బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో టీమిండియా క్రికెటర్లకు మంచి బ్రేక్ లభించినట్లయింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1న ఇండోర్ వేదికగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 25లోగా టీమిండియా ఆటగాళ్లు ఇండోర్‌కు వచ్చి రిపోర్ట్ చేయాలని బీసీసీఐ తెలిపింది.
దీంతో ఆరు రోజులు బ్రేక్ దొరకడంతో టీమిండియా క్రికెటర్లంతా కుటుంబంతో గడిపేందుకు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ మాత్రం స్వస్థలానికి వెళ్లకుండా తిరుమల దర్శనానికి బయలుదేరి వెళ్లాడు. సతీసమేతంగా తిరుపతికి వచ్చిన సూర్యకుమార్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి ఇండోర్‌కు రానున్నాడు. ఇక నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆడిన సూర్యకుమార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
రెండో టెస్టుకు శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులోకి రావడంతో సూర్యకుమార్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. మూడు, నాలుగు టెస్టులకు కూడా సూర్య జట్టులో ఉన్నప్పటికి మేనేజ్‌మెంట్ అయ్యర్‌వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇండోర్, అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మూడు, నాలుగు టెస్టులకు జట్టును బీసీసీఐ ప్రకటించింది. రంజీల్లో ఆకట్టుకున్న జైదేవ్ ఉనాద్కట్ జట్టుతో చేరగా.. వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీ ఊడింది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ముంబై, విశాఖపట్నం, చెన్నై వేదికగా మూడు వన్డేలు జరగనున్నాయి. అనంతరం తొమ్మిది రోజుల గ్యాప్‌లో ఐపీఎల్ 2023 సీజన్‌కు తెరలేవనుంది.
ఇక తొలి రెండు టెస్టుల్లో భారీ విజయాలు సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు మరింత దగ్గరైంది. మిగిలిన రెండు టెస్టుల్లో ఒకటి గెలిస్తే చాలు(రెండు డ్రా చేసుకున్నా).. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం వరుసగా రెండు పరాజయాలతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి వైదొలిగేలా ఉంది. ఒకవేళ టీమిండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే గనుక ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడడం కష్టమే. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే టీమిండియాతో జరగనున్న రెండు టెస్టులను డ్రా చేసుకోవాల్సిందే.
భారత టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ , మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్.
Comments
Please login to add a commentAdd a comment