టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర జట్టు అవతరించింది. గత 3 సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండోసారి. 2019-20 సీజన్‌లో సైతం ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సౌరాష్ట్ర.. బెంగాల్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఓవరాల్‌గా నాలుగోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సౌరాష్ట్ర తొలిసారి 1935-37 సీజన్‌లో.. ఆతర్వాత 1943-44 సీజన్‌లో రంజీ టైటిల్‌ను సాధించింది.
ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో తొలి రెండు టెస్ట్‌ల కోసం ఎంపిక చేసిన టీమిండియాలో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్‌కు చోటు లభించిన విషయం తెలిసిందే. అయితే వివిధ సమీకరణల దృష్ట్యా రెండు మ్యాచ్‌ల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. ఈ మధ్యలో తన సొంత జట్టు సౌరాష్ట్ర రంజీ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి మూడో థాట్ పెట్టుకోని ఉనద్కత్.. తనను టీమిండియా నుంచి రిలీవ్ చేయాల్సిందిగా బీసీసీఐ పెద్దలను అభ్యర్ధించాడు. తనను రిలీవ్ చేస్తే, తన సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొంటానని కోరాడు. ఉనద్కత్ విన్నపాన్ని మన్నించిన బీసీసీఐ.. అతను కోరిన విధంగానే టీమిండియా నుంచి రిలీవ్ చేసింది.
దీంతో సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు మ్యాచ్‌కు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్‌లో రెక్కలు కట్టుకుని వాలిపోయాడు ఉనద్కత్. తన సారధ్యంలో సౌరాష్ట్రను రెండోసారి ఛాంపియన్‌గా నిలపడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అతను.. అనుకున్న విధంగానే అన్నీ తానై సౌరాష్ట్రను గెలిపించుకున్నాడు. ఫైనల్లో ఏకంగా 9 వికెట్లు (3/44, 6/85) పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం గెలిచాడు. ఉనద్కత్‌కు తన జట్టును గెలిపించుకోవాలన్న తపన, ఆకాంక్షను చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం రాకపోతేనేం, తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన జట్టుకు ఆడాలన్న అతని కమిట్‌మెంట్‌కు జేజేలు పలుకుతున్నారు. ఈ సీజన్‌లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఉనద్కత్.. 13.88 సగటున 26 వికెట్లు పడగొట్టాడు.
ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు..
బెంగాల్: 174 & 241
సౌరాష్ట్ర: 404 & 14/1
9 వికెట్ తేడాతో సౌరాష్ట్ర విజయం
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: జయదేవ్ ఉనద్కత్
ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: అర్పిత్ వసవద (ఉనద్కత్ గైర్హాజరీలో సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరించాడు, ఈ సీజన్‌లో రెండో లీడింగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు, 10 మ్యాచ్‌ల్లో 75.58 సగటున 3 సెంచరీల సాయంతో 907 పరుగులు చేశాడు, ఈ సీజన్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా మయాంక్ అగర్వాల్ నిలిచాడు, మయాంక్ 9 మ్యాచ్‌ల్లో 82.50 సగటున 3 సెంచరీల సాయంతో 990 పరుగులు చేశాడు)
Comments
Please login to add a commentAdd a comment