విరాట్ కోహ్లితో గంభీర్
టీమిండియా ఆటగాళ్ల తీరుపట్ల హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమైనందుకు అందరికీ చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చేశారని.. ఇకముందైనా జాగ్రత్తగా ఉండాలని గౌతీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి.
కాగా గంభీర్ ప్రధాన కోచ్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత వన్డే, టీ20లలో బాగానే రాణిస్తున్న టీమిండియా.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు ఎదుర్కొంటోంది. గౌతీ మార్గదర్శనంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయడం మినహా ఇంత వరకు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది.
దారుణ వైఫల్యాలు
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్‌వాష్ కావడం.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) చేజార్చుకునే స్థితికి చేరడం విమర్శలకు దారి తీసింది. ఆసీస్‌తో తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. ఆ తర్వాత మాత్రం దారుణమైన ప్రదర్శనతో ఓటములు చవిచూస్తోంది.
స్టార్ బ్యాటర్ల వైఫల్యం
ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ వంటి స్టార్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ మూల్యం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టులు పూర్తి కాగా భారత జట్టుపై కంగారూలు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
అదే విధంగా.. ఐదు టెస్టుల సిరీస్‌ను కూడా టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. లేదంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. ఈ నేపథ్యంలో.. పరిస్థితి ఇంతదాకా తీసుకువచ్చిన టీమిండియా ఆటగాళ్లతో పాటు కోచ్‌లపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
చాలా ఎక్కువే చేశారు
ఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత జట్టు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న గంభీర్.. డ్రెసింగ్‌రూమ్‌లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘కోచ్‌గా నాకు కావాల్సినంత దక్కింది.. చాలా ఎక్కువే చేశారు’’ అంటూ అతడు మండిపడినట్లు తెలిపాయి. కాగా వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియాలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు తర్వాత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడాన్ని ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. గంభీర్‌తో రోహిత్‌కు సమన్వయం కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్- భారత్ మధ్య సిడ్నీలో జనవరి 3న ఐదో టెస్టు మొదలుకానుంది. ఇందులో గనుక విఫలమైతే రోహిత్ కెప్టెన్సీతో పాటు.. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?
Comments
Please login to add a commentAdd a comment