Sakshi

Surya Kumar Yadav: న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 29) జరిగిన రెండో టీ20లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన సహజ శైలికి భిన్నంగా ఆచితూచి ఆడి, జట్టుకు ఎంతో అవసరమైన విజయంలో ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. స్కై ఇలా నిదానంగా ఇన్నింగ్స్‌ను కొనసాగించడం, ఏ ఫార్మాట్‌లోనైనా బహుశా ఇదే మొదటిసారి అయ్యుండవచ్చు. బంతి నాట్యం చేస్తున్న పిచ్‌పై సూర్యకుమార్‌ ఎంతో సంయమనం పాటించి, కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతుచిక్కని పిచ్‌పై వికెట్‌ కాపాడుకుంటూ, ఇటుకలు పేర్చిన చందంగా ఒక్కో పరుగు రాబట్టి సూర్య ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్‌ అనంతరం తన మ్యాచ్‌ విన్నింగ్స్‌ ఇన్నింగ్స్‌పై సూర్య మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజు నేను బ్యాటింగ్‌ చేసిన తీరు.. తనలోని మరో వెర్షన్‌ అంటూ ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు ముందు తన సన్నద్దతను పరోక్షంగా చాటాడు.

ఇదే సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌ చేయడం చాలా ముఖ్యం. అప్పటికే నా తప్పిదం కారణంగా వాషింగ్టన్‌ సుందర్‌ వికెట్‌ను కోల్పోయాం. ఛాలెంజింగ్‌ వికెట్‌పై జట్టును విజయతీరాలకు చేర్చాలని నేను, హార్ధిక్‌ ప్రణాళిక వేసుకున్నాం. అందుకే నేను చాలా సంయమనంతో బ్యాటింగ్‌ చేశా. ఇది నాలోని డిఫరెంట్‌ వెర్షన్‌ అంటూ సూర్యకుమార్‌ వ్యాఖ్యానించాడు.

ఈ వ్యాఖ్యలు విన్న తరువాత అభిమానులు సోషల్‌మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. గురువు గారూ.. అప్పుడే టెస్ట్‌ క్రికెట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాడంటూ ఆసీస్‌తో సిరీస్‌ను ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఆసీస్‌తో త్వరలో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌ కోసం ప్రకటించిన టీమిండియాలో సూర్యకుమార్‌ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రమే ప్రాతినిధ్యం వహించిన సూర్య భాయ్‌.. ఆసీస్‌తో సిరీస్‌లో టెస్ట్‌ అరంగేట్రం చేయడం దాదపుగా ఖరారైంది.       

ఇదిలా ఉంటే, నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆపసోపాలు పడి 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేయగా.. భారత్‌ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఒక్క సిక్సర్‌ కూడా నమోదు కాని మ్యాచ్‌లో సూర్యకుమార్‌ 31 బంతులు ఆడి ఒక్క బౌండరీ సాయంతో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా (20 బంతుల్లో 15 నాటౌట్‌; ఫోర్‌) సూర్యకు సహకరించాడు. 
 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement