భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న రోహిత్ సేనపై విమర్శల పర్వం కొనసాగుతోంది. క్రికెట్ దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, అనిల్ కుంబ్లే తదితరులు న్యూజిలాండ్ చేతిలో ఓటమిని తట్టుకోలేక.. టీమిండియా వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్‌వుడ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు.
తొలిసారి -0-3తో వైట్‌వాష్
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన సిరీస్‌లో భారత జట్టు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. స్వదేశంలో కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల్లో ఓడి.. వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో ఈ చెత్త ఘనత సాధించిన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది.
ఫలితంగా ఘోర అవమానం మూటగట్టుకోవడంతో పాటు.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలనూ సంక్లిష్టం చేసుకుంది. తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టెస్టులు కచ్చితంగా గెలవాల్సిన స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో గావస్కర్ వంటి విశ్లేషకులు ఇక మనం డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు వదిలేసుకోవడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నిద్రపోయిన దిగ్గజానికి ఇదో మేలుకొలుపు
ఈ నేపథ్యంలో ఆసీస్ పేసర్ హాజిల్‌వుడ్ స్పందించిన తీరు మాత్రం వైరల్‌గా మారింది. ‘‘నిద్రపోయిన దిగ్గజానికి ఇదో మేలుకొలుపు. అయితే, వారు దీని నుంచి ఎలా బయటపడతారో చూద్దాం’’ అని హాజిల్‌వుడ్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా 3-0తో గెలవడం కంటే.. 0-3తో ఓడిపోవడమే వారికి మంచిదని అతడు అభిప్రాయపడ్డాడు.
కివీస్‌తో సిరీస్‌లో చాలా మంది బ్యాటర్లు విఫలమయ్యారని.. అయితే ఒకరిద్దరు మాత్రం అద్భుతంగా ఆడారని కొనియాడాడు. అయితే, ప్రస్తుతం టీమిండియాతో పోటీ ఎలా ఉండబోతుందో అంచనా వేయలేమని.. ఏదేమైనా ఫలితాలు మాత్రం తమకు అనుకూలంగా వస్తాయని హాజిల్‌వుడ్ ధీమా వ్యక్తం చేశాడు.
టీమిండియా మరింత స్ట్రాంగ్‌గా
ఇక ఇండియాలో ఒక్క టెస్టు గెలవడమే కష్టమని.. అలాంటిది క్లీన్‌స్వీప్‌తో కివీస్ ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని హాజిల్‌వుడ్ కొనియాడాడు. అయితే, భారత జట్టును తక్కువ అంచనా వేయబోమని.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత టీమిండియా మరింత స్ట్రాంగ్‌గా తిరిగివస్తుందని పేర్కొన్నాడు.
కాగా నవంబరులో రోహిత్ సేన ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో నాలుగు గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
చదవండి: 'బుమ్రా, గిల్ కాదు.. టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడే'
Comments
Please login to add a commentAdd a comment